ప్రజల భద్రతనే కాదు, భూభాగం బాధ్యత కూడా పోలీసులదే!

దేశంలోని 132 కోట్ల మంది ప్రజల భద్రతనే కాదు.. భారతదేశపు 32 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగం బాధ్యత కూడా పోలీసులదే అని   జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్పష్టం చేశారు. ఈ దేశపు చివరి అడుగు వరకూ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనే ఉంటుందని చెప్పారు.  హైదరాబాద్‌లో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌ నేషనల్ పోలీస్ అకాడమీలో  ట్రైనీ ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్ లో ముఖ్య అతిథిగా పాల్గొంటూ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్న వాటి పైనే కాక, సరిహద్దు యాజమాన్యం బాధ్యత కూడా మీపై ఉంటుందని వారికి సూచించారు. 

భద్రతాపరమైన కీలక అంశాలు ముడివడి ఉన్న దేశ సరిహద్దుల భద్రత అత్యంత ప్రధానమైన విషయం అని, ఇందులో పోలీసు విభాగం ప్రధాన పాత్ర ముఖ్యమని పేర్కొన్నారు. భారతదేశ సర్వసత్తాకత సముద్ర తీర కోస్తా ప్రాంతంలోని పోలీసు స్టేషన్‌ల నుంచి సరిహద్దులలోని ఠాణాల వరకూ విస్తరించుకుని ఉందని గుర్తు చేశారు.

దేశ సరిహద్దులలోని వేర్వేరు ప్రాంతాలలో విభిన్నంగా ఉన్న క్లిష్టతలను పోలీసు బలగాలలో చేరినీ అధికారులు తమ శిక్షణా సామర్థాల వినియోగం ద్వారా ఛేదించాల్సి ఉంటుందని సూచించారు. 

భారత దేశపు 15 వేల కిలోమీటర్ల భూమిపై నిరంతరం చైనా, పాకిస్థాన్, మయన్మార్, బంగ్లాదేశ్‌తో సమస్యలు వస్తూనే ఉన్నాయని పేర్కొంటూ  శాంతి భద్రతలు సక్రమంగా లేని దేశాలు అభివృద్ధి చెందలేవని పేర్కొన్నారు.  ప్రజాస్వామ్యం.. నాయకుల చేతిలో కాదు అధికారుల సుపరిపాలనలో ఉంటుందని  అంటూ అజిత్ దోవల్ ట్రైనీ ఐపీఎస్‌లకు మార్గనిర్దేశం చేశారు.

అంతర్గత భద్రతతోనే ఏ దేశం అయినా రాణిస్తుందని చెబుతూ  లేకపోతే ఏ దేశం గొప్ప దేశం కాలేదని, ఘనతను చాటుకోలేదని స్పష్టం చేశారు. అంతర్గత భద్రతతోనే ప్రజలు ప్రగతి చెందుతారని,  సరిహద్దులలో భద్రత ఉంటేనే ప్రగతిసరైన పథంగా సాగుతుందని తెలిపారు. 

దేశంలో 21 లక్షల మంది పోలీసు బలగం ఉందని, వీరిలో విధి నిర్వహణలో ఇప్పటివరకూ 35,480 మంది ప్రాణాలు కోల్పోయి బలి అయ్యారని చెప్పారు. భద్రతకు పాటుపడుతూ నిర్వర్తించిన బాధ్యతలతో ఇప్పటివరకూ 40 మంది ఐపిఎస్ అధికారులు అమరులు అయ్యారని వీరిని మనం అంతా సంస్మరించుకోవడం దేశం పట్ల మన బాధ్యతను చాటుతుందని పేర్కొన్నారు. 

దేశ భద్రతలో పోలీస్‌ సర్వీస్‌ వెన్నెముక లాంటిదని చెబుతూ . రిటైర్‌‌ అయిన తర్వాత కూడా ఐపీఎస్‌లకు ఆ ట్యాగ్ లైన్ ఉంటుందని గుర్తు చేశారు. 52 సంవత్సరాల క్రితం తాను కూడా ఇదే అకాడమీ నుంచి ఐపీఎస్‌గా వచ్చానని చెప్పారు. తనను ఐపీఎస్‌గా తీర్చిదిద్దిన అకాడమీ ఫ్యాకల్టీకి, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు చెప్పారు. ఈ అకాడమీ 1948 నుంచి దేశానికి 5,700 మంది ఐపీఎస్ ఆఫీసర్లను ఇచ్చిందని తెలిపారు.

 ఈ వేడుకలో దోవల్ ప్రొబేషనర్స్ కవాతును పరిశీలించి, ఉత్తమ పనితీరు కనబరిచిన ప్రొబెషనర్లకు బహుమతి ప్రదానం చేశారు. మొత్తం 132 మంది అధికారులలో 27 మంది మహిళా అధికారులు, ఆరుగురు రాయల్ భూటాన్ పోలీసులు, ఆరుగురు మాల్దీవ్స్‌కు చెందిన పోలీస్ అధికారులు, ఐదుగురు నేపాల్ పోలీస్ సర్వీస్ అధికారులు ఉన్నారు. ప్రొబెషనరీ అధికారులందరినీ, ముఖ్యంగా మహిళా అధికారులను దోవల్ అభినందించారు.