తెలంగాణకు రూ.5,392 కోట్ల అదనపు రుణంకు అనుమతి 

మూలధన వ్యయ లక్ష్యాన్ని సాఽధించినందుకుగాను రూ.5,392 కోట్ల అదనపు రుణాన్ని పొందేందుకు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం వరకు మూలధన వ్యయ లక్ష్యాన్ని సాధించినందుకు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, మేఘాలయా, పంజాబ్‌, రాజస్థాన్‌కు కలిపి రూ.16,691కోట్ల మేర అదనపు రుణాన్ని సమీకరించుకునేందుకు అవకాశం కల్పించింది. 
 
ఈ 7 రాష్ట్రాల్లో తెలంగాణ ఎక్కువ మొత్తంలో రుణాన్ని పొందేందుకు అనుమతించింది. అదనపు రుణ అనుమతి రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో 0.5శాతానికి సమానమని కేంద్రం తెలిపింది. అయితే, కేంద్రం 2021-22లో రాష్ట్రాలకు నిర్దేశించిన మూలధన వ్యయం లక్ష్యాల సాధనలో ఆంధ్రప్రదేశ్‌ విఫలమైంది.
సంపద సృష్టించడంలో ఘోర వైఫల్యంతో అదనపు రుణ పరపతిని కోల్పోయింది. నిర్దేశించిన మూలధన వ్యయం లక్ష్యాలను అధిగమించి ఉంటే రూ.6వేల కోట్ల అదనపు రుణ పరపతి లభించి ఉండేది.  ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ఏపీ రాష్ట్ర ప్రభుత్వం.. ఎఫ్‌ఆర్‌బీఎం, ఆర్‌బీఐ నిబంధనలను ఉల్లంఘించి లక్షల కోట్ల అప్పులు తెచ్చి కేంద్రం ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే.
అన్ని అప్పులు తెచ్చినా నెలనెలా జీతాలను కూడా చెల్లించలేని దుస్థితి నెలకొంది. అనేక ప్రాజెక్టుల్లో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేని పరిస్థితి. ఆర్థిక విధానాలకు సంబంధించి జగన్‌ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడంవల్లే నిర్దేశించిన మూలధన వ్యయ లక్ష్యాలను సాధించలేకపోయింది. ఈ ప్రభావంతో వేల కోట్ల అదనపు రుణ పరపతిని రాష్ట్రప్రభుత్వం కోల్పోయింది.