తుపాను తీరం దాటినా.. తిరుపతిలో భారీ నష్టం 

తుపాను తీరం దాటినా తిరుపతిలో భారీ నష్టాన్ని మిగిల్చింది. గురువారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. మధురానగర్‌, లక్ష్మీపురం, పద్మావతిపురం, కట్టకింద ఊరు లోతట్టు ప్రాంతాల్లో మురుగునీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు లోతట్టు ప్రాంతాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. 
 
ఈదురుగాలల ధాటికి చోట్లు నెలకొరిగాయి. పలు పంటలు నీటమునిగాయి. కుశస్థలినదిపై రోడ్డు కొట్టుకుపోవడంతో గ్రామస్తులు జలదిగ్బంధంలో చిక్కుకుపోయారు. వెదురుకుప్పం మండలంలో ఆళ్లమడుగు పంచాయతీలోని రెండు గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయి. నష్టం అంచనాలను యుద్ధప్రాతిపదికన తేల్చి  ముఖ్యమంత్రి ప్రకటించిన తక్షణ సాయం అందించే పనిలో అధికార యంత్రాంగం ఉంది. 
 
పిచ్చాటూరు మండలం అప్పంబట్టుకు చెందిన చొక్కలింగం (45) అరణియార్‌ వాగులో పడి గల్లంతయ్యాడు. ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బలగాలతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. రామచంద్రాపురం మండలంలోని నక్కలేరులో వాగు ఉధృతికి కొట్టుకుపోయిన మహిళ సుశీల (35) మృతదేహం శుక్రవారం లభ్యమైంది. 
 
ఏర్పేడు మండలం మునగలపాలెం వద్ద స్వర్ణముఖి నది నీటి ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తోంది. చెల్లూరుకు చెందిన భార్యాభర్త, అదే గ్రామానికి చెందిన వ్యక్తి మునగలపాలెం వంతెన దాడుతుండగా ముగ్గురూ కొట్టుకుపోయారు. స్థానికులు గమనించి వారిని రక్షించారు. ఇటీవల కాలంలో చెరువుల్లో వదిలిన చేపపిల్లలు వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. 
 
కాగా, శ్రీకాకుళం జిల్లాలో సగటున 20.8 మి.మీ వర్షపాతం నమోదైంది. బూర్జ, పాలకొండ, ఆమదాలవలస, రాజాం, వీరఘట్టం, టెక్కలి తదితర ప్రాంతాల్లో వరి పంట నేలవాలడంతో పాటు కోసిన వరి పనలు నీట మునిగాయి. తూర్పుగోదావరి జిల్లాలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకూ వర్షం కురుస్తూనే ఉంది. 
 
జిల్లా వ్యాప్తంగా 27 వేల ఎకరాల్లో వరిపంట నేలకొరిగినట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. గొల్లప్రోలులో పిబిసి కాలువ, సుద్ధగడ్డ కాలువలు పొంగుతున్నాయి.ఉప్పాడలో సముద్రపు అలలు బీచ్‌రోడ్డును తాకుతున్నాయి. విశాఖలో కొత్తవలస – కిరండూల్‌ లైన్‌లోని సిమిడిపల్లి, బర్రా రైల్వే స్టేషన్‌ల మధ్య 66/67 టన్నెల్‌లో కొండ చరియలు విరిగిపడటంతో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.

ఉత్తర తమిళనాడు దాని పరిసరాలపై ఉన్న అల్పపీడనం శుక్రవారం నాటికి బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. 13న శనివారం దక్షిణ అండమాన్‌ తీరంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు తెలిపారు. నవంబరు 15న బలపడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాగల 3 రోజుల వరకూ ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.