నాటకీయంగా టిడిపికే కొండపల్లి మునిసిపల్ చైర్మన్ 

నాటకీయ పరిణామాల మధ్య జరిగిన కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో ఛైర్మన్‌గా టీడీపీ సభ్యుడు చెన్నుబోయిన చిట్టిబాబు ఎన్నికయ్యారు. ఎంపీ కేశినేని నాని ఓటుతో టీడీపీకి మెజారిటీ వచ్చింది. వైస్ ఛైర్మన్‌గా చుట్టుకుదురు శ్రీనివాసరావు, మరో వైస్ ఛైర్మన్‌గా కరిపికొండ శ్రీలక్ష్మీకి టీడీపీ సభ్యులు ఆమోదం తెలిపారు. అయితే హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల అధికారులు ఫలితాలను ప్రకటించలేదు.

కాగా కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠ భరితంగా జరిగింది. రెండు రోజులపాటు వైసిపి సభ్యులు విధ్వంసం సృష్టించడంతో ఎన్నికను నిరవధికంగా వాయిదా వేశారు. అయితే  హైకోర్టు జోక్యం చేసుకొని నేడు ఎన్నిక జరపవలసిందే అని స్పష్టం చేసింది. 

 ఎన్నిక ప్రక్రియను మరోసారి వాయిదా వేయించేందుకు వైసీపీ సభ్యులు కొత్త ఎత్తుగడ వేశారు. ఫలితం వెంటనే ప్రకటించ వద్దని హైకోర్టు చెప్పిన కారణాన్ని చూపుతూ కొత్త ప్రతిపాదన తీసుకువచ్చారు. సీక్రెట్ ఓటింగ్ పెట్టాలని ఎన్నికల అధికారిని  వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కోరారు. అయితే మున్సిపల్ యాక్ట్‌లో సీక్రెట్ ఓటింగ్ జరపాలని లేదని, చేతులెత్తి ఛైర్మన్‌ను ఎన్నుకునే ప్రక్రియనే చేపట్టాలని టీడీపీ సభ్యులు కోరారు.  

కొండపల్లి పురపాలక సంఘ ఎన్నికల్లో వైసీపీ 14 వార్డుల్లో విజయం సాధించగా, ఎక్స్‌ అఫిషియో సభ్యుడిగా వసంత కృష్ణప్రసాద్‌ ఉన్నప్పటికీ వారి బలం 15కే పరిమితం అయింది. టీడీపీ 14 వార్డుల్లో విజయం సాధించగా, స్వతంత్ర సభ్యురాలి చేరికతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 15కు చేరింది. ఎక్స్‌ అఫిషియోగా ఎంపీ కేశినేని నానీకి కోర్టు ఓటు హక్కును కల్పించడంతో టీడీపీ బలం 16కు పెరిగింది.