7 న బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశం

కరోనా మహమ్మారి తర్వాత మొదటిసారిగా బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశం ఈ నెల 7న జరుగనున్నది. ఐదు రాష్ట్రాలలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలే ప్రధాన అంశం అయ్యే అవకాశం ఉన్నది. 

ఇటీవల జరిగిన ఉపఎన్నికలలో మిశ్రమ ఫలితాలు రావడంతో సర్దుబాటు చర్యలు చేపట్టిన బిజెపి, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ లలో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. 

ప్రస్తుత రాజకీయ పరిణామలు, ఇతర కీలకాంశాలపై కూడా సమావేశంలో చర్చ ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. శనివారంనాడు జరిగే ప్రధాన కార్యదర్శుల సమావేశంలో ఎజెండా అంశాలు ఖరారు అవుతాయని బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ తెలిపారు. ఎజెండాలోని తీర్మానాలను ఆదివారం జరిగే జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆమోదించనున్నారు. 

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభోపన్యాసంతో సమావేశం ప్రారంభమవుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ ముగింపు ఉపన్యాసం చేస్తారు. దేశంలో 100 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తవడం, ఇంధనం ధరల తగ్గింపు, ఇటీవల చేపట్టిన విదేశీ పర్యటనలు విజయవంతం కావడంపై ప్రధాని మోదీని ప్రశంసిస్తూ సమావేశంలో ఒక తీర్మానం ఆమోదిస్తారని కూడా  పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

కాగా, ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ ఎన్‌డీఎంసీ కన్వెన్షన్ సెంటర్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతుందని బీజేపీ రాజ్యసభ ఎంపీ, పార్టీ మీడియా సెల్ జాతీయ అధ్యక్షుడు అనిల్ బాలుని తెలిపారు. నేషనల్ ఆఫీస్ బేరర్లు, కేంద్ర మంత్రులు సమావేశానికి నేరుగా హాజరవుతారని, రాష్ట్ర నేతలు తమ తమ రాష్ట్ర రాజధానుల నుంచి వర్చువల్ మీట్‌ ద్వారా పాల్గొంటారని చెప్పారు.