యూరప్‌ లో కరోనా ఉధృతి పట్ల డబ్ల్యుహెచ్‌ఒ తీవ్ర ఆందోళన

యూరప్‌ దేశాల్లో కోవిడ్‌ ఉధృతి పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయాల్సిన అవసరాన్ని డబ్ల్యుహెచ్‌ఒ ఛీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ నొక్కి చెప్పారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కోవిడ్‌ పరిస్థితిని ఆమె సామాజిక మాధ్యమాల్లో మూడు ధోరణలుగా వివరించారు.

యూరప్‌, అమెరికా, పశ్చిమ పసిఫిక్‌ ప్రాంతాల్లో కోవిడ్‌ కేసులు పెరుగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్‌ కారణంగా వారానికి దాదాపు 50 వేల మంది చనిపోతున్నట్లు ఆమె పేర్కొన్నారు. భౌతిక దూరం పాటిస్తూ, బహిరంగ ప్రదేశాల్లో ముఖానికి మాస్కులు ధరిస్తూ, కోవిడ్‌ జాగ్రత్తలన్నీ పాటించాల్సిన అవసరం వుందని ఆమె తెలిపారు. భారత్‌కు కోవిడ్‌ మూడో వేవ్‌ పొంచివుందన్న ఆందోళనల నేపథ్యంలో సౌమ్య స్వామినాథన్‌ ప్రకటన వెలువడింది.

2021లో కోవిడ్‌ శిఖరాగ్రస్థాయికి చేరి మరణాలు, కేసులు పెద్ద సంఖ్యలో నమోదైన సంగతి తెలిసిందే. ఆక్సిజన్‌, మంచాలు వంటి కనీస అవసరాలు కూడా లేకపోవడంతో ప్రజానీకం కడగండ్లను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో దేశంలో టీకాలు వేయడం మొదలుపెట్టినా ఇప్పటికీ కేవలం 27 శాతం జనాభాకు మాత్రమే రెండు డోసులు టీకాలు పూర్తయ్యాయి.

డబ్ల్యుహెచ్‌ఒ పేర్కొన్న మూడు ధోరణులు

1. యూరప్‌లో పరిస్థితి చాలా ఆందోళనకరంగా వుందన్నారు. కేసులు 8 శాతం పెరగగా, మరణాలు 5 శాతం పెరిగాయి. అన్ని దేశాల్లోనూ వ్యాక్సిన్లు వేసుకోని వారే ఎక్కువగా చనిపోతున్నారని ఆమె తెలిపారు.

2. మృత్యువాత పడుతున్నవారిలో టీకా వేసుకోనివారే అధికమని ఆమె పేర్కొన్నారు. యూరప్‌లో 35 శాతానికి పైగా జనాభా ఇంకా పూర్తిగా వ్యాక్సిన్‌ వేసుకోవాల్సి వుందన్నారు.

3. డెల్టా వేరియంట్‌ ఇంకా ప్రబలంగానే వుందని కూడా సౌమ్యా స్వామినాథన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. గత రెండు వారాల్లోనూ నమోదైన కేసుల్లో 99.7 శాతం డెల్టా వేరియంట్‌కి చెందిన కేసులేనన్నారు. దక్షిణ అమెరికాలో ఇంకా మ్యు, లాంబ్డా రకాలు కూడా వున్నాయన్నారు.