కాశ్మీర్ లో కాంగ్రెస్ కు సీనియర్ నేతలు రాజీనామా

జమ్మూ-కశ్మీరు శాసన సభ ఎన్నికలు త్వరలో జరుగుతాయనే ఊహాగానాల నడుమ కాంగ్రెస్‌ పార్టీలోని తమ పదవులకు 20 మంది సీనియర్ నేతలు రాజీనామా చేశారు. వీరంతా ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభలో మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌కు అత్యంత సన్నిహితులు కావడం గమనార్హం. 

ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో పార్టీ నాయకత్వాన్ని మార్చాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలోని పార్టీ పరిస్థితుల గురించి పార్టీ అధిష్టానంపై తెలియచెప్పడం కోసం గత ఏడాదిగా సమయం కోరుతున్నా తమకు అవకాశం ఇవ్వడం లేదని వారు ఈ సందర్భంగా ఆరోపించారు. కాంగ్రెస్ లో సంస్థాగత ఎన్నికలు కావాలని  సోనియా గాంధీకి లేఖ వ్రాసిన 23 మందిలో ఆజాద్ కూడా ఉండడం గమనార్హం. 

  కాంగ్రెస్ పార్టీ పదవులకు రాజీనామాలు సమర్పించినవారిలో మాజీ మంత్రులు జీఎం సరూరీ, వికార్ రసూల్, డాక్టర్ మనోహర్ లాల్ శర్మ ఉన్నారు. వీరితోపాటు జుగల్ కిశోర్ శర్మ, గులాం నబీ మోంగ, నరేశ్ గుప్తా, మహమ్మద్ అమిన్ భట్, సుభాశ్ గుప్తా, అన్వర్ భట్, అనియతుల్లా రాథేర్ కూడా తమ పదవులకు రాజీనామాలు  సమర్పించారు.

జీఎన్ మోంగ, వికార్ రసూల్ మీడియాతో మాట్లాడుతూ, తాము తమ పార్టీ పదవులకు రాజీనామా చేసినట్లు తెలిపారు. జమ్మూ-కశ్మీరు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి జీఏ మిర్‌ను మూడేళ్ళ కాలానికి నియమిస్తున్నట్లు తమకు గతంలో చెప్పారని, ఇప్పటికి ఏడేళ్ళు అవుతున్నా, ఆయనను మార్చడం లేదని విస్మయం వ్యక్తం చేశారు.

జమ్మూ-కశ్మీరులో కాంగ్రెస్ నాయకత్వాన్ని మార్చకపోతే తాము పార్టీ పదవులను నిర్వహించబోమని పార్టీ అధిష్ఠానానికి తెలిపామని పేర్కొన్నారు. 20 రోజుల క్రితమే దీనికి సంబంధించిన లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించినట్లు చెప్పారు.

రాహుల్ గాంధీ, జమ్మూ కాశ్మీర్ ఇన్‌ఛార్జ్ సెక్రటరీ రజనీ పాటిల్‌కు కూడా రాజీనామా లేఖ ప్రతులను పంపారు. మీర్ అధ్యక్షతన ఈ సరిహద్దు ప్రాంతంలో  కాంగ్రెస్ వినాశకరమైన పరిస్థితికి వెళుతోందని, ఇప్పటికే  200 మందికి పైగా నేతలు పార్టీని వీడారని వారా లేఖలో తెలిపారు.  కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పీసీసీ ఆఫీస్‌ బేరర్లు, జిల్లా అధ్యక్షులు, ఏఐసీసీ సభ్యులు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరగా, మరికొందరు సైలెంట్‌ మోడ్‌లో ఉన్నారని చెప్పారు.

“కొందరు చిత్తశుద్ధి లేని భజనపరులు  పిసిసి పనితీరును స్వాధీనం చేసుకున్నారు. హైజాక్ చేసారు. సీనియర్ నాయకులు, జిల్లాల సిట్టింగ్ ఎమ్మెల్యేలు/ఎమ్మెల్సీలను సంప్రదించకుండానే పార్టీ పదవులు పంచారు” అంటూ వారు తీవ్రమైన విమర్శలు చేశారు. పార్లమెంటు, డీడీసీ, బీడీసీ, పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలతో సహా అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒకదాని తర్వాత ఒకటి ఓడిపోయిందని, జమ్మూకశ్మీర్‌లో ఒక్క కౌన్సిల్‌ను కూడా ఏర్పాటు చేయలేకపోయిందని, ఈ నేతలు పార్టీ అధిష్ఠానంకు గుర్తు చేశారు.