ధార్వాడ్‌ మెడిక‌ల్ కాలేజీలో 182 మందికి క‌రోనా

క‌ర్ణాట‌క రాష్ట్రం ధార్వాడ్‌లోని ఎస్‌డీఎం మెడిక‌ల్ కాలేజీలో క‌రోనా మ‌హమ్మారి క‌ల‌క‌లం చెల‌రేగింది. ఆ కాలేజీలో 300 మంది విద్యార్థులు, సిబ్బందికి గురువారం క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 66 మందికి పాజిటివ్ వ‌చ్చింది. దాంతో అప్రమ‌త్త‌మైన అధికారులు ఇవాళ మ‌రికొంద‌రు విద్యార్థులు, సిబ్బందికి కూడా ప‌రీక్ష‌లు చేశారు. 

దాంతో కాలేజీలో క‌రోనా బారిన‌ప‌డ్డ మొత్తం విద్యార్థుల సంఖ్య 182కు చేరింది. ప్ర‌స్తుతం బాధిత విద్యార్థులంద‌రినీ కాలేజీ క్యాంప‌స్‌లోనే క్వారెంటైన్‌లో ఉంచారు. ఈ నెల 17న కాలేజీలో నిర్వ‌హించిన ఫ్రెష‌ర్స్ పార్టీయే ఇప్పుడు మ‌హ‌మ్మారి విస్త‌ర‌ణ‌కు కార‌ణ‌మ‌ని ఆరోగ్యశాఖ అధికారులు నిర్ధారించారు. 

కాగా, ప్ర‌స్తుతం క‌రోనా బారిన‌ప‌డిన విద్యార్థులు, సిబ్బందిలో సగానికిపైగా రెండు డోసుల వ్యాక్సినేష‌న్ పూర్త‌యిన వారు ఉన్నార‌ని క‌ర్ణాట‌క హెల్త్ క‌మిష‌న‌ర్ డీ ర‌ణ‌దీప్ చెప్పారు. బాధితుల్లో కొత్త వేరియంట్ ఏదైనా ఉందేమో అనే సందేహంతో కొంత‌మంది శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపిన‌ట్లు ఆయ‌న తెలిపారు.

అయితే,  బాధితుల్లో ఎవ‌రిపైనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం తీవ్రంగా లేద‌ని, కొంద‌రిలో స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉండ‌గా, మ‌రికొంద‌రిలో అస‌లు ఎలాంటి ల‌క్ష‌ణాలు లేవ‌ని ఆరోగ్య‌శాఖ అధికారులు చెప్పారు.

 పాజిటివ్ కేసులు ఎక్కువ‌గా న‌మోదైన నేప‌థ్యంలో క్యాంప‌స్‌లోని మొత్తం 3000 మంది విద్యార్థులు, సిబ్బందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేయించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు. ఇప్ప‌టివ‌ర‌కు 1000 మంది విద్యార్థుల ప‌రీక్ష‌లు పూర్త‌య్యాయ‌ని, వారిలో కొంద‌రి రిపోర్టులు రావాల్సి ఉంద‌ని చెప్పారు.