జగన్ మూడు రాజధానుల బిల్లు వెనక్కి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సోమవారం ఉదయం జరిగిన అత్యవసర క్యాబినెట్ సమావేశంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును వెనుకకు తీస్వముకోవాలని నిర్ణయించింది. ఈ నేపధ్యంలోనే రాష్ట్ర హైకోర్టులో రాజధాని అమరావతి కేసు విచారణకు రాగానే ప్రభుత్వ తరుపు న్యాయవాది మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించు కుంటున్నాను సంచలన ప్రకటన చేసారు. 
 
నిన్నటి వరకు రాజధాని రైతులు తరుపున న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ రోజు రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ శ్రీరాం త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణ ప్రారంభం అవుతూ ఉండటంతోనే ఆయన రాష్ట్ర హైకోర్టులో ఈ మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించు కుంటున్నాను, దీని పైన ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన చేయబోతున్నారని చెప్పారు. 
 
అయితే ఆయన ప్రకటన  విషయం పై స్పష్టత లేకపోవటంతో కోర్టు మరోసారి ప్రశ్నించింది. మళ్ళీ అడ్వొకేట్ జనరల్ చెప్తూమూడు రాజధానుల బిల్లు ఏదైతే ఉందో, సిఆర్డీఏ రద్దు చేయటం, ఈ రెండు బిల్లులు కూడా ప్రభుత్వం వెనక్కు తీసుకుంటుందని, ప్రభుత్వం ఈ విషయం పై అసెంబ్లీలో స్పష్టత ఇస్తుందని చెప్పారు.
 
ఏజీ ప్రతిపాదనను విన్న ధర్మాసనం తదుపరి విచారణను మధ్యాహ్నం 2:15కి వాయిదా వేసింది.ఇదే విషయంపై పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని  అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడుతూ సాంకేతికంగా చాలా సమస్యలు వస్తున్నాయనే మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలిపారు. మూడు రాజధానుల రద్దుపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కేబినెట్‌ నిర్ణయాన్ని అసెంబ్లీలో ప్రకటిస్తామన్నారు. 
 
మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అమరావతి జేఏసీ నేతలు తెలిపారు. ఏపీ రాజధానిగా అమరావతే ఉండాలని , అసెంబ్లీ, హైకోర్టు అన్నీ ఇక్కడే ఉండాలని స్పష్టం చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్ మనసు మార్చుకుని ఈ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోసంగా ఉందని చెప్పారు. 
 
ఏ ప్రభుత్వమైనా ప్రజావ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని అమరావతి జేఏసీ నేతలు ఈ సందర్భంగా పేర్కొన్నారు.  అమరావతిని త్వరగా అభివృద్ధి చేయాలని, అమరావతిని విమర్శించినవాళ్లు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని స్పష్టం చేస్తూ రాజధానిగా అమరావతిని ప్రకటించేవరకూ తమ ఉద్యమం ఆగదని, రైతుల మహాపాదయాత్ర కొనసాగుతుందని వెల్లడించారు. 
 
న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్ర నెల్లూరు జిల్లా కావలిలో అడుగుపెట్టిన తర్వాత ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించడం శుభపరిణామమని అన్నారు. అయితే ప్రభుత్వం అమరావతినే రాజధానిగా ప్రకటించేవరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.