ఈటల భూములపై మళ్లీ విచారణ!

మాజీ మంత్రి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు చెందిన జమున హేచరీస్‌ భూములను సర్వే చేసేందుకు అధికారులు సోమవారం నోటీసులు జారీ చేశారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో భూ సర్వే చేస్తామని అందులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మెదక్‌ కలెక్టర్‌ హరీశ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేటలోని జమున హేచరీ్‌సలో సీలింగ్‌, అసైన్డ్‌ భూములున్నాయనే ఆరోపణ నేపథ్యంలో గతంలో భూ సర్వే కోసం నోటీసులు జారీ చేశామని, కానీ హేచరీస్‌ యాజమాన్యం సర్వే ఆపాలని హైకోర్టులో పిటిషన్‌ వేసిందని గుర్తు చేశారు.

ఇందుకు కోర్టు అంగీకరించలేదని, కొవిడ్‌ వ్యాప్తి కారణంగా సర్వేను 3 నెలల పాటు వాయిదా వేయాలని ఆదేశించిందని వివరించారు. జిల్లాలో గత పది రోజులోగా కరోనా కేసులు లేకపోవడంతో సర్వే నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేరకు జమున హేచరీస్‌ యాజమాన్యానికి అధికారులు నోటీసులు అందజేశారని వెల్లడించారు. మరో 100 మందికి కూడా నోటీసులు ఇచ్చినట్లు కలెక్టర్‌ వివరించారు.

గతంలో జమున హేచరీస్ 65 ఎకరాల్లో అసైన్డ్ భూమిని కబ్జా చేశారని రైతులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో విజిలెన్స్, ఎసిబి అధికారులు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందేనన్నారు. అచ్చం పేట, హక్కింపేట గ్రామాల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు జమున హేచరీస్, పౌల్ట్రీఫామ్‌కు సంబంధించిన సుమారు 175 ఎకరాల్లో చేపట్టిన డిజిటల్ భూ సర్వేలో దాదాపు 65 ఎకరాల సీలింగ్ భూమి గా ప్రాథమిక నిర్దారణ తేలిందని కలెక్టర్ తెలిపారు.  హకీంపేట, అచ్చంపేటలో ఉన్న జమున హేచరీస్‌ డైరెక్టర్‌, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌  కోడలు క్షమితకు అధికారులు నోటీసులు అందజేశారని, సంస్థ కార్యాలయ గోడకు కూడా నోటీసులు అతికించారని చెప్పారు.

కాగా, ఉప ఎన్నికలో గెలిచినందుకే ఈటలపై సీఎం కేసీఆర్‌ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు విమర్శించారు. మెదక్‌ జిల్లా చేగుంటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కోర్టు మొట్టికాయలు వేసినా.. జనం ఓడించినా కేసీఆర్‌ తీరు మారడం లేదని విమర్శించారు. చట్టప్రకారం ఎలాంటి విచారణను ఎదుర్కోవడానికైనా ఈటల సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో సరిహద్దు వద్ద చైనా సైనికుల దాడికి తట్టుకోలేక భారత సైనికులు తోకముడిచారని వ్యాఖ్యానించిన సీఎం కేసీఆర్‌పై రాజద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.