అసంఘటిత కార్మికుల్లో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు

దేశంలో అసంఘటిత కార్మికుల్లో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు ఉన్నారు. 40.5 శాతం ఓబీసీలు, 27.4 శాతం జనరల్‌ కేటగిరి, 23.7 శాతం ఎస్సీ, 8.3 శాతం ఎస్టీలు ఉన్నారు.  ‘ఇ-శ్రమ్‌’ పోర్టల్‌లో తాజా అసంఘటిత కార్మికుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఏ ఏ సామాజిక తరగతులకు చెందినవారు అసంఘటిత కార్మికులుగా పనిచేస్తున్నారన్నది వెలుగులోకి తీసుకొచ్చింది.

ఇప్పటివరకూ   ‘ఇ-శ్రమ్‌’    పోర్టల్‌లో 7.86 కోట్ల మంది కార్మికులు రిజిస్ట్రేషన్‌ చేసుకోగా, ఇందులో 51.61 శాతం మహిళా కార్మికులున్నారు. రిజిస్ట్రేషన్లలో ఎక్కువగా వ్యవసాయ, అనుబంధ రంగాల (53.6శాతం) కార్మికులవే ఉన్నాయి. నిర్మాణరంగ కార్మికులు 12.2 శాతం, ఇళ్లల్లో పనిచేసే కార్మికులు 8.71శాతం ఉన్నారు.

రాష్ట్రాల వారీగా వ్యవసాయ రంగంలో పనిచేస్తును అసంఘటిత కార్మికుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి: అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో కోటీ 5 లక్షల రిజిస్ట్రేషన్లు (13.35 శాతం) నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానాల్లో ఒడిషా-82.6 లక్షలు (10.5 శాతం), ఉత్తరప్రదేశ్‌-71.9 లక్షలు (9.15 శాతం), బీహార్‌-44.9 లక్షలు (5.71 శాతం), జార్ఖాండ్‌-23.82 లక్షలు (3.03 శాతం). 

నిర్మాణరంగ కార్మికుల్లోనూ అత్యధిక రిజిస్ట్రేషన్లు పశ్చిమ బెంగాల్‌లో నమోదయ్యాయి. కార్మికుల ఆదాయ వివరాల్ని కూడా పోర్టల్‌లో నమోదు చేశారు. దీని ప్రకారం మొత్తం కార్మికుల్లో 92 శాతం మంది ఆదాయం రూ.10 వేల లోపే ఉందని తేలింది. 

రూ.10 వేల నుంచి రూ.15 వేల మధ్య ఆదాయం కలిగినవారు కేవలం 6 శాతం మంది ఉన్నారు. రూ.15 వేలు-రూ.18 వేల మధ్య ఆదాయమున్నవారు 1 శాతం కాగా, రూ.18 వేల నుంచి రూ.21 వేల మధ్య ఆదాయంగల వారు 0.5 శాతమున్నారు. పోర్టల్‌లో 86.33 శాతం కార్మికుల బ్యాంక్‌ ఖాతా నెంబర్లు అనుసంధానం అయ్యాయి.