కమ్యూనిస్టులను అధికారంలోకి రాకుండా అడ్డుకున్న రంగా

* 121వ జయంతి నివాళి 

ప్రపంచంలోనే ఎన్నికల ద్వారా ఏర్పడిన తొలి కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని కేరళలో 1957లో ఇఎంఎస్ నంబూద్రిపాద్ ఏర్పాటు చేయడానికి ముందే ఆంధ్రాలో ఏర్పాటు చేయడంకోసం కమ్యూనిస్టులు విఫల ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలను అడ్డుకొన్న యోధుడు రైతు నేత ఆచార్య ఎన్జీ రంగ అని చెప్పవచ్చు. ఒక్కసారి కాదు, వరుసగా రెండు సార్లు కేవలం ఆయన కారణంగా కమ్యూనిస్టులు ఆంధ్రాలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేక పోయారు. 

మొదటగా, 1952లో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో స్వతంత్ర భారత దేశంలో జరిగిన తొలి సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ కు మెజారిటీ రాలేదు. దానితో సుమారు 60 మంది సభ్యులు గల కమ్యూనిస్ట్ పార్టీ మరికొంతమంది మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా 20 మంది సభ్యులున్న కృషికార్ లోక్ పార్టీ అధినేత ఆచార్య ఎన్జీ రంగా మద్దతు కీలకమైనది. 

అయితే కమ్యూనిస్ట్ లు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆయన సుతారం ఇష్టపడలేదు. అందుకనే, మొదటి గవర్నర్ జనరల్ గా పనిచేసి, దాదాపు రాజకీయాల నుండి నిష్క్రమించిన రాజగోపాలాచారిని ముఖ్యమంత్రిగా చేస్తే మద్దతు ఇస్తానని కాంగ్రెస్ కు ప్రతిపాదించి, ఆయన రెండుసారి ముఖ్యమంత్రి కావడానికి దోహదం చేశారు.

ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో 1955లో జరిగిన తొలి ఎన్నికలలో తామే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు కమ్యూనిస్టులు కలలు కన్నారు. ముందుగానే సుందరయ్య ముఖ్యమంత్రి, బసవపున్నయ్య హోమ్ మంత్రి అంటూ మొత్తం మంత్రివర్గాన్ని ప్రకటించారు.

ఈ సారి కూడా కాంగ్రెస్ బయట ఉన్న ఆచార్య రంగా, టంగుటూరి ప్రకాశం పంతులు కాంగ్రెస్  పార్టీతో చేతులు కలిపి, ఎన్నికలలో ఉమ్మడిగా పోటీచేసి, కమ్యూనిస్టులను ఓడించారు. అప్పటి దెబ్బకు ఆ తర్వాత వారు కోలుకోలేదు. నేడు రెండు తెలుగు రాష్ట్రాలలో శాసనసభలలో కనీసం ప్రాతినిధ్యం లేకుండా కమ్యూనిస్ట్ పార్టీలు ఉనికి కోల్పోయే పరిస్థితులలో ఉన్నాయి. 

రాజకీయంగా అధికారమలోకి రాకుండా అడ్డుకోవడమే కాకుండా, సైద్ధాంతికంగా కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు రంగా అని చెప్పవచ్చు. ఆంధ్రాలో ప్రతి గ్రామంలో కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు ఉండేవారు. రష్యా విప్లవం స్పూర్తితో అనేకమంది యువత వారిని అనుసరించేవారు. 

అందుకు విరుగుడుగా రాజకీయ పాఠశాలలు నెల రోజుల చొప్పున జరిపేవారు. మొదటి పాఠశాల 1934లో తన స్వగ్రామం నిడుబ్రోలులోనే జరిపారు. ఆ తర్వాత ఆంధ్ర రాజకీయాలలో రాటుతేలిన అనేకమంది నాయకులు ఈ పాఠశాలలో శిక్షణ పొందినవారే. 

