కార్మిక రంగంలో కమ్యూనిస్టుల ప్రాబల్యం బద్దలు చేసిన దత్తోపంత్ ఠేంగ్డే

* 101వ జయంతి నివాళి

కార్మిక రంగం అంటేనే ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టుల ప్రాబల్యం కనిపిస్తుంది. భారత దేశంలో ఆ రంగంలో వారి ఆధిపత్యాన్ని బద్దలు చేయడమే కాకుండా, సైద్ధాంతిక భూమికను సహితం పటాపంచలం కావించి, దేశంలోనే అతిపెద్ద జాతీయ కార్మిక ఉద్యమాన్ని నిర్మించిన మావోన్నత మేధావి, గొప్ప ద్రష్ట, సంఘటనాచాతుర్యం గల తత్వవేత్త దత్తోపంత్ ఠేంగ్డే. ఆర్ ఎస్ ఎస్ ఆదర్శాలకు సజీవ ఉదాహరణంగా జీవనం గడిపారు. 
 
కార్మిక ఉద్యమంలోకి ప్రవేశింపాలని ఆర్ ఎస్ ఎస్ ఆయనకు బాధ్యత అప్పచెప్పినప్పుడు ముందుగా అప్పట్లో అతిపెద్ద కార్మిక సంఘం అయిన ఐ ఎన్ టి యు సి లో చేరి, మధ్యప్రదేశ్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాతనే భారతీయ మజ్దూర్ సంఘ్ ను ప్రారంభించారు. 
 
బిఎంఎస్ ను ప్రారంభించిన తర్వాత పుష్కర కాలం తర్వాతనే జాతీయ కార్యవర్గం ఏర్పాటు చేశారు. అప్పటి వరకు ఎక్కడికక్కడ పనిని విస్తరింప చేసుకొంటూ వచ్చారు. దేశంలో అన్ని కార్మిక సంఘాలు రాజకీయ పార్టీలకు అనుబంధంగా పనిచేస్తుంటే బిఎంఎస్ ను రాజకీయాలకు అతీతమైన కార్మిక ఉద్యమంగా, పార్టీ రాజకీయాలకు దూరంగా నిర్మించారు.
అంతేకాదు పారిశ్రామిక వేత్తల నుండి విరాళాలు స్వీకరించే వరవడిని కూడా తిరస్కరించి, కేవలం కార్మికుల సభ్యత్వ రుసుముతో మాత్రమే పనిచేసేటట్లు వ్యవస్థ ఏర్పాటు చేశారు. భారతీయ ఆర్ధిక ఆలోచనలు, సంస్కృతుల ప్రాతిపదికన ఉద్యమాన్ని వ్యాపింప చేశారు. కేవలం కార్మిక సంఘాలలో కమ్యూనిస్టుల ఆధిపత్యం తగ్గించి, తమ ఆధిపత్యం పెంచుకొనే ప్రయత్నం చేయకుండా, కార్మిక ఉద్యమ స్వరూపంలోనే పెను మార్పులు తీసుకు రావడానికి వారితో సైద్ధాంతిక పోరుకు దిగారు. 
 
వారి కార్యక్షేత్రంలోనే వారిని ఓడించారు. వర్గ ద్వేషం ఆధారిత సంఘర్షణలకు తలపడటం, పరిశ్రమలను బలవంతంగా స్వాధీన పరచుకోవడం వంటి కార్మిక ఉద్యమ ధోరణిలో మార్పు తీసుకు వచ్చారు. పారిశ్రామిక ప్రక్రియలో శ్రమకు స్వదేశీ, జాతీయవాదం ప్రాతిపదికన  గౌరవప్రదమైన ప్రాధాన్యత ఇవ్వడం ప్రోత్సహించారు.
 
ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమ సారధి 
 
ఎమర్జెన్సీ సమయంలో నానాజీ దేశముఖ్ అరెస్ట్ తర్వాత లోక్ సంఘర్షణ సమితి కార్యదర్శి పదవిని చేపట్టి, ప్రజాస్వామ్య పునరుద్దరణకు దేశవ్యాప్తంగా జరిగిన మహోన్నత ఉద్యమానికి సారధ్యం వహించారు. 
 
ఎమర్జెన్సీ తర్వాత కేంద్రంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో ఏర్పడడానికి దత్తోపంత్ ప్రధాన కారణమని నాటి మంత్రులు పలువురు బహిరంగంగా అంటుండేవారు. పలు ప్రతిపాదనలు వచ్చినా నాటి జనతా ప్రభుత్వంలో ఎటువంటి అధికార పదవి స్వీకరింపలేదు. 
 
నవంబర్ 10, 1920న కార్తీక అమావాస్య, విక్రమ్ సంవత్ నాడు మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలోని అర్విలో జన్మించారు. 15 సంవత్సరాల వయస్సులో, ‘వానర్ సేన’ తొ పాటు ఆర్వీలోని మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. 1936-38 వరకు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ సభ్యునిగా ఉన్నారు. 
 
