భారీగా తగ్గిన వంటనూనె ధరలు

దీపావళికి ముందు రోజు పెట్రో పన్నులు తగ్గిస్తూ ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వంట నూనెలపై భారం తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పామాయిల్‌, సోయాబీన్, సన్‌ఫ్లవర్, వేరు శనగ నూనెలకు సంబంధించిన క్రూడ్‌ అయిల్‌, రిఫైన్డ్‌ ఆయిల్‌పై పన్ను తగ్గించింది. పామాయిల్‌పై రూ. 20, వేరుశెనగ నూనెపై రూ. 18 తగ్గాయి. సోయాబీన్‌ నూనెపై రూ. 10, పొద్దు తిరుగుడు నూనెపై 7 రూపాయలు తగ్గాయని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే తెలిపారు. 
 
కేంద్రం ఇటీవలి కాలంలో తీసుకున్న పలు చర్యలతో వంటనూనెల ధరలకు కళ్లెం పడిందని, దేశంలోని ప్రధాన మార్కెట్లలో వంటనూనె టోకు ధరలు కిలోకు రూ 5 నుంచి రూ 20 వరకూ తగ్గాయని ఆయన పేర్కొన్నారు. దిగుమతి సుంకాలలో తగ్గింపులు వంటి పలు చర్యలను తీసుకున్నట్లు, దీనితో వంటనూనెల ధరలు గాడిలో పడుతున్నట్లు వివరించారు.
 
గత ఏడాది నుంచి ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వంట నూనెల క్రూడ్‌ (క్రూడ్ పామాయిల్, క్రూడ్ సోయాబీన్ ఆయిల్, క్రూడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్)పై బేసిక్ డ్యూటీని 2.5 శాతం నుంచి జీరోకు తగ్గించేసినట్లు కేంద్ర పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ తెలిపింది. 
 
అలాగే  క్రూడ్‌ పామాయిల్‌పై 20 శాతం ఉన్న అగ్రిసెస్‌ను 7.5 శాతానికి, క్రూడ్ సోయాబీన్‌ ఆయిల్‌పై 5 శాతానికి తగ్గించినట్లు పేర్కొంది. రిఫైన్డ్‌ పాయాయిల్, సోయాబీన్, సన్‌ఫ్లవర్‌‌ ఆయిల్‌పై 32.5 శాతం ఉన్న బేసిక్‌ డ్యూటీ టాక్స్‌ను 32.5 శాతం నుంచి 17.5 శాతానికి తగ్గించినట్లు వెల్లడించింది.

ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరగడంతో జాతీయంగా వంటనూనెల ధరలు పెరుగుతూ వచ్చాయి. వంటకు వాడే నూనెల సరఫరా అరకొరగా ఉండటం ప్రధాన సమస్యగా మారింది. ఇటీవలి కాలంలో మనం వంటనూనెను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న ఇండోనేషియా, బ్రెజిల్ ఇతర దేశాలలో ఈ సరుకును జీవ ఇంధన అవసరాలకు వాడుతున్నారు. దీనితో అక్కడి నుంచి సరఫరాలు తగ్గాయి.

ఈ క్రమంలో వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నివారణకు తాము దృష్టి సారించామని పాండే తెలిపారు. పలు చర్యలు చేపడుతూ వస్తున్నామని పేర్కొంటూ ముందుగా దిగుమతి సుంకమును తగ్గించామని చెప్పారు. ఈ క్రమంలో చిల్లర ధరలు తగ్గినట్లు దాదాపు 167 కేంద్రాల నుంచి సరైన సమాచారం అందిందని తెలిపారు. 

పూర్తి స్థాయిలో పలు రిటైల్ మార్కెట్లలో వంటనూనెల ధరల పరిస్థితిని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటున్నట్లు వివరించారు. ఢిల్లీలో పామాయిల్ ధరలు రూ 5 మేర తగ్గింది. దీనితో ఈ నెల మూడు నుంచి ఇక్కడ కిలో నూనె ధర రూ 133 అయింది. ఇక ఇతర ప్రాంతాలలో కూడా ధరలు తగ్గాయని పట్టికను చూపారు. 

పల్లీ, సోయాబిన్, సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలు కూడా మూడో తేది రికార్డుతో చూసుకుంటే తగ్గుదలలో ఉన్నాయని తెలిపారు. పలు చర్యలు తీసుకుంటున్నా ఇప్పటివరకూ దేశంలో ఆవాల నూనెల ధరలు అదుపులోకి రాలేదని పాండే అంగీకరించారు. అయితే ఇప్పుడు దిగుమతి సుంకాలలో తగ్గింపులతో ఇకపై ఈ నూనె ధర కూడా తగ్గుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.