ఆర్ధిక నేరగాళ్ళ కోసం అన్ని మార్గాలు ఆశ్రయిస్తున్నాం 

దేశం వదిలి పారిపోయిన ఆర్థిక నేరగాళ్లను వెనక్కి తీసుకురావడానికి తమ ప్రభుత్వం దౌత్యపరమైన సహా అన్ని మార్గాలను ఆశ్రయిస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.  ఆర్థికాభివృద్ధి, ఆటంకాలు లేని రుణ ప్రవాహం కోసం వేర్వేరు వ్యవస్థల మధ్య సత్సంబంధాలు, సహకారాన్ని సృష్టించడంపై జరిగిన సమావేశంలో మోదీ మాట్లాడుతూ మొదటి సారిగా ఆర్ధిక నేరగాళ్ల గురించి కఠినంగా మాట్లాడారు. 

నిర్దిష్ట నేరస్థులెవరినీ ప్రస్తావించకుండా మోదీ, “పరారీలో ఉన్నవారిని (ఆర్థిక నేరస్థులను) తిరిగి తీసుకురావడానికి మేము చేసిన ప్రయత్నంలో మేము విధానాలు, చట్టంపై ఆధారపడ్డాము మరియు దౌత్య మార్గాలను కూడా ఉపయోగించాము. సందేశం చాలా స్పష్టంగా ఉంది — మీ దేశానికి తిరిగి వెళ్లండి. మేము ఈ ప్రయత్నాలను కొనసాగిస్తున్నాము” తెలిపారు.

బ్యాంక్ మోసాలు, మనీలాండరింగ్ కేసులకు సంబంధించి విజయ్ మాల్యా, నీరవ్ మోడీ వంటి ఉన్నత స్థాయి ఆర్థిక నేరగాళ్లను అప్పగించడానికి భారతదేశం ఇటీవలి కాలంలో ప్రయత్నాలను వేగవంతం చేసింది. బ్యాంకులు సంపద, ఉద్యోగ సృష్టికర్తలకు చురుకైన రుణాలను అందించాలని కోరుతూ, సరైన శ్రద్ధతో ఇచ్చిన ఏవైనా రుణాలకు అండగా నిలుస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.

ఉద్దేశపూర్వకంగా రుణాలను ఎగ్గొట్టినవారి నుంచి రూ.5 లక్షల కోట్లు రాబట్టగలిగినట్లు ప్రధాని ఈ సందర్భంగా  వెల్లడించారు. ఇటీవల ఏర్పాటు చేసిన నేషనల్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ ద్వారా మరొక రూ.2 లక్షల కోట్ల స్ట్రెస్‌డ్ అసెట్స్‌ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. తన ప్రభుత్వం బ్యాంకింగ్ రంగంలో అమలు చేస్తున్న సంస్కరణల వల్ల తెర మరుగున ఉన్న భారీ నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు)ను వెలికి తీయగలిగామని చెప్పారు.  ఆరు, ఏడు సంవత్సరాల నుంచి చేపడుతున్న అనేక సంస్కరణల వల్ల భారత దేశ బ్యాంకింగ్ రంగం బలోపేతమైందని చెప్పారు.
లక్షలాది మంది పేదలకు వారి జన్‌ ధన్ ఖాతాలకు నేరుగా డబ్బు జమ చేసి, తక్షణ సాయం అందజేయడం సాధ్యమైందని గుర్తు చేశారు. బ్యాంకుల వ‌ద్ద రుణం తీసుకుని ఎగ్గొట్టి పారిపోయేవాళ్లు ఉన్నార‌ని, దాని గురించి అంద‌రూ చ‌ర్చిస్తార‌ని, కానీ ఓ ప్ర‌భుత్వం చాలా సాహ‌సం చేసి ఆ రుణఎగ‌వేత దారుల‌ను ప‌ట్టుకువ‌స్తుంద‌ని, దాని గురించి ఎవ‌రూ చ‌ర్చించుకోవ‌డం లేద‌ని చెప్పారు.
2014 క‌న్నా ముందు ఉన్న అన్ని స‌మ‌స్య‌ల‌కు తాము దారులు వెతికిన‌ట్లు ఆయ‌న చెప్పారు. ఎన్పీఏ స‌మ‌స్య‌ల‌ను, బ్యాంకుల రిక్యాపిట‌లైజేష‌న్‌, ఐబీసీ సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టామ‌ని పేర్కొన్నారు. అప్పుల రిక‌వ‌రీ కోసం ట్రిబ్యున‌ల్‌ను బ‌లోపేతం చేసిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. నిరర్థక ఆస్తుల సమస్యను పారదర్శకంగా పరిష్కరించడం, రీక్యాపిటలైజింగ్ చేయడం ద్వారా బ్యాంకులను తన ప్రభుత్వం బలోపేతం చేసిందని వివరించారు.
ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్ట్‌సీ కోడ్ ఓ పరివర్తక శాసనమని ప్రధాని  చెప్పారు. నేడు భారతీయ బ్యాంకులు ఎంతగా బలపడ్డాయంటే, అవి దేశ ఆర్థిక వ్యవస్థను శక్తిమంతం చేయగలిగే   స్తోమతను సంపాదించాయని పేర్కొన్నారు. భారత దేశం స్వయం సమృద్ధమవడంలో బ్యాంకులు విస్తృత స్థాయిలో తమ వంతు పాత్రను పోషించగలవని ప్రధాని భరోసా వ్యక్తం చేశారు.
కస్టమర్లు బ్యాంకులను సందర్శించే వరకు వేచి చూడకుండా, బ్యాంకులే ఆర్థికావసరాలుగలవారికి చేరువ కావాలని ప్రధాని పిలుపునిచ్చారు. కరోనా వేళ కూడా బ్యాంకులు మెరుగ్గా కోలుకున్న‌ట్లు చెప్పారు. బ్యాంకులు మ‌రింత బ‌లోపేతం అవుతున్నాయ‌ని, వాటిల్లో కొత్ శ‌క్తి వ‌చ్చిన‌ట్లు ఆయన తెలిపారు.
పాత కాలం పద్ధతులను వదులుకుని, అభివృద్ధిలో కస్టమర్లను భాగస్వాములను చేయాలని బ్యాంకులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారు. ‘‘ఆమోదించేవారు-దరఖాస్తుదారు’’ అనే పాత పద్ధతిని పక్కనబెట్టి, ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక సమ్మిళిత చర్యలకు మద్దతిస్తూ, చిన్న తరహా పరిశ్రమలకు చురుగ్గా వెన్నుదన్నుగా నిలవాలని చెప్పారు. దేశం సమ్మిళితంగా ఆర్థికాభివృద్ధి సాధించడం కోసం నూతన ఆలోచనల్లో పెట్టుబడులు పెట్టేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని హితవు చెప్పారు.