రైతాంగ సమస్యలపై ఒకవైపు రాజీలేని పోరాటాలు జరుపుతూ, మరోవంక కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా పోరాడుతూ రావడంతో, ఆయన జీవించి ఉన్నంత వరకు కమ్యూనిస్టులు ఆయనను క్షమించలేక పోయారు. ప్రపంచ వ్యాప్తంగా కేవలం రైతు కులాలకోసమే పనిచేస్తూ వస్తున్న కమ్యూనిస్ట్ పార్టీలు భారత్ లో మాత్రం వ్యవసాయ సంఘాలు ఏర్పాటు చేసుకొని, రైతు సమస్యలపై కూడా పోరాటాలు చేయడం రంగా ప్రభావంతోనే అని గమనించాలి. 

గుంటూరు జిల్లా నిడుబ్రోలు గ్రామంలో 1900 నవంబర్ 7న ఒక సాధారణ రైతు కుటుంభంలో జన్మించిన ఆయన ఐసిఎస్ పరీక్షలకు చదవడం కోసం బంధువులు, మిత్రుల సహకారంతో లండన్ వెళ్లారు. కానీ అక్కడకు చేరుకోగానే మహాత్మా గాంధీని బ్రిటిష్ పోలీసులు అరెస్ట్ చేసారని తెలుసుకొని ఆగ్రహం చెందారు.

ఐసిఎస్ అధికారిగా అటువంటి ప్రభుత్వంలో తాను పనిచేయాలా అంటూ ఇంటికి వెళ్ళిపోతానన్నారు. అయితే మిత్రుల ప్రోత్సాహంతో అక్కడనే ఉండి అర్ధశాస్త్రంలో ఆక్సఫోర్ట్ యూనివర్సిటీ నుండి బి.లిట్ డిగ్రీ పొంది, తిరిగి వచ్చి మద్రాస్ లోని పచ్చపాస్ కళాశాలలో అధ్యాపకునిగా చేరారు. కానీ గాంధీజీ పిలుపందుకొని ఉద్యోగం వదిలి, స్వతంత్ర సంగ్రామంలో చేరారు.

కొద్దిపాటి పొలంపై వచ్చే ఆదాయంతో జీవనం సాగించడం కోసం తన పొలంలోనే ఒక చిన్న ఇల్లు వేసుకొని, భార్యతో కలసి ఉంటూ, మాంసాహారం మానివేశారు. నేత వస్త్రాలు వేసుకునేవారు. చివరి వరకు  సాదా, సీదా జీవనం గడిపారు. సుదీర్ఘకాలం 60 ఏళ్లపాటు భారత పార్లమెంట్ సభ్యునిగా ఉన్నారు. స్వాతంత్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు. 
 
స్వతంత్ర భారత దేశంలో వివిధ సందర్భాలలో జరిగిన రైతు ఉద్యమాలలో ఉంచుతున్న ప్రధాన డిమాండ్లను 1936లోనే రంగా దేశం ముందుంచారు. ఈ డిమాండ్లను మద్దతుగా ఆయన నేతృత్వంలో రైతులు 200 కిమీ దూరం పాద యాత్ర జరిపి, మహారాష్ట్ర లోని  ఫిజాపూర్ లో జరుగుతున్న అఖిల భారత కాంగ్రెస్ మహాసభలకు నివేదించారు. నేటికి కూడా ఇవే రైతులకు కీలక డిమాండ్లుగా మిగిలి ఉండడం గమనార్హం.
 
కిసాన్ సభ రంగా అధ్యక్షతన 1926లో గుంటూరు లో ఏర్పడింది. అయితే 1942 నాటికి  కమ్యూనిస్టులు కిసాన్ సభను ఆక్రమించడంతొ ఆయన తన పదవికి రాజీనామా చేసి, మౌనంగా తప్పుకున్నారు. ఈ డిమాండ్లపై నాటి కాంగ్రెస్ మహాసభలలో వాడి, వేడిగా చర్చలు జరిగాయి. జవహర్ లాల్ నెహ్రు వంటి నేతలు ఈ డిమాండ్లకు మద్దతు తెలిపారు. అయితే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వాటిని తిరస్కరించింది.
ఇంతకు ఆ డిమాండ్లు ఏమిటి?
 
