కాశీలో అన్న‌పూర్ణాదేవి విగ్ర‌హ ప్రతిష్ట

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కాశీ విశ్వ‌నాథుడి ఆల‌యంలో ఇవాళ మాతా అన్న‌పూర్ణాదేవి విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టంచారు. వందేళ్ల క్రితం కాశీ ఆల‌యం నుంచి చోరీ అయిన ఈ విగ్ర‌హాన్ని ఇటీవ‌ల కెన‌డా నుంచి తీసుకువ‌చ్చిన విష‌యం తెలిసిందే. 

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య‌నాథ్ ఇవాళ ఆ అరుదైన అన్నపూర్ణ విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టించారు. నాలుగు రోజుల క్రితం ఢిల్లీకి చేరుకున్న ఆ విగ్ర‌హాన్ని.. కాశీ తీసుకువ‌చ్చేందుకు యాత్ర‌ను కూడా చేప‌ట్టారు. అన్న‌పూర్ణ దేవి విగ్ర‌హాన్ని భారత్ కు తీసుకువ‌చ్చినందుకు ప్ర‌ధాని మోదీకి యూపీ సీఎం ధన్యవాదాలు తెలిపారు.

108 ఏళ్ల త‌ర్వాత అన్నపూర్ణ విగ్ర‌హం కాశీకి మ‌ళ్లీ వ‌చ్చింద‌ని, ఈ క్రెడిట్ అంతా కాశీ ఎంపీతో పాటు ప్ర‌ధాని మోదీకి ద‌క్కుతుంద‌ని ఆయన చెప్పారు. కాశీ ప్ర‌జ‌ల త‌ర‌పున‌, రాష్ట్రం త‌ర‌పున ప్ర‌ధానికి ధ‌న్య‌వాదాలు చెబుతున్న‌ట్లు సీఎం యోగి తెలిపారు. అత్యంత అరుదైన 18వ శ‌తాబ్ధానికి చెందిన అన్న‌పూర్ణ విగ్ర‌హం 17 సెమీ ఎత్తు, 9 సెమీ వెడ‌ల్పుతో ఉంది. కేంద్ర మంత్రి కిష‌ణ్‌రెడ్డి ఆ విగ్ర‌హాన్ని యూపీ ప్ర‌భుత్వానికి అప్పగించారు.