దక్షిణాది రాష్ట్రాల సహకారం లేకుండా దేశాభివృద్ధి ఊహింపలేం

దక్షిణాది రాష్ట్రాల సహకారం లేకుండా భారతదేశ అభివృద్ధిని ఊహించలేమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు.  దేశంలో సర్వతోముఖాభివృద్ధిని సాధించాలంటే సహకార, పోటీతత్వ సమాఖ్యవాదాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. తిరుపతి తాజ్‌ హోటల్లో దక్షిణ ప్రాంతీయ మండలి 29వ సమావేశం అమిత్‌ షా అధ్యక్షతన ఆదివారం జరిగింది. 

ఈ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై,  పాండిచ్చేరి ముఖ్యమంత్రి ఎన్‌.రంగస్వామి, పలువురు లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్లు, హోంశాఖ కార్యదర్శులు హాజరయ్యారు. తమిళనాడు, తెలంగాణ, కేరళ సిఎంలు అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నట్లు తెలియజేశారు. 

ఈ సమావేశంలో అమిత్‌ షా ప్రారంభోపన్యాసం చేస్తూ దక్షిణ భారతదేశ రాష్ట్రాల ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు ప్రాచీన వారసత్వాన్ని సుసంపన్నం చేశాయని కొనియాడారు. కరోనా  మహమ్మారి సమయంలో 111 కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లను అందించడం గొప్ప విజయమని పేర్కొన్నారు. మోదీ  ప్రభుత్వం దేశంలోని అన్ని ప్రాంతీయ భాషలనూ గౌరవిస్తోందని భరోసా ఇచ్చారు. 

నేటి దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశంలోనూ వారివారి స్వభాషలో మాట్లాడేందుకు మొగ్గు చూపితే తాను సంతోషిస్తానని చెప్పారు.  ప్రాంతీయ మండళ్లు, సలహా సంఘాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించడంతో అనేక సమస్యలను విజయవంతంగా పరిష్కరించుకున్నామని త్లెఇపారు. 

గత ఏడు సంవత్సరాల్లో 18 ప్రాంతీయ కౌన్సిల్‌ సమావేశాలు నిర్వహించామని, గతంలో చాలా తక్కువగా జరిగేవని గుర్తు చేశారు. రాష్ట్రాల మధ్య నానుతూ వచ్చే జటిల వివాదాలను ప్రాంతీయ మండళ్లు (జోనల్ కమిటీలు) సమర్థవంతంగా పరిష్కరించగలవని అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. 

ఇప్పటివరకూ వీటి ద్వారా అత్యంత జటిలమైన 51 జటిల వివాదాలలో 40 వరకూ పరిష్కారం అయ్యాయని తెలిపారు. కేవలం అంతరాష్ట్ర సమస్యలకు పరిష్కారం దక్కడమే కాదు. రాష్ట్రాలకు కేంద్రా నికి మధ్య కూడా వివాదాలు పరిష్కారం అయ్యాయని అమిత్ షా తెలిపారు. 

నిజానికి జోనల్ కౌన్సిల్స్ వాటి ధర్మం మేరకు చూస్తే కేవలం సలహాలు, సంప్రదింపుల పాత్రతోనే వ్యవహరిస్తాయి. కానీ పలు సందర్భాలలో వీటి ద్వారా సంక్లిష్ట సమస్యలు పరిష్కారానికి నోచుకున్నాయని అమిత్ షా తెలిపారు. 

ఈ సదస్సు నేపథ్యంలో వివిధ రాష్ట్రాలకు కేంద్ర హోం మంత్రి పలు కీలక సూచనలు చేశారు. పెరిగిపోతున్న మాదకద్రవ్యాల కట్టడికి రాష్ట్రాలు మరింత సమన్వయంతో వ్యవహరించాలి. నేరాల నియంత్రణ దిశలో ఎక్కడికక్కడ సాంకేతిక వనరులను బలోపేతం చేసుకోవల్సి ఉందని పేర్కొరు.

దర్యా ప్తు క్రమంలో జాప్యాలు లేకుండా చేసేందుకు రాష్ట్రాలు అన్ని కూడా వేర్వేరుగా ఫోరెన్సిక్ కాలేజీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. ఈ కళాశాలలో పాఠ్యాంశాలు ప్రాంతీ య భాషలలోనే ఉండేలా చూడాలని సూచించారు. డ్రగ్స్ ఆటకట్టుకు రాష్ట్రాలు స్వతంత్ర దర్యాప్తు సంస్థలను ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పారు. 

లక్షదీప్‌ ఆడ్మినిస్ట్రేటర్‌ ప్రఫుల్‌ పటేల్‌, అండమాన్‌ నికోబార్‌ లెఫ్ట్‌నెంట్‌ గవరుర్‌ బి.కె.జోషి, పుదుచ్చేరి గవరుర్‌ తమిళసై, తెలంగాణ హోం శాఖ మంత్రి మహమ్మద్‌ అలీ, తమిళనాడు మంత్రులు  కె.పున్నడి,  పికె.శేఖర్‌, కేరళ మంతృలు కె.ఎన్‌.బాలగోపాల్‌, రాజన్‌, కర్ణాటక  మంత్రులు సుధాకర్‌,అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.