1. పెద్ద, పెద్ద వ్యవసాయ కమతాలను రద్దు చేయాలి. 2. అన్ని వ్యవసాయ రుణాలను రద్దు చేయాలి. 3. ప్రభుత్వం వద్ద గల బంజరు భూములు అన్నింటిని రైతులు, వ్యవసాయ కూలీలు పంపిణి చేయాలి. 4. వ్యవసాయ రంగంలో ఆదాయపన్ను విధించాలి. కేవలం వ్యవసాయం చేసేవారి ఆదాయంపై కొంతమేరకు మినహాయింపు కలిగిస్తూ, రైతువారి ఆదాయాలపై పన్ను విధించాలి. 
 
5. కౌలు రైతులు అందరికి హక్కులు కల్పించాలి. 6. చౌకగా రుణ సదుపాయం, సరసమైన ధరలకు  విత్తనాలు అందించాలి. 7. వ్యవసాయ మార్కెట్ లలో ప్రైవేట్ వ్యాపారులు, దళారులను నిర్ములించడం కోసం సహకార మార్కెట్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. 
స్వతంత్రం రాగానే జమిందారీ వ్యవస్థను రద్దు చేయడం ద్వారా పెద్ద, పెద్ద వ్యవసాయ కమతాలను రద్దు చేయడం జరిగింది. మిగిలిన డిమాండ్లు మాత్రం ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఆ విధంగా భారత రాజకీయ రంగం వ్యవసాయ సమస్యలపై దృష్టి సారింప చేయడం కోసం రంగా విశేషంగా కృషి చేశారు. 
 
అంతేకాదు స్వతంత్ర పోరాటంలో రైతులు క్రియాశీలకంగా పాల్గొనేటట్లు కూడా చేశారు. దేశ వ్యాప్తంగా పర్యటనలు జరిపి రైతులు, రైతు కూలీల సంక్షేమం కోసం అలుపెరుగని పోరాటం జరిపారు. పార్లమెంట్ లో ఏ పార్టీ సభ్యుడైన రైతులకు అనుకూలంగా మాట్లాడితే చప్పట్లు కొట్టి, భుజం తట్టి ప్రోత్సహించేవారు. 1964లో సాధారణ రైతుల భూములను ప్రభుత్వాలు ఎటువంటి పరిహారం చెల్లింపకుండా స్వాధీనం చేసుకొనే విధంగా 17వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టినప్పుడు రంగా చేసిన ఉద్వేగపూరిత ప్రసంగం కారణంగా ఆమోదంకు నోచుకోలేదు. 
 
ఒక సమయంలో రైతుల సమస్యలపై ప్రస్తావన రాగా, రంగా పార్లమెంట్ లో ఉన్నంతకాలం భారత రైతులు సుఖంగా నిద్రపోవచ్చని జవహర్ లాల్ నెహ్రు చెప్పారు. ఆయన ఎదుట ఏ ప్రభుత్వం కూడా రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే సాహసం చేయలేదని కూడా చెప్పడం గమనార్హం. 
 
కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్షంగా భారతీయ జనసంఘ్ పెరుగుతున్న సమయంలో, పార్టీలో గ్రామీణ, వ్యవసాయ సమస్యలపై అవగాహన గలవారు లేరని భావించి, నానాజీ దేశముఖ్ నిడుబ్రోలు వెళ్లి, రెండు రోజులు ఉండి, ఆయనను పార్టీలో చేరమని ఆహ్వానించారు. పార్టీ అధ్యక్ష పదవి కూడా ఇవ్వజూపారు. కానీ ఎందుకో ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. ఆ సంవత్సరం నాగపూర్ లో ఆర్ ఎస్ ఎస్ విజయదశమి ఉత్సవంకు ఆయన అధ్యక్షత వహించారు.