గురూజీగా ప్రసిద్ధి చెందిన మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్, పండిట్. దీనదయాళ్ ఉపాధ్యాయ, బాబా సాహెబ్ అంబేద్కర్ లతో ఆయన జీవనం విశేషంగా ప్రభావితమైంది. 1942లో ఆర్‌ఎస్‌ఎస్‌లో ప్రచారక్‌గా చేరారు, 1942-44 మధ్య కేరళలో, 1945-47లో బెంగాల్‌లో, 1948-49లో అస్సాంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా పనిచేశారు.

భారతీయ మజ్దూర్ సంఘ్ (1955), భారతీయ కిసాన్ సంఘ్ (1979), స్వదేశీ జాగరణ్ మంచ్ (1991), సామాజిక సమరసత మంచ్, సర్వ-పంత్ సమదర్ మంచ్, పర్యవరణ్ మంచ్ వంటి అనేక ప్రసిద్ధ సంస్థలను స్థాపించారు. వాటికి మార్గదర్శకత్వం వహించి, అవి దేశంలో విశేషమైన ప్రభావం చూపే విధంగా తీర్చిదిద్దారు.   
 
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, అఖిల భారతీయ ఆదివక్త పరిషత్, అఖిల భారతీయ గ్రాహక్ పంచాయతీ, భారతీయ విచారణ కేంద్రం వ్యవస్థాపక సభ్యులు కూడా.ఆయన ఎల్లప్పుడూ సమ్మిళితవాన్ని విశ్వసిస్తూ రాజకీయ అంటరానితనం ఆలోచనను తిరస్కరించారు. 1964-76 మధ్య రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆ తర్వాత పద్మవిభూషణ్‌ పురస్కారం స్వీకరించేందుకు నిరాకరించారు.  
అంబెడ్కర్ తో సన్నిహితంగా 
 
డా. బి ఆర్ అంబెడ్కర్ తో సన్నిహితంవా పనిచేసిన ఆయన  తన వ్యక్తిగత అనుభవం నుండి అంబేద్కర్‌ జీవనం గురించిన వాస్తవమైన స్వరూపాన్ని దేశం ముందుంచాలని  ప్రయత్నం చేస్తుండేవారు.  “డాక్టర్ అంబేద్కర్” ఆయన చివరి పుస్తకం కావడం గమనార్హం. ఆయన బ్రెయిన్ హెమరేజ్ కారణంగా 14 అక్టోబర్ 2004న మరణించడానికి ముందు జూలై 2004లో ఈ గ్రంధాన్ని పూర్తి చేశారు. ఆయన ఒక ఎన్నికలో అంబెడ్కర్ ఎన్నికల ప్రచార బాధ్యతలు నిర్వహించి, ఆయనతో సన్నిహితంగా పనిచేశారు.
 
“పాశ్చాత్య నమూనా అనేది పురోగతి, అభివృద్ధిలకు సార్వత్రిక నమూనా అనే అభిప్రాయానికి మేము  దృఢముగా విశ్వసిస్తున్నాము.  ఆధునికీకరణ అంటే పాశ్చాత్యీకరణ అని మేము భావించము” అంటూ స్పష్టమైన అవగాహనతో అన్ని జాతీయ జీవన రంగాలలో స్వదేశీ ఆలోచనలు నింపే ప్రయత్నం చేశారు.
 
అభివృద్ధి చెందిన దేశాలని గుడ్డిగా అనుకరించడం వల్ల ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. గురు దేవ్ ఠాగూర్ దేవుడు వివిధ దేశాలకు వేర్వేరు ప్రశ్నపత్రాలను ఇచ్చాడని చెబుతుండేవారని అంటూ భారత దేశం తన ప్రత్యేక లక్ష్యాన్ని నెరవేర్చాలని సూచించేవారు. 
 
తన రచనతో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరొందారు. మరాఠీ, హిందీ, ఆంగ్ల భాషలలో అనర్గళంగా ప్రసంగించేవారు. “కార్యకర్త”, “మూడో మార్గం”, “విప్లవంపై”, “హిందూ ఆర్థికశాస్త్రంలో ముందుమాటలు” “విచార్ సూత్రే’, ‘సంకేత్రేఖ’, `ఏకాత్మ మానవ్’, `ప్రగతిపత్ పర్ కిసాన్’, `డాక్టర్ అంబేద్కర్’,  `సప్తక్రమ్’, `లక్ష్య ఔర్ కార్యా’ వంటి పలు సైద్ధాంతిక గ్రంధాలను రచించారు. 
 
మార్క్స్ తాత్విక చింతనను ఎండగట్టారు 
 
మార్క్స్ తాత్విక చింతనను పూర్తిగా తిరస్కరిస్తూ మార్క్స్ పనిచేసిన డేటా సరిపోదని, అతని సమాచారం సరికాదని, అతని దృక్పథం అశాస్త్రీయమని, అతని ముగింపులు తప్పు అని, అతని అంచనాలు అవాస్తవమని, అతని సిద్ధాంతాలు నమ్మశక్యం కానివని సంఘటనలు రుజువు చేశాయని సవివరంగా ఆయన నిరూపించారు.
 
