కుప్పంలో టిడిపికి ఎదురు దెబ్బ.. వైసిపి ఘన విజయం

ఆంధ్రప్రదేశ్‌లో మూడు విడతలుగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఘోరం ఓడి పోయింది. అధికార వైఎస్సార్‌సీపీ దర్శి, కొండపల్లి మినహా అన్ని మున్సిపాల్టీలను కైవసం చేసుకుంది. ఏపీలో ఉన్న 12మున్సిపాల్టీలు, ఒక కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల కౌంటింగ్‌ బుధవారం నిర్వహించారు.

 టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో మొదటిసారిగా వైసీపీ జెండా ఎగిరింది. ఊహించని రీతిలో టీడీపీ ఘోర పరాజయం పాలవ్వగా.. వైసీపీ ఘన విజయం సాధించింది. మొత్తం 25 స్థానాలకు ఎన్నికలు జరగ్గా అధికార వైసీపీ మొత్తం 18 స్థానాల్లో గెలిచింది. టీడీపీ కేవలం 6 వార్డుల్లో మాత్రమే గెలిచింది. 14వ వార్డు వివాదాస్పద రీతిలో ఏకగ్రీవమైంది.

నెల్లూరు నగర పాలక సంస్థలో అధికార వైఎస్సార్‌సీపీ భారీ విజయం సాధించింది. ఈ కార్పొరేషన్‌లో ఉన్న అన్ని వైఎస్సార్‌సీపీ స్థానాలను కైవసం చేసుకోగా తెలుగుదేశం పార్టీ ఏ ఒక్క స్థానాన్ని దక్కించుకోలేక పోయింది. ఈ కార్పొరేషన్‌లో మొత్తం 54 డివిజన్లు ఉండగా 54 చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపొందారు. మొత్తం 8 డివిజన్లలో వైస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

గుంటూరు జిల్లాలోని గురజాల నగర పంచాయతీలో 20 వార్డులకు గానూ.. 16వైఎస్సార్‌సీపీ, 3 టీడీపీ గెలవగా.. ఒక్క స్థానంలో జనసేన గెలిచింది. దాచేపల్లి నగర పంచాయతీలో 20 వార్డులకు ఎన్నికలు జరగగా.. 11 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ, 7 వార్డుల్లో టీడీపీ విజయం సాధించాయి. జననేన 1, స్వతంత్ర అభ్యర్థి ఒకరు వార్డులో గెలిచారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడు నగర పంచాయతీని వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. 20 వార్డులకుగానూ వైఎస్సార్‌సీపీ 12, టీడీపీ 4 వార్డుల్లో విజయం సాధించింది. జనసేన 3 స్థానాల్లో గెలవగా.. ఒక్క స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.

దర్శి మున్సిపాల్టీలో టీడీపీ విజయం సాధించింది. మొత్తం 20 వార్డుల్లో 13 స్థానాలను టీడీపీ అభ్యర్థులు దక్కించుకోగా అధికార వైఎస్సార్‌సీపీ7 స్థానాల్లో గెలుపొందింది. కృష్ణా జిల్లాలోని కొండపల్లి పురపాలిక ఎన్నిక హోరాహోరీగా సాగింది. మొత్తం 29 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ 14, టీడీపీ 14 వార్డుల్లో అభ్యర్థులు విజయం సాధించారు. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి (టీడీపీరెబల్‌‌) గెలుపొందారు. అయితే గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి శ్రీలక్ష్మి.. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరారు. ఫలితంగా కొండపల్లిలో సైకిల్ పార్టీ బలం 15కి చేరింది.

కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట, కొండపల్లి, గుంటూరు జిల్లాలోని దాచేపల్లి, గురజాల, పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడు, నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరపాలక సంస్థతోపాటు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కుప్పం, కర్నూలు జిల్లా నందికొట్కూరు, బేతంచెర్ల, కడప జిల్లాలోని రాజంపేట, కమలాపురం, అనంతపురం జిల్లాలోని పెనుకొండ మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. ఒక్క ప్రకాశం జిల్లాలోని దర్శి మినహా అన్ని మున్సిపాలిటీలను, నగర పంచాయతీలను వైసీపీ కైవసం చేసుకుంది.

ఏపీలో వైఎస్సార్‌సీపీని ఆదరించిన నగర, మున్సిపల్‌ ఓటర్లకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.  దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు.. ఇవే ఈ రోజు ఇంతటి ఘన విజయాన్ని అందించాయని పేర్కొన్నారు. గ్రామంతో పాటు నగరం కూడా పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 100కు 97 మార్కులు వేసిన అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్ళు, సోదరులందరికీ ధన్యవాదాలని  పేర్కొన్నారు.