నవాబ్‌ మాలిక్‌పై పరువు నష్టం కేసు

ఎన్‌సిబి ముంబయి జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే తండ్రి ధ్యాన్‌దేవ్‌ కచ్రూజీ వాంఖడే మహారాష్ట్ర మంత్రి, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి) నేత నవాబ్‌ మాలిక్‌పై పరువు నష్టం కేసు వేశారు. రూ.1.25 కోట్ల నష్టపరిహారం కోరుతూ బొంబాయి హైకోర్టులో కేసు దాఖలైంది. నవాబ్‌ మాలిక్‌ సూచనల మేరకు తమ కుటుంబం గురించి ప్రచురించడం, రాయడం చేస్తున్నారని, వాటిపై శాశ్వత నిషేధాన్ని కోరుకుంటున్నట్లు పిటిషన్‌లో కోరారు. 

ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేని తన కుమార్తె, క్రిమినల్‌ లాయర్‌ అయిన యాస్మిన్‌ ప్రాక్టీస్‌ను నాశనం చేయడంతో పాటు మహారాష్ట్ర మంత్రి తన కుటుంబసభ్యుల కీర్తి ప్రతిష్టతలకు పూడ్చలేని నష్టం, హాని కలిగిస్తున్నారని, భంగం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. 

బాలీవ్డ్‌ు స్టార్‌ హీరో షారూఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ నిందితుడిగా ఉన్న ముంబయి క్రూయిజ్‌ డ్రగ్స్‌ కేసు నుండి ఇటీవల ఎన్‌సిబి తొలగించి సమీర్‌ వాంఖడేపై నవాబ్‌ మాలిక్‌ వరుస ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. మాలిక్‌ అల్లుడు సమీర్‌ ఖాన్‌ ప్రమేయం ఉన్న కేసులో కూడా సమీర్‌ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఎన్‌సిబి అధికారిగా ఉద్యోగం పొందేందుకు తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించారని ఆరోపించారు.

సాక్ష్యాలుంటే కోర్టుకు వెళ్లండి

మరోవంక, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ చేసిన తాజా ఆరోపణలపై ఎన్‌సీబీ అధికారులు స్పందించారు. ఆ ఆరోపణలకు తగిన సాక్ష్యాలుంటే ఆయన కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. 
 
దుబాయ్, మాల్దీవుల్లో వాంఖడే ఉన్నారని, బీజేపీ నేత మోహిత్ భారతీయ (మోహిత్ కాంబోజ్)తో మాట్లాడారని వాంఖడేపై నవాబ్ మాలిక్ ఆదివారంనాడు తాజా ఆరోపణలు చేశారు. షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ కిడ్నాప్‌‌ కుట్రలో సమీర్ వాంఖడే పాత్ర ఉందని, నిజానికి ఇది కిడ్నాప్, బలవంతపు వసూళ్లకు సంబంధించిన కేసు అని నవాబ్ మాలిక్ ఆరోపించారు.
 క్రూయిజ్ పార్టీలో పాల్గొనేందుకు ఎలాంటి టిక్కెట్టు ఆర్యన్ కొనుగోలు చేయలేదని, ప్రతీక్ గాబ, అమీర్ ఫర్నిచల్‌వాలాలు ఆర్యన్‌కు క్రూయిజ్ షిప్‌పైకి తీసుకు వెళ్లారని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై ఎన్‌సీబీ అధికారులు వెంటనే స్పందించారు. ఇందుకు తగిన ఆధారాలు ఉంటే నేరుగా కోర్టుకే వెళ్లొచ్చు కదా అని ప్రశ్నించారు. వాంఖడే ఎన్‌సీబీ ఇన్‌ఫార్మర్ కాదని, శామ్ డిసౌతో‌ ఎలాంటి పరిచయాలు లేవని స్పష్టం చేశారు.