హర్యానాలో బీజేపీ ఎంపీ కారు ధ్వంసం

హర్యానాలోని హిసార్ జిల్లాలో బీజేపీ ఎంపీ రామ్ చందర్ జాంగ్రా పర్యటనకు నిరసనగా ఆయన కారుపై కొందరు శుక్రవారంనాడు దాడి చేశారు. కర్రలతో జరిపిన ఈ దాడిలో ఆయన కారు అద్దాలు పగిలాయి. ఈ ఘటనలో ఎవరూ గాయలేదు. దాడికి పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. 

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలపై నిరసన తెలుపుతున్న హర్యానా రైతులు.. అధికార బీజేపీ, జన్‌నాయక్ జనతా పార్టీ నేతల కార్యక్రమాలు, పర్యటనలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం, నల్లజెండాలు ధరించిన నిరసనకారులు రామ్‌ చందర్ జాంగ్రాను హిసార్‌లో అడ్డుకున్నారు. 

కర్రలతో కారుపై దాడిగి దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆయన వెళ్లేందుకు మార్గం క్లియర్ చేశారు. ఒక కార్యక్రమం పూర్తి చేసుకుని మరో కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా కొందరు దుండగులు తన కారుపై లాఠీలు విసిరారని, ధ్వంసం చేశారని, అయితే ఎవరూ గాయపడలేదని రామ్ చందర్ జాంగ్రా తెలిపారు.

ఘటనపై తాను హర్యానా డీజీపీ, ఎస్పీతో మాట్లాడనని చెప్పారు.  చట్టప్రకారం దుండగులపై చర్య తీసుకోవాలని కోరుతూ ఇది కచ్చితంగా హత్యాయత్నమేనని ఆయన స్పష్టం చేశారు. మరో రెండు ప్రైవేటు కార్యక్రమాల్లో తాను పాల్గొనాల్సి ఉన్నప్పటికీ కారు దెబ్బతినడంతో వాటిని రద్దు చేసుకున్నట్టు చెప్పారు. వ్యక్తిగత ఫంక్షన్లకు వెళ్లినా వాళ్లు (రైతులు) దాడి చేస్తారా? అని ప్రశ్నించారు. ఈ ఘటన జరిగినప్పుడు ఆయన కారు వెనుక సీటులో కూర్చున్నారు.