జగన్ రాజ్యంలో చర్చిలకు ప్రభుత్వ భూముల ధారాదత్తం 

ఆంధ్ర  ప్రదేశ్ లో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వీలుచిక్కినప్పుడల్లా క్రైస్తవ పక్షపాతిగా నిరూపించుకొంటున్నది. హిందూ దేవాదాయ భూములు పెద్ద ఎత్తున అన్యాక్రాంతమైన పట్టించుకోకపోగా, ఆయా భూములను అధికార పార్టీవారు కైవసం చేసుకొనేందుకు సహకరిస్తున్నది. హిందూ ఆలయాల వద్ద క్రైస్తవుల ప్రాబల్యం పెరుగుతున్నది. బహిరంగంగా మతమార్పుడులు, హిందూదేవాలయాలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
 
తాజాగా రాష్ట్రంలో పలుచోట్ల ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని చర్చలు నిర్మించడం యధావిధిగా కొనసాగుతున్నది. వాటిలో నిత్యం ప్రార్థనలు జరుగుతున్నాయి. అభ్యంతరం లేని భూముల్లో ఉన్న చర్చిలను క్రమబద్ధీకరించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నది. ఆయా ప్రాంతాల ధరలకు అనుగుణంగా క్రమబద్దీకరణ చేయమని అధికారులకు ఆదేశాలు జారీచేస్తున్నది.
ఇది ఏ ప్రాతిపదికన చేపట్టాలి? ఏ చట్టపరిధిలో క్రమబద్ధీకరణ చేయాలి? ఫీజుల వసూలుకు ప్రామాణికం ఏమిటన్న దానిపై స్పష్టత ఇవ్వకుండానే తాము చెప్పింది చేసి తీరాలని ప్రభుత్వంలోని పెద్దలు వత్తిడి చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం రెవెన్యూశాఖ ఆ దిశగా తీవ్ర కసరత్తు చేస్తోంది. భూముల క్రమబద్ధీకరణ పేరిట ఈ ఏడాది ఆగస్టు 23న సర్కారు జీవో 225 జారీ చేసింది.
 అభ్యంతరం లేని ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని ఇళ్లు, ఆవాసాలను ఏర్పాటుచేసుకొని ఉంటే 100గజాల వరకు పేదలకు ఉచితంగా, 100 నుంచి 300 గజాల వరకు అల్పాదాయ వర్గాలకు మార్కెట్‌ ధర ఆధారంగా క్రమబద్ధీకరించేందుకు ఉత్తర్వులు ఇచ్చింది. ఇది అందరికీ ఉపయోగపడే అంశమే అయినా జీవో 225ను ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదు. గజిట్‌లోనూ పొందుపర్చలేదు.
ఈ జీవో ఆధారంగానే గ్రామ, వార్డు సచివాలయల్లో ప్రజలు క్రమబద్ధీకరణకు దరఖాస్తులు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఆ ఉత్తర్వును రహస్యంగా ఉంచడం అనుమానాలకు తావిస్తోంది. జీవో అమలుతో పాటు హౌసింగ్‌ తదితర అంశాలపై సెప్టెంబరు, అక్టోబరుల్లో కీలక సమీక్షలు జరిగాయి. ఈ సందర్భంగానే చర్చిలకు భూ సంతర్పణ అంశం చర్చకు వచ్చింది.
నిరభ్యంతరమైన ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని చర్చిలు నిర్మిస్తే వాటిని జిల్లా కలెక్టర్‌ నిర్దేశించిన ధర ఆధారంగా క్రమబద్ధీకరించాలని విధివిధానాలు రూపొందించారు. ఈ మేరకు జీవో.225కి అనుబంధంగా మరో ఉత్తర్వు జారీ చేశారు. అయితే ఇళ్లకు, చర్చిలకు ఒకే కటాఫ్‌ తేదీని నిర్ణయించడంపై రెవెన్యూ వర్గాల్లోనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జగన్‌ పాలనలో విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని చర్చిలు నిర్మిస్తే వాటిని క్రమబద్ధీకరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి ప్రభుత్వ భూములను ఇతరులు ఆక్రమించుకోవడానికి వీల్లేదు. అందుకు విరుద్ధంగా వాటిల్లో ఇళ్లు, ఇతర నిర్మాణాలు చేస్తే చట్ట వ్యతిరేకంగా పరిగణించి చర్యలు తీసుకుంటారు. 

అయితే నిరుపేద ప్రజలు ఏళ్ల తరబడి నివసిస్తున్న ఆక్రమిత భూములను ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తోంది. 2015లో జీవో.296 ద్వారా షరతులకు లోబడి పేదలకు, అల్పాదాయ వర్గాలకు మినహాయింపు ఇచ్చారు. అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇళ్లు ఉంటేనే ఈ పథకాన్ని వర్తింపజేశారు. 28 లక్షల మంది నిరుపేదలకు ఇంటిస్థలాలు ఇచ్చామని ప్రభుత్వం గొప్పగా చెబుతోన్న జాబితాలో ఈ క్రమబద్ధీకరణలు కూడా కలిసే ఉన్నాయి.

ఇళ్ల కేటాయింపు పథకం పేరిట ఎక్కడ ప్రభుత్వ భూముల ఆక్రమణ కనిపించినా అది సహేతుకమైనదని తేలితే వాటిని ఇంటిస్థలాల జాబితాలోకి తీసుకొచ్చారు. ఇలాంటి కేసులను దాదాపుగా మూసివేశారు. ఇప్పుడు మళ్లీ కొత్తగా అదే స్కీమ్‌ను తెరపైకి తీసుకువచ్చారు.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 200నుంచి 400 గజాలపైనే ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని చర్చిలు ఏర్పాటు చేసుకున్నట్లుగా ఇటీవల రెవెన్యూశాఖ పరిశీలనలో తేలింది. ఎక్కువగా గ్రామాల్లో జనావాసాల మధ్య, పొలిమేరలు, కొండ, గుట్ట ప్రాంతాల్లోనూ భారీగా ప్రభుత్వ, పోరంబోకు భూముల్లో ఏర్పాటు చేసుకున్నట్లు నిర్ధారించారు. 

ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఆక్రమిత భూముల్లో ఎన్ని చర్చిలను నిర్మించి నిర్వహిస్తున్నారన్న అంశంపై ఈ నెల 23నాటికి స్పష్టత వస్తుందని ఓ సీనియర్‌ అధికారి చెప్పారు. ఈ భూములకు జిల్లా కలెక్టర్లే ధరలు నిర్ణయించి, డిసెంబర్ నెలాఖరుకు గాని, జనవరి నాటికి గాని వాటన్నినీటిని క్రమబద్దీకరించడం కోసం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం భారీ కసరత్తు చేస్తున్నది.