త్వరలో కేసీఆర్ ప్రభుత్వం కూలడం ఖాయం

హుజూరాబాద్ ఉపఎన్నికలో బిజెపి అభ్యర్థిగా గెలుపొందిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ బుధవారం  ప్రమాణ స్వీకారం చేస్తూ హుజురాబాద్ తీర్పు ఆరంభం మాత్రమే అని చెబుతూ త్వరలో కేసీఆర్ ప్రభుత్వం కూలడం ఖాయమని స్పష్టం చేశారు. కేసీఆర్ నియంతృత్వ, అవినీతి పాలనపై పోరాటం చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.  కేసీఆర్‌కు ప్రజలపై ప్రేముంటే పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించాలని ఈటల డిమాండ్ చేశారు. 
రాష్ట్ర అసెంబ్లీలోని తన ఛాంబర్ లో ఈటల రాజేందర్ చేత స్వీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. వరుసగా అక్కడి నుండి ఏడుసార్లు ఎన్నికైన ఆయన గతంలో ఆరు సార్లు టి ఆర్ ఎస్ అభ్యర్థిగా గెలుపొందగా, ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంపై తిరుగుబాటు చేసి, బీజేపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా ప్రతిష్టాకరమైన ఎన్నికలో భారీ ఆధిక్యతతో గెలుపొందారు. 

ఈ సందర్భంగా మాటలుడు హుజురాబాద్ ప్రజల తీర్పుతో కేసీఆర్ కు దిమ్మతిరిగిందని ఈటల రాజేందర్ తెలిపారు. కేసీఆర్ సీఎం అయ్యాక ప్రోటోకాల్ ను కాలరాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రంలో ఉన్న స్వేచ్చ కూడా ఇప్పుడు లేకుండా పోయిందని మండిపడ్డారు.  తనను ఓడించేందుకు హుజురాబాద్‌లో రూ.600 కోట్లు ఖర్చుపెట్టారని విమర్శించారు. 

ఇప్పుడు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలకు గౌరవం లేదని తెలిపారు. తనను అకారణంగా మంత్రి వర్గం నుంచి తొలగించారని మండిపడ్డారు. ఇవాళ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన తర్వాత.. మీడియా పాయింట్‌లో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని అన్నారు.

కేంద్రం సర్కార్ వడ్లు కొంటుందని స్పష్టం చేటు రైతువేదికలు పశువులు కట్టేసే షెడ్లలా మారాయని మండిపడ్డారు. 8 ఏళ్లుగా వరి ధాన్యం కొన్నదెవరో కేసీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. ధర్నా చౌక్ అవసరమేంటో కేసీఆర్‌కు ఇప్పుడు తెలిసొచ్చిందని అన్నారు. ధర్నా చౌక్ వద్దన్న కేసీఆర్‌.. ఇప్పుడు అక్కడే ధర్నా చేస్తానంటున్నారని మండిపడ్డారు.

కేసీఆర్  ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదని అంటూ రెండు గంటలు కేసీఆర్‌‌ మాట్లాడుతున్నాడంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. హుజురాబాద్ ప్రజలు ఇచ్చిన తీర్పుకే కేసీఆర్‌‌కు దిమ్మతిరిగితే, యావత్‌ తెలంగాణ ప్రజలు ఇచ్చే తీర్పుకు ఆయన సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. 

నోరు చించుకుని మాట్లాడినంత మాత్రాన కేసీఆర్‌‌ తప్పు చేయనట్టు కాదని పేర్కొంటూ కేసీఆర్‌‌ మాటల్లో నిజం లేదని, విశ్వసనీయత లేదని ఈటల ధ్వజమెత్తారు. ఉద్యమకారుల నోట్లో మట్టి కొట్టి,  ఉద్యమ ద్రోహులకు పదవులు కట్టబెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఉద్యమకారులెవరూ కేసీఆర్‌‌ వెంట ఉండొద్దని ఈటెల పిలుపిచ్చారు. 

అంతకు ముందు గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు.  ఆ తర్వాత ఏడోసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో ఈటల వెంట పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తుల ఉమ, ఏనుగు రవీందర్ రెడ్డితోపాటు పలువురు బీజేపీ నేతలు ఉన్నారు.