నావికాదళంకు మరో అత్యాధునిక జలాంతర్గామి ‘వేలా’

దేశీయంగా నిర్మించిన ఐఎన్ఎస్ వేలా జలాంతర్గామి ముంబైలోని నావల్ డాక్‌యార్డ్‌లో చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ సమక్షంలో గురువారం భారత నావికాదళంలోకి ప్రవేశించింది.ఈ జలాంతర్గామిని ముంబయికి చెందిన మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ ఫ్రాన్స్‌కు చెందిన నావల్ గ్రూప్‌తో కలిసి నిర్మించింది.గతంలో తయారు చేసిన కల్వరి, ఖండేరి, కరంజ్ జలాంతర్గాములను ఇప్పటికే ప్రారంభించారు.

దీనితో దేశ నావికాదళ శక్తిని మరింత పెంచేందుకు మరో ఆధునిక జలాంతర్గామి అందుబాటు లోకి వచ్చిన్నట్లయింది. భారత్‌కు ఉన్న స్టెల్త్ స్కార్పీన్ శ్రేణి జలాంతర్గాముల్లో ఇది నాలుగోది. ప్రాజెక్ట్ 75 పేరుతో నిర్మిస్తున్న కల్వరీ శ్రేణికి చెందిన ఆరు జలాంతర్గాముల్లో ఇది నాలుగోది.

 ఫ్రాన్స్‌కు చెందిన నావల్ సంస్థ భాగస్వామ్యంతో స్కార్పీన్ శ్రేణి డిజైన్‌తో ముంబై లోని మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ దీన్ని రూపొందించింది. 2019 జులైలో దీని నిర్మాణాన్ని ప్రారంభించగా, 2019 మే నెలలో ఐఎన్‌ఎస్ వేలా గా నామకరణం చేశారు. పశ్చిమ కమాండ్ కేంద్రంగా ఇది పనిచేయనున్నది. సముద్ర యుద్ధ రీతుల్లో ఐఎన్‌ఎస్ వేలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆధునిక టార్పిడోలు, యాంటీ షిప్ క్షిపణులను ప్రయోగించగల సామర్ధం దీనికి ఉంది.
 
ఈ సబ్‌మెరైన్‌లో 8 మంది అధికారులు, 35 మంది సిబ్బంది ఉంటారు.ఇది డీజిల్ ఎలక్ట్రిక్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇందులోని సీ 303 , టార్పిడో కౌంటర్ మెజర్ సిస్టమ్ వంటి పరికరాలు ఉన్నాయి. 18 టార్పిడోలు లేదా యాంటీ షిప్ మిసైల్స్‌ను ఇది ప్రయోగించ గలదు.
 
సముద్రగర్భంలో అత్యంత రహస్యంగా శత్రువులను గుర్తించి లక్షాలను ఛేదించగలదు. 1973 2010 మధ్య కాలంలో భారత నావికాదళం లో మూడు దశాబ్దాల పాటు సేవలందించిన ఐఎన్‌ఎస్ వేలా గుర్తు గా తాజా జలాంతర్గామికి అదే పేరు పెట్టారు.
 
సోవియట్ ఆర్జిన్‌కు చెందిన ఫాక్స్‌ట్రాట్ క్లాస్ సబ్‌మెరైన్ అయిన నాటి ఐఎన్‌ఎస్ వేలాను 1973 ఆగస్టులో భారత నావికాదళం లోకి ప్రవేశ పెట్టారు. ఇది వేలా క్లాస్ జలాంతర్గాములకు నాయకత్వం వహించడమే కాక, సబ్‌మెరైనర్లకు శిక్షణకు కూడా ఉపయోగపడింది. ఎన్నో కీలక ఆపరేషన్లలో పాల్గొంది.
 
నేవీలో 37ఏళ్ల పాటు సేవలందించిన ఈ జలాంతర్గామిని 2010 జనవరిలో నావికాదళం నుంచి విరమించారు. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో దీన్ని రూపొందించామని, ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఇదో ముందడుగు అని నేవీ అధికారులు తెలిపారు.