22 రాష్ట్రాల్లో మరింతగా తగ్గిన పెట్రోల్ ధరలు 

దీపావళి పర్వదినం సందర్భంగా పెట్రోల్ పై రూ 5, డీజిల్ పై రూ 10 చొప్పున కస్టమ్ సుంకాలను తగ్గించి, వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కలిగించిన దారిలో 22 రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా రాష్ట్ర స్థాయిలో విధించే  విలువ ఆధారిత పన్ను (వ్యాట్)లను తగ్గించి మరింతగా ధరలు తగ్గేందుకు దోహదపడ్డాయి.
ఒక్కో రాష్ట్రం ఒక్కో రకంగా వ్యాట్‌ను తగ్గించాయి. అయితే ఒక్క ఒడిశా తప్ప వ్యాట్ తగ్గించిన రాష్ట్రాలన్నీ కూడా బి జెపి, దాని భాగస్వామ్య పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలే కావడం గమనార్హం. ఈ తగ్గుదల ఉత్తరాఖండ్‌లో అతి తక్కువగా ఉండగా, కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌లో అత్యధికంగా ఉండడం విశేషం.
 
ఉత్తరాఖండ్‌లో పెట్రోల్‌పై లీటరుకు రూ.1.97లు తగ్గించగా, లడఖ్‌లో ఈ తగ్గుదల రూ.8.70 మేర ఉంది. ఉత్తరాఖండ్‌లో డీజిల్‌పై ఎలాంటి ఊరట ఇవ్వక పోగా లడఖ్‌లో రూ.9.52 మేర వ్యాట్‌ను తగ్గించారు. ఉత్తరాఖండ్‌లో వ్యాట్ తక్కువగా ఉండడమే అక్కడ తగ్గింపులు తక్కువగా ఉండడానికి కారణం.
వ్యాట్‌ను తగ్గించిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కర్నాటక, పుదుచ్చేరి, మిజోరాం, అరుణాచల్‌ప్రదేశ్, గోవా, గుజరాత్,దాద్రా, నాగర్ హవేలి, డామన్ డయ్యు, చండీగఢ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూ, కశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా,లడఖ్ ఉన్నాయి.
కర్నాటక ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.8.62, డీజిల్‌పై రూ. 9.40 తగ్గించగా, మధ్యప్రదేశ్ ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.6.89, డీజిల్‌పై రూ.6.96 వ్యాట్ తగ్గించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.6.96, డీజిల్‌పై రూ.2.04 తగ్గించింది. కాగా వ్యాట్ తగ్గించని రాష్ట్రాల్లో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాజస్థాన్, పంజాబ్, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్, తమిళనాడుతో పాటుగా ఆప్ అధికారంలో ఉన్న ఢిల్లీ, టిఎంసి పాలనలు ఉన్న పశ్చిమ బెంగాల్, వామపక్షాలు అధికారంలో ఉన్న కేరళ, టిఆర్‌ఎస్ అధికారంలో ఉన్న తెలంగాణ, వైఎస్‌ఆర్ పార్టీ అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి.

బిజూ జనతాదళ్ అధికారంలో ఉన్న ఒడిశా మాత్రం పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.3 మేర తగ్గించింది. ఈ తగ్గింపుల తర్వాత చాలా బిజెపి పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్ ధర లీటరు రూ.100 దరిదాపులకు చేరుకుంది. మరో వైపు రాజస్థాన్‌లో మాత్రం ఇప్పటికీ పెట్రోల్ ధర అత్యధికంగా లీటరు రూ.111.10గా ఉంది. 

ఇక ముంబయిలో రూ.109.98 ఉండగా, ఎపిలో రూ.109.05గా ఉంది.అలాగే రాజస్థాన్‌లో డీజిల్ ధర అత్యధికంగా రూ.95.71గా ఉండగా, ఎపి (రూ.95.18), ముంబయి (రూ.94.14) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మిజోరాంలో డీజిల్ ధర లీటరుకు అతి తక్కువగా రూ.79.55 ఉండడం గమనార్హం.