ఇంకెంతమంది నిరుద్యోగులు బలికావాలి కేసీఆర్!

 తెలంగాణ వచ్చాక 140 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెబుతూ ఇంకా ఎంతమంది బలి కావాలి? ఎంతమంది బలవన్మరణానికి పాల్పడితే నోటిఫికేషన్లు ఇస్తావ్‌? అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు. 
 
ప్రజలు నీకు అధికారమిచ్చింది ఫాం హౌస్‌లో పడుకోవడానికి కాదని చెబుతూ కేసీఆర్‌.. బయటకు  రా! నోటిఫికేషన్‌న్లు వేసి ఉద్యోగాలు భర్తీ చెయ్‌ అని డిమాండ్ చేశారు.  శుక్రవారం బండి సంజయ్‌ హైదరాబాద్‌ చిక్కడపల్లిలోని సెంట్రల్‌ లైబ్రరీని సందర్శించి.. వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధవుతున్న నిరుద్యోగులతో సంభాషిస్తూ అదిగో, ఇదిగో అంటూ నోటిఫికేషన్‌లపై లీకులివ్వడం, ఎన్నికలప్పుడు మాయమాటలు చెప్పడం తప్ప చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు.
నీళ్లు, నియామకాలు, నిధుల కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే నియామకాలు ఏవి? ఎక్కడ? అని సీఎం కేసీఆర్‌ను నిలదీశారు. ఫాంహౌజ్ నుండి బయటకు రారు. ఆయనింట్లో 5 గురికి ఉద్యోగాలొస్తయ్. కానీ యువతకు మాత్రం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వరు. ఆత్మహత్యలు చేసుకుంటుంటే మభ్యపెట్టడానికి కమిటీలంటూ కాలయాపన చేస్తున్నరు. ఇంకెన్నాళ్లీ మోసం అంటూ కేసీఆర్ ప్రభుత్వ ధోరణిని ఎండగట్టారు.
ఈ ప్రభుత్వంపై బీజేపీ యుద్దం చేయబోతోందని చెబుతూ ఈనెల 16న లక్షలాది మంది యువతతో మిలియన్ మార్చ్ నిర్వహించబోతున్నం ప్రకటించారు. కేసీఆర్ మెడలు వంచుతాం. గడీల నుండి బయటకు రప్పిస్తం. నోటిఫికేషన్లు ఇచ్చేదాకా కొట్లాడతాం అని స్పష్టం చేశారు. నిరుద్యోగ భ్రుతి రూ.3.016 ఇస్తానని ఊరించుకుంటూ హామీలిచ్చినవ్? ఏమైంది? అంటూ ప్రశ్నించారు.
“నీ ఇంట్ల మీ అందరివీ కలిపితే రూ.16 లక్షల దాకా జీతాలొస్తయ్. మరి నిరుద్యోగ యువత సంగతేంది? ఆనాడు పిట్ట కథలు చెప్పి రెచ్చగొట్టి ఆత్మహత్యలను ప్రేరేపించితివి. హుజూర్ నగర్ నుండి మొదలు దుబ్బాక, జీహెచ్ఎంసీ, నాగార్జున సాగర్, ఎమ్మెల్సీ ఎన్నికలు, హుజూరాబాద్ ఎన్నికల దాకా నోటిఫికేషన్ ఇస్తానని చెబుతూనే మభ్యపెడుతున్నవ్” అంటూ సంజయ్ మండిపడ్డారు.
. ‘‘ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నావ్‌. ఇప్పుడేమో ఇది సాధ్యమా అంటావు. నిన్నెవరూ అడక్కుండానే మాటిచ్చావు. ఎలా సాధ్యమని ప్రశ్నిస్తావు? ఇటీవలి ఎన్నికలప్పుడు ఉద్యోగాలపై ఏం మాటిచ్చావో దానిపైనే నిలబడమంటున్నాం. నువ్వు నియమించిన టీఎ్‌సపీఎ్‌ససీ ఛైర్మన్‌ ఏమి మాటిచ్చారో గుర్తు చేసుకో’’ అని సంజయ్‌ హితవు చెప్పారు.