కేంద్రం గురి పెట్టిందంటే తట్టుకోలేవు కేసీఆర్  

కేసీఆర్ నీ‎కు చేతకాకపోతే దిగిపో, ప్రజలను  బీజేపి  పాలిస్తుందని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి హితవు చెప్పారు. కేంద్రం గురి పెట్టిందంటే తట్టుకోలేవు కేసీఆర్ అంటూ ఆమె హెచ్చరించారు. కేంద్రంపై నెపం వేసి రైతుల జీవితాలతో కేసీఆర్ ఆడుకుంటున్నాడని ఆమె ధ్వజమెత్తారు.

కమీషన్ల కోసమే కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని ఆమె మండిపడ్డారు. ‘రైతులను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తుంది. అసెంబ్లీ సాక్షిగా హామి ఇచ్చి.. ఇవాళ తాను చెప్పలేదని కేసీఆర్ అబద్ధాలు ఆడుతున్నాడు.’ అంటూ ఆమె విమర్శించారు.

కమీషన్ల కోసమే కేసీఆర్ డ్రామాలు అంటూ కడుపు నిండా తిన్న తర్వాత ధర్నా చేయడం కాదని ఆమె ఎద్దేవా చేశారు. “ధాన్యం కోనుగోలు చేయాలి. కేసీఆర్‎ నీకు కమీషన్లు కావాలంటే చందాలు వసూలు చేసి ఇస్తాం.. రైతులని ఇబ్బంది పెట్టొద్దు” అంటూ ఆమె హితవు చెప్పారు. 

బాయిల్డ్ రైస్ కొనలేమని కేంద్రం ముందే చెప్పిందని, అయినా కేసీఆర్  ప్రభుత్వం రాజకీయాలకు పాల్పడుతోందని ఆమె మండిపడ్డారు. లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి మూడేండ్లు అయినా ఎందుకు చేయలేదు? అని ఆమె ప్రశ్నించారు. హుజారాబాద్ ఓటమితో కేసీఆర్‎కు భయం పట్టుకుందని ఆమె చెప్పారు. 

హమాలీలకు కేంద్రం ఇచ్చిన డబ్బులను కేసీఆర్ వాడుకున్నారని ఆమె ధ్వజమెత్తారు. కేసీఆర్.. తోక పార్టీ కాంగ్రెస్ ధర్నా చేయడం సిగ్గు చేటని ఆమె విమర్శించారు. “మీరు మీ డ్రామాలు ఆపండి. ప్రజలకు కేసీఆర్ డ్రామాలు అర్థమయ్యాయి” అని ఆమె స్పష్టం చేశారు. కొత్త రైతు చట్టలతో రైతులకు మేలు కలుగుతుందని ఆమె చెప్పారు. సూర్యాపేటలో రైతుల ముసుగులో టీఆర్ఎస్ గూండాలు బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కాన్వాయ్ పై  దాడి చేశారని ఆమె ఆరోపించారు.