భార‌త నౌకాద‌ళంలోకి ఐఎన్ఎస్ విశాఖ‌ప‌ట్నం

భార‌త నావికాద‌ళంలోకి మ‌రో నూత‌న యుద్ధ‌నౌక‌ను ప్ర‌వేశ‌పెట్టారు. దేశీయంగా రూపొందించిన ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధ‌నౌక‌ను ఇవాళ‌ జాతికి అంకితం చేశారు. ముంబై తీరంలో రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా ఈ నౌకను నావికాద‌ళంలో ప్ర‌వేశ‌పెట్టారు. దీన్ని విశాఖపట్నంలో మోహరించనున్నారు. 

ఈ స‌ద‌ర్భంగా మాట్లాడిన రాజ్‌నాథ్ సింగ్‌.. మేక్​ ఇన్​ ఇండియాలో భాగంగా స్వదేశీ నౌకలు, జలాంతర్గాముల తయారీలో భారత్​ ముందంజలో ఉన్న‌ద‌ని తెలిపారు. దేశం కోసం మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల అవసరాలను తీర్చేందుకు నౌకలను నిర్మించే సత్తా భారత దేశానికి ఉందని చెప్పారు. 
 
 భావి అవసరాలకు తగినట్లుగా దీనిని తయారు చేసినట్లు చెప్పారు. ఈ నౌక జల ప్రవేశంతో ప్రాచీన, మధ్య యుగాలనాటి భారత దేశ సముద్ర రంగ శక్తి, సామర్థ్యాలు, నౌకా నిర్మాణ నైపుణ్యాలు, ప్రతిష్ఠాత్మక చరిత్ర గుర్తుకొస్తున్నాయని రక్షణ మంత్రి పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భాగస్వామ్య దేశాల ప్రయోజనాలకు రక్షణ ఉండేవిధంగా చట్టబద్ధ నిబంధనలు అమలుకావాలని కోరుకుంటున్నట్లు రాజనాథ్ సింగ్ తెలిపారు. నౌకాయానం స్వేచ్ఛగా జరగాలని, సార్వత్రిక నియమాలు అమలు కావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. 

ఈ ప్రాంతం భద్రత విషయంలో భారత దేశం చాలా ముఖ్యమైనది కావడం వల్ల భారత నావికా దళం పాత్ర మరింత ముఖ్యమైనదిగా మారిందని ఆయన వివరించారు. ప్రపంచవ్యాప్తంగా భద్రతా వ్యయం 2023 నాటికి 2.1 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందనే అంచనా ఉందని గుర్తు చేశారు. 

అందువల్ల భారత దేశం తన శక్తి, సామర్థ్యాలను సంపూర్ణంగా వినియోగించుకునేందుకు, స్వదేశీ నౌకా నిర్మాణ కేంద్రంగా మన దేశాన్ని తీర్చిదిద్దడానికి అవకాశం ఉన్నట్లు చెప్పారు. పరిశ్రమల అవగాహన కార్యక్రమాల్లో పాలుపంచుకునేందుకు నిరంతరం కృషి చేస్తున్నందుకు, ‘ఫ్లోట్’, ‘మువ్’, ‘ఫైట్’ కేటగిరీలలో స్వదేశీ ఐటమ్స్‌ను పెంచినందుకు  భారత నావికా దళాన్ని అభినందించారు. 

ఇప్పటి వరకు సాధించిన విజయాల వేగాన్ని కొనసాగించడం చాలా ముఖ్యమని చెప్పారు. భారత దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించే పథకం ‘మేక్ ఇన్ ఇండియా’ వల్ల భారత నావికా దళం 2014లో 76 శాతం ఎయిర్ ఆపరేషన్స్ నెట్, 66 శాతం కాస్ట్ బేసిస్ కాంట్రాక్టులను మన దేశంలోని అమ్మకందారులకు అప్పగించినట్లు రక్షణ మంత్రి  తెలిపారు. 

నావికా దళ ఆయుధాల్లో 90 శాతం వరకు స్వదేశీ ఆయుధాలను సమకూర్చుకునే అవకాశం కలిగిందని ఆయన చెప్పారు. ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధ నౌకను ప్రాజెక్టు 15బీలో భాగంగా మజగావ్ షిప్ బిల్డర్స్ దేశీయంగా నిర్మించింది. ఇది స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ నౌక. ఇటువంటి నాలుగు నౌకలను తయారు చేస్తారు. వీటిలో మొదటిదానిని ఆదివారం జల ప్రవేశం చేయించారు. 

ఈ యుద్ధ‌నౌక నుంచి బ్రహ్మోస్ సూపర్‌ సోనిక్‌ క్షిపణులతో సహా పలురకాల క్షిపణులను ప్రయోగించవచ్చు. ఈ నౌక కదలిక‌ల‌ను శత్రుదేశాల‌ రాడార్లు గుర్తించలేని విధంగా అధునాతన పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. జలాంతర్గాములను కూడా గుర్తించి దాడి చేయడానికి వీలుగా శక్తిమంతమైన టోర్పెడోలను పొందుపరిచారు. అదేవిధంగా ఇందులో రెండు మల్టీరోల్‌ హెలికాప్టర్లు ఉంటాయి. 
 
నౌక శిఖర భాగంలో ఏర్పాటు చేసే ముద్రలో విశాఖలోని డాల్ఫిన్‌నోస్‌ కొండ, దానిపై ఉండే దీపస్తంభానికి స్థానం కల్పించారు. నౌక గుర్తింపు చిహ్నంగా కొమ్ములతో కనిపించే కృష్ణజింక ముఖ భాగాన్నిఖరారు చేశారు. అత్యంత అప్రమత్తతకు, తీవ్రమైన వేగానికి కృష్ణజింకలు నిదర్శనంగా నిలుస్తాయన్న ఉద్దేశంతో ఆ చిహ్నాన్ని ఎంచుకున్నారు.