స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ అడుగడుగున అక్రమాలే

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో నామినేషన్ వేసే దగ్గరనుండి ఎన్నికల వరకు అన్నీ అక్రమాలే జరుగుతున్నాయని నెల్లూరులో బిజెపి సీనియర్ నేత కారణం భాస్కర్ విమర్శించారు. అధికార పక్షం వారికి నిజంగా నిజాయితీగా గెలుస్తామని, తమ పథకాలు పనిచేస్తున్నాయని నమ్మకం ఉంటే ఎందుకు అక్రమాలు దౌర్జన్యాలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. 
 
పోలీసులకు  సిగ్గులేకుండా ప్రజాస్వామ్యం అనేదానికి అర్థం లేకుండా దౌర్జన్యాలు చేస్తూ, అభ్యర్థులను కొడుతూ, నామినేషన్ ఫారాలు గుంజుకొని చింపి వేస్తూ , భయభ్రాంతులకు గురి చేస్తూ ,ప్రత్యర్థుల వ్యాపారాల మీద, వాళ్ల వ్యక్తిగత సౌకర్యాల మీద  దాడులు చేస్తూ, కుటుంబ సభ్యులను బెదిరిస్తూ, అవసరమైతే ఏమైనా చేస్తామని అభ్యర్థులను భయబ్రాంతులకు గురి చేస్తూ ఎన్నికలు జరుపుతున్నారని మండిపడ్డారు.

పొదుపు సంఘాల మహిళలతో మీటింగ్ పెట్టి `మీరు కనుక వైయస్సార్ సిపి కి ఓటు వేయకపోతే మీకు రావలసిన వడ్డీ రాయితీ ఇతర సదుపాయాలు ఆపి వేస్తాం’ అని నేరుగా బెదిరిస్తున్నారని తెలిపారు. వాలంటీర్లకు `మీ 50 కుటుంబాలు ఎన్ని ఓట్లు వేస్తారు? తగ్గితే మీదే బాధ్యతే మీ ఇష్టం” అని టార్గెట్ పెట్టి  మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. 
 
అధికార పార్టీ కార్యకర్తలు నేరుగానే `మాకు అధికారం ఉంది మేము చేస్తాము’ అని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని భాస్కర్ చెప్పారు. అంటే మీరు చేసిన అభివృద్ధి అంతా చుమ్మా, బూటకం, మీ అభివృద్ధి మీద మీకే నమ్మకం లేదా అంటూ వారిని ఎద్దేవా చేశారు. ప్రజలు వాస్తవాలు గ్రహించి, ఓట్ అనే ఆయుధంతో ప్రజాస్వామ్యం నిలబెట్టడం కోసం సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 
 
హైకోర్టు కీలక ఆదేశాలు

ఇలా ఉండగా, గురజాల,దాచేపల్లి మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో అధికార పార్టీ నేతల బెదిరింపులు,అధికారుల తీరుపై హైకోర్టును టిడిపి అభ్యర్థులు ఆశ్రయించారు. ఎన్నికల తీరును వెబ్ కాస్టింగ్ ద్వారా టెలికాస్ట్ చేయాలని, టీడీపీ అభ్యర్థులు, ఓటర్లకు రక్షణ కల్పించాలని హైకోర్టులో టిడిపి అభ్యర్థులు పిటిషన్

టిడిపి అభ్యర్థులు, పోలింగ్ బూత్,ఓటర్లకు పోలీసులతో పూర్తిస్థాయిలో భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.
అదనపు బలగాలతో భద్రత కల్పించాలని డిజిపికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఎన్నికల తీరును వెబ్ కాస్టింగ్ ద్వారా అధికారులు పర్యవేక్షించే విధంగా టెలికాస్ట్ చేయాలని రాష్ట్ర ఎన్నికల కమీషన్ ను ఆదేశించింది.