కాంగ్రెస్ పాలనలో భారత్ పాక్షికంగా ముస్లిం దేశం

హిందుత్వపై  కాంగ్రెస్  చేసిన విమర్శలపై  దాడిని కొనసాగిస్తూ, ఆ పార్టీ  అధికారంలో ఉన్నప్పుడు భారతదేశం పాక్షికంగా “ముస్లిం దేశం” అని బీజేపీ ఆరోపించింది.  ఎందుకంటే షరియా నిబంధనలు అప్పుడు న్యాయ వ్యవస్థలో భాగమయ్యాయని,  అందుకోసం సుప్రీం కోర్ట్ తీర్పును కూడా తారుమారు చేశారని గుర్తు చేసింది.

త్రిపురలో మసీదులను లక్ష్యంగా చేసుకుని “తప్పుడు” వార్తలపై మహారాష్ట్రలో హింస, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, హిందుత్వంపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు హిందూత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న పెద్ద కుట్రలో భాగమని బిజెపి అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది ఆరోపించారు.

  “కాంగ్రెస్ పాలనలో భారతదేశం పాక్షికంగా ముస్లిం దేశంగా ఉంది. షరియా నిబంధనలు రాజ్యాంగ వ్యవస్థలో భాగమైనందున నేను అలా చెబుతున్నాను” అని చెప్పారు. ఇప్పుడు రద్దు చేసిన ట్రిపుల్ తలాక్, హజ్ సబ్సిడీ ఇవ్వడంలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. “షరియా నిబంధనలకు ప్రాధాన్యత ఇవ్వడానికి సుప్రీంకోర్టు తీర్పును తోసిపుచ్చారు,” అంటూ ప్రఖ్యాత షా బానో కేసులో అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను తిప్పి కొట్టడం కోసం రాజీవ్ గాంధీ ప్రభుత్వం చట్టం తీసుకురావడాన్ని ఆయన ప్రస్తావించారు.

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై దాడి చేస్తూ, ప్రతిపక్ష నాయకుడు మహారాష్ట్రలోని తన పార్టీ కార్యకర్తలకు హిందుత్వను కించపరచడంలో శిక్షణ ఇస్తున్నారా? మత విద్వేషాలు,  హింసను ప్రేరేపించడానికి వ్యవస్థీకృత ప్రచారాన్ని నడుపుతున్నారా? అంటూ విస్మయం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని శిక్షణా శిబిరంలో కాంగ్రెస్ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  ప్రసంగించిన సమయంలో రాహుల్  గాంధీ హిందూమతం,  హిందుత్వ మధ్య వ్యత్యాసాన్ని గీయాలని ప్రయత్నించారు.  ఆ తర్వాతనే దాడులు జరగడం గమనార్హం.

ఆర్‌ఎస్‌ఎస్-బిజెపి భావజాలంతో ముడిపడి ఉన్న హిందుత్వ పదాన్ని కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ ఉగ్రవాద ఇస్లామిస్ట్ సంస్థలతో పోల్చిన తర్వాత కూడా బిజెపి తీవ్రంగా మండిపడింది. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు ప్రతీక అని, హిందూ మతంపై ద్వేషాన్ని వ్యాపింపజేసి అల్లర్లకు కారణమవుతుందని త్రివేది మండిపడ్డారు.

శివాజీ పాలన కూడా హిందూ మతంతో ముడిపడి ఉందని పేర్కొన్న త్రివేది, రాహుల్ గాంధీ వంటి నాయకులు ఈ భావనను అర్థం చేసుకోలేరని విచారం వ్యక్తం చేసారు. మహాత్మా గాంధీ, బాల్ గంగాధర తిలక్,  జవహర్‌లాల్ నెహ్రూ వంటి తన సొంత పార్టీ ప్రముఖులు ఏమి చెప్పారో ముందు రాహుల్ చదవాలని ఆయన హితవు చెప్పారు 

నెహ్రూ, ‘హిందూ’ అనే పదాన్ని భారతీయ గుర్తింపు విస్తృత సందర్భంలో అర్థం చేసుకోవచ్చని,  సంకుచితంగా చూడకూడదని రాసారని బిజెపి నేత ఈ సందర్భంగా గుర్తు చేశారు.

మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు, వాజ్‌పేయి పాలన మినహా, కాంగ్రెస్ పాలనలో భారతదేశం పాక్షికంగా ముస్లిం దేశంగా ఉందని, భారతదేశం ఇప్పుడు నిజమైన మార్గంలో లౌకికవాదంగా మారుతున్నందున కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిరాశకు గురవుతోందని ఆయన ధ్వజమెత్తారు.

హిందూమతంపై కాంగ్రెస్ నాయకులు తమ “వివేకం”ను ప్రదర్శిస్తూ    హిందూ తాలిబాన్, హిందూ ఉగ్రవాదం  వంటి పదాలను ఉపయోగిస్తున్నారని బిజెపి నేత దుయ్యబట్టారు. ఇటువంటి వ్యక్తులే భారత దేశం వైభవంతో, గర్వంగా ఎదగడాన్ని సహింపలేక, ఆపే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.