కొవాగ్జిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి

హైద‌రాబాద్‌కు చెందిన భార‌త్ బ‌యోటెక్ కంపెనీ అభివృద్ధి చేసిన కొవిడ్ టీకా కొవాగ్జిన్‌కు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గుర్తింపు ద‌క్కింది. దాంతో భార‌త్ మాత్ర‌మే కాకుండా ఇత‌ర దేశాల్లో కూడా కొవాగ్జిన్ టీకా అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తి ల‌భించిన‌ట్ల‌య్యింది.
 
 కొవాగ్జిన్ టీకాను అన్ని విధాలుగా ప‌రీక్షించిన‌ డబ్ల్యూహెచ్ఓ టెక్నిక‌ల్ అడ్వైజ‌రీ క‌మిటీ.. ఏ లోపాలు లేక‌పోవ‌డంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్య‌వ‌స‌ర వినియోగానికి ఆమోదం తెలిపింది. భార‌త్‌లో గ‌త కొన్ని నెల‌లుగా 18 ఏండ్లు పైబ‌డిన వారికి కొవాగ్జిన్ టీకా ఇస్తున్నారు. డబ్ల్యూహెచ్ఓకు చెందిన టెక్నిక‌ల్ అడ్వ‌యిజ‌రీ క‌మిటీ కొవాగ్జిన్‌కు అనుమతి ఇచ్చే విష‌య‌మై గ‌తంలోనే అక్టోబ‌ర్ 26న‌ స‌మావేశ‌మైంది.
ఆ స‌మావేశంలో టీకాకు సంబంధించి భార‌త్ బ‌యోటెక్ ఇచ్చిన స‌మాచారాన్ని ప‌రిశీలించి అదనపు సమాచారం కావాలని కోరింది. భార‌త్ బ‌యోటెక్ సంబంధిత సమాచారం అంద‌జేయ‌డంతో  మ‌రోసారి భేటీ అయ్యింది. టీకా త‌యారీదారు ఇచ్చిన స‌మాచారంతో సంతృప్తి చెంది ఆమోదం తెలిపింది.
టీఏజీ అనుమతిపై ప్రభుత్వ వర్గాలు స్పందిస్తూ దీనర్థం 18 ఏళ్లు, ఆపై బడిన వారికేనని, చిన్న పిల్లల వినియోగానికి కాదని పేర్కొన్నాయి. పిల్లలకు అనుమతి కోసం ఇంకా దరఖాస్తు చేసుకోలేదన్నారు. కొవాగ్జిన్ టీకా లక్షణాలు కలిగిన కొవిడ్-19పై 77.8 శాతం, డెల్టా వేరియంట్‌పై 65.2 శాతం రక్షణ కల్పిస్తున్నట్టు క్లినికల్ పరీక్షల్లో నిర్ధారణ అయింది. కొవాగ్జిన్ ప్రభావశీలతపై ఫేజ్-3 ట్రయల్స్‌పై చివరి విశ్లేషణ కూడా పూర్తయినట్టు భారత్ బయోటెక్ ఈ ఏడాది జూన్‌లోనే ప్రకటించింది.
ఇలా ఉండగా,   కొవాగ్జిన్‌  టీకా నిల్వ గడువును సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ పెంచింది. వాక్సిన్‌ తయారీ తేదీ నుంచి ఏడాది పాటు వినియోగించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని భారత్‌ బయోటెక్‌ కంపెనీ  ఒక ప్రకటనలో తెలిపింది. కంపెనీ వ్యాక్సిన్‌ వినియోగ గడువును 24 నెలలకు పొడగించాలని కోరుతూ డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాకు లేఖ రాసింది. ఈ మేరకు సంస్థ టీకాకు సంబంధించిన డేటాను డ్రగ్‌ రెగ్యులేటర్‌కు సమర్పించినట్లు పేర్కొంది.