సంజయ్ పై దాడిపై గవర్నర్ కు ఫిర్యాదు 

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ వాహనంపై, పలువురు నేతలపై టీఆర్ఎస్  దాడికి సంబంధించి బీజేపీ నేతలు  తెలంగాణ గవర్నర్‌ తమిళి సై సౌందర్‌ రాజన్‌ ను రాజ్‌భవన్‌లో కలిశారు. బీజేపీ నేతలు రాజాసింగ్, డీకే అరుణ, రఘునందన్‌రావు, ఈటల రాజేందర్ తదితరులు గవర్నర్‌కు వినతి పత్రం ఇచ్చారు. నల్లగొండ ఘటనలో పోలీసుల వైఫల్యంపై గవర్నర్‌కి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.
 
అనంతరం బీజేపీ నేత డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ వరి దాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. నల్గొండ జిల్లాలో వరి ధాన్యాలు కొనుగోలు విషయంలో పర్యటించిన బండి సంజయ్‌ దాడి చేశారని దుయ్యబట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకే బండి సంజయ్‌పై దాడి జరిగిందని ఆరోపించారు. 

రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ హుజురాబాద్ ఉప ఎన్నిక ఓటమీ జీర్ణించుకోలేక కేసీఆర్ బీజేపీ నేతలపై దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. ఇదే విషయంపై గవర్నర్‌కు వినతిపత్రం అందించామని తెలిపారు. కేంద్ర కొనుగోలు చేయడం లేదని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. 

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ  40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ సెంటర్ల వద్ద ఉన్న ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులు పెడుతుందని ఆయన మండిపడ్డారు. సివిల్ సప్లై కార్పోరేషన్‌కు డబ్బులు ఇవ్వకుండా ధాన్యం కొనుగోలు చేయకుండా ముఖ్యమంత్రి ఆపుతున్నారని అనుమనం వ్యక్తం చేశారు. వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి రైతుల ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు.

పోలీసులపై టీఆర్ఎస్ దాడి!

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జిల్లాల పర్యటన సందర్భంగా రెండోరోజు కూడా ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. సూర్యాపేట జిల్లా చివ్వెంల ఐకేపీ సెంటర్ లో వడ్ల కొనుగోళ్లను పరిశీలించేందుకు సంజయ్ వెళ్లగా టీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. 
రెండు వర్గాలు రాళ్లు, చెప్పులు, కర్రలు విసురుకున్నారు. అర్వపల్లి దగ్గర పోలీసులపైకి దూసుకెళ్లారు.  టీఆర్ఎస్  కార్యకర్తలు. కర్రలతో పోలీసులపై దౌర్జన్యం చేశారు. తమనే అడ్డుకుంటారా అంటూ కర్రలతో దాడి చేయడానికి ప్రయత్నించారు. పోలీసులను అక్కడ్నుంచి తరిమికొట్టే ప్రయత్నం చేశారు. 
 
దీంతో అక్కడ చాలాసేపు ఉద్రిక్త పరిస్తితి ఏర్పడింది. ఈ ఘటనలో విధులు నిర్వహిస్తున్న ఏంటీవో సీఐ శ్రీనివాస్‌కి అస్వస్థతకు గురయ్యారు. ముగ్గురు కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. వాళ్లను వెంటనే  పోలీస్ వాహనంలో ఆస్పత్రికి తరలించారు. 
 
రైతుల కోసం ఎంతవరకైనా పోరాడతామని బండి సంజయ్ స్పష్టం చేశారు. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటే దాడులు చేయడమేంటని ప్రశ్నించారు. రైతుల కోసం దాడులు సహిస్తామని, వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఫామ్ హౌస్‌కు పరిమితమైన సీఎం కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
 
ఇలా ఉండగా,  తెలంగాణలో రైతులను సీఎం ఆగం చేశారని బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. కేవలం వరి పంట వేయాలని రైతులను కోరారని, మార్క్‌ఫెడ్ సంస్థను నిర్వీర్యం చేశారని,  మొక్కజొన్న కొనుగోలు మార్క్ ఫెడ్ సంస్థ కాకుండా.. దళారీలు కొనుగోలు చేసే పరిస్థితులు కల్పించారని విమర్శించారు. 
 
కేసీఆర్ కుటుంబం ఆధ్వర్యంలో జరిగే దళారుల కుంభకోణంపై  దర్యాప్తు విషయంలో ఎఫ్‌సీఐ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్‌ను బీజేపీ ఓడించలేదని, ప్రజలే ఓడించారని చెప్పారు. నల్గొండలో కేసీఆర్ డౌన్ డౌన్ అని రైతులే అంటున్నార,  బండి సంజయ్‌కు రైతులు ఘనస్వాగతం పలుకుతున్నారని అరవింద్ తెలిపారు.