సీఎంలు, రాష్ట్రాల ఆర్థిక‌మంత్రుల‌తో 15న‌ నిర్మల స‌మావేశం

కేంద్ర ఆర్థిక‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఈ నెల 15న (సోమ‌వారం) అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, ఆర్థిక‌శాఖ మంత్రుల‌తో స‌మావేశం కానున్నారు. ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను మ‌రింత బ‌లోపేతం చేయ‌డం కోసం ప్రైవేటు పెట్టుబ‌డులను ఎలా ఆక‌ర్షించాల‌నే అంశంపై ఈ స‌మావేశంలో ప్ర‌ధానంగా చ‌ర్చించ‌నున్నారు. 

కేంద్ర ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శి టీవీ సోమ‌నాథ‌న్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. 2020, మార్చి నుంచి దేశాన్ని క‌రోనా మ‌హ‌మ్మారి ఉక్కిరిబిక్కిరి చేసింది. మ‌ధ్యలో త‌గ్గిన‌ట్టే త‌గ్గి మ‌ళ్లీ విజృంభించింది. ఇలా రెండు క‌రోనా వేవ్‌లు దేశ ఆర్థిక‌వ్య‌వ‌స్థ‌ను కుదేలు చేశాయి.

లాక్‌డౌన్‌లు, నైట్ క‌ర్ఫ్యూల కార‌ణంగా వాణిజ్య‌, వ్యాపార కార్య‌క‌లాపాలు స్తంభించిపోయాయి. ప‌రిశ్ర‌మ‌లు మూత‌ప‌డ్డాయి. దాంతో ప్ర‌జ‌లు, ప్ర‌భుత్వాలు తీవ్రంగా న‌ష్ట‌పోవాల్సి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో రాష్ట్రాల స్థాయిలో ఆర్థికవ్య‌వ‌స్థ‌ల‌ను మెరుగుప‌ర్చ‌డానికి ఉన్న అవ‌కాశాలు, స‌వాళ్లు, స‌మ‌స్య‌లపై సోమ‌వారం నాటి స‌మావేశంలో చ‌ర్చించ‌నున్నారు.

34 శాతం పెరిగిన రిటైల్ అమ్మకాలు 

కరోనా మహమ్మారి వల్ల ఇబ్బందులు పడిన దేశ ఆర్థిక వ్యవస్థకు సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి.రిటైల్ అమ్మకాలు గత ఏడాది అక్టోబరుతో  పోల్చుకుంటే ఈ ఏడాది అక్టోబరులో 34 శాతం పెరిగినట్లు భారత రిటెయిలర్ల సంఘం (ఆర్ఏఐ) వెల్లడించింది. 2019 అక్టోబరుతో పోల్చుకుంటే ఈ ఏడాది అక్టోబరులో రిటెయిల్ అమ్మకాలు 14 శాతం పెరిగినట్లు తెలిపింది. 

ఆర్ఏఐ విడుదల చేసిన రిటైల్ బిజినెస్ సర్వే 21వ ఎడిషన్‌లో తెలిపిన వివరాల ప్రకారం కరోనా మహమ్మారి రావడానికి ముందు (2019 అక్టోబరు) పరిస్థితితో పోల్చుకుంటే, ఈ ఏడాది అక్టోబరులో రిటైల్ అమ్మకాలు 14 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. అక్టోబరు సర్వే ప్రోత్సాహకర ఫలితాలను వెల్లడించిందని ఆర్ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కుమార్ రాజగోపాలన్ తెలిపారు.

 పండుగల సీజన్ మొత్తం ప్రభావాన్ని అర్థం చేసుకోవాలంటే అక్టోబరు, నవంబరు నెలల్లో జరిగిన అమ్మకాలను కలిపి చూడాలని తెలిపారు. కచ్చితమైన తుది నిర్ణయానికి రావడానికి నవంబరు నెలలో జరిగే అమ్మకాల సమాచారం కోసం వేచి చూస్తామని చెప్పారు. ప్రస్తుత సంకేతాలన్నీ సానుకూల ధోరణిని కనబరుస్తున్నాయని పేర్కొన్నారు. ఆభరణాల అమ్మకాలు 2019 అక్టోబరు కన్నా 2021 అక్టోబరులో 24 శాతం పెరిగినట్లు ఈ సర్వే వెల్లడించింది. వస్త్ర రంగంలో కూడా 6 శాతం పెరుగుదల నమోదైనట్లు పేర్కొంది.