మార్క్సిజం న్యూటోనియన్ సైన్స్, డార్విన్ పరిణామవాదం, హెగెలియన్ మాండలిక వాదంపై మేధో పరాన్నజీవి మార్క్సిజం అంటూ అవహేళన చేశారు.  మార్క్సిజాన్ని హిందూమతంతో పోల్చడానికి ప్రయత్నించేవారు ఈ రెండింటి పట్ల తమకున్న అజ్ఞానాన్ని మాత్రమే వ్యక్తం చేస్తుంటారని నిర్విర్ధంగా చెప్పారు. 

కార్మికులు విజయం సాధిస్తే కమ్యూనిస్టులు విఫలమవుతారని, రైతుల శ్రేయస్సు వారికి ప్రతికూలమని చెబుతూ  శ్రామికవర్గం  వైఫల్యాలు కమ్యూనిస్ట్ విజయానికి మూలస్తంభాలని అంటూ వారి సైద్ధాంతిక ప్రాతిపదికను ఎండగట్టారు. 

మతోన్మాద ముస్లింలు ఇస్లాం ఏ విధమైన దేశ ఆరాధనను అనుమతించదని, ముస్లింలు జాతీయవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని అంటుంటారని అంటూ వారిని ఎండగట్టారు. వాస్తవానికి  ముస్లిం దేశాలు అని పిలవబడే జాతీయవాదులు ఈ చెడును విజయవంతంగా ఎదుర్కొన్నారని, ఇస్లాం అసలు సిద్ధాంతాలు దేశభక్తి స్ఫూర్తికి చాలా అనుకూలంగా ఉన్నాయని ఆయన సాధికారికంగా నిరూపించారు.
హిందూ ఆలోచన విధానం 

హిందూ ఆలోచన విధానం పట్ల స్పష్టమైన అవగాహన వ్యక్తపరిచే వారు. తన అద్భుతమైన ప్రయోజనాలను తిరస్కరించే వారిని మినహాయించి అది మొత్తం మానవజాతిని స్వీకరించగలదని అంటూ పేర్కొన్నారు. దేశ ప్రయోజనాలు మొదట వస్తాయని, ఆ పైననే పరిశ్రమలు, కార్మికుల ప్రయోజనాలు.. ఆ క్రమంలో వస్తాయని అంటూ కార్మిక ఉద్యమానికి సరికొత్త వరవడి సృష్టించారు. 

 
అన్ని పరిశ్రమలను జాతీయకరణ చేయాలనే కమ్యూనిస్టుల నినాదాన్ని తిప్పికొడుతూ ‘దేశాన్ని పారిశ్రామికీకరించండి, కార్మికులను జాతీయం చేయండి, పరిశ్రమను కార్మికీకరించండి’ అంటూ బిఎంఎస్ ప్రతిపాదించింది. `పరిశ్రమల ‘కార్మికీకరణ’ గురించి బిఎంఎస్  సూచిస్తూ కార్మికులు సమిష్టిగా పారిశ్రామిక యూనిట్లను సొంతం చేసుకునే, నిర్వహించే ఆలోచనను ప్రోత్సహించింది.
 
పేదరికం, నిరుద్యోగాన్ని రూపుమాపడానికి ‘రాజధాని ఆధారిత ఆర్థిక నిర్మాణం’కి బదులుగా ‘కార్మిక-ఆధారిత ఆర్థిక నిర్మాణం’ని డిమాండ్ చేశారు. “నిజమైన ‘ప్రపంచీకరణ’ హిందూ వారసత్వంలో ఒక భాగం అంటూ పురాతన కాలంలో మనం ఎల్లప్పుడూ మనల్ని మనం మొత్తం మానవాళిలో భాగంగా భావించామని, మన  కోసం ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకోవాలని మనం ఎప్పుడూ పట్టించుకోలేదని దత్తోపంత్ గుర్తు చేశారు.
 
“మనం మొత్తం మానవజాతితో మమ్మల్ని గుర్తించాము. ‘భూమంతా మా కుటుంబం’ (వసుధైవ్ కుటుంబం) – మన నినాదం. అందుకే ‘హిందూ’ అనే పదానికి ప్రాచీనత లేదు; అది ప్రాచీన సాహిత్యంలో కనిపించదు… కానీ ఇప్పుడు పాత్రలు తారుమారయ్యాయి” అంటూ మన ఆలోచనల ప్రాతిపదికను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా విస్తరింప చేశారు.  
 
సామ్రాజ్యవాద దోపిడీకి, మారణహోమానికి కూడా చరిత్ర తెలిసిన వారే ‘ప్రపంచీకరణ’ గురించి మనకు ప్రబోధిస్తున్నారని అంటూ ఎద్దేవా చేశారు. సాతానులు బైబిల్‌ను ఉటంకిస్తున్నారని అంటూ గ్లోబలైజేషన్‌గా కవాతు చేస్తున్నది ఆధిపత్యవాదం అంటూ ఎండగట్టారు.