డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో వాహనాల జప్తు వద్దు 

మద్యం సేవించి నడిపితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని తెలంగాణ హైకోర్టు  స్పష్టం చేసింది. అలాగే మద్యం సేవించిన వ్యక్తి వాహనం నడిపేందుకు అనుమతించవద్దని, మద్యం తాగని మరో వ్యక్తి వాహనదారుడి వెంట ఉంటే అతడికి వాహనాన్ని అప్పగించాలని తెలిపింది.
ఒకవేళ వాహనదారుడి వెంట ఎవరూ లేకపోతే బంధువు లేదా స్నేహితుడిని పిలిపించి వాహనాన్ని ఇవ్వాలని సూచించింది. ఎవరూ రాకపోతే వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించి తర్వాత వాహనాన్ని అప్పగించాలని తెలిపింది. ఇక ప్రాసిక్యూషన్ అవసరమైన కేసుల్లో 3 రోజుల్లో ఛార్జ్‌షీట్ వేయాలని హైకోర్టు తెలిపింది.
ప్రాసిక్యూషన్ పూర్తయ్యాక వాహనాన్ని అప్పగించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయని పోలీసులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. మద్యం సేవించి వాహనం డ్రైవింగ్ చేయడం నేరమని, ఒకవేళ మద్యం సేవించి ఉంటే వాహన చోదకుడిని అరెస్ట్ చేయొచ్చు కానీ, వారి వాహనాన్ని మాత్రం సీజ్ చేయొద్దని రాష్ట్ర హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
డ్రంక్ అండ్ డ్రైవర్ కేసులపై దాఖలైన 40 రిట్ పిటిషన్లపై విచారణ పూర్తి చేస్తూ జస్టిస్ కె ఎల్ లక్ష్మణ్ సారధ్యంలోని హైకోర్టు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. మద్యం సేవించిన వ్యక్తి వాహనం నడుపుతూ ఉంటే, ఆయనతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వ్యక్తి డ్రైవింగ్ చేసేందుకు పోలీసులు అనుమతించాలని సూచించింది.
లేని పక్షంలో వారి బంధువుకు గానీ, స్నేహితుడికి గానీ సమాచారం ఇచ్చి సదరు వాహనం తీసుకెళ్లమని సూచించాలని హైకోర్టు పేర్కొంది. ఈ మార్గదర్శకాలను అమలు చేసే అవకాశం లేనప్పుడు మాత్రమే పోలీసులు సంబంధిత వాహనాన్ని తాత్కాలికంగా తమ ఆధీనంలోకి తీసుకోవాలని సూచించింది. అలా జప్తు చేసిన వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ సమర్పించిన దాని యజమాని, లేదా అధీకృత వ్యక్తికి తదుపరి దాన్ని అప్పగించాల్సి ఉంటుంది. మోటార్ వెహికల్స్ యాక్ట్ గానీ, ఇతర ప్రభుత్వ ఆదేశాల్లో గానీ ఒక వ్యక్తి వాహనాన్ని సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని స్పష్టం చేసింది.