పెట్రోల్ పై రూ 5, డీజిల్ పై రూ 10 ఎక్సైజ్ సుంకం తగ్గింపు

దీపావళి పండుగ సందర్భంగా దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ముఖ్యంగా పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు పెద్ద ఉపశమనం కల్గించింది.  పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఎక్సైజ్ సుంకంను భారీగా తగ్గించింది. 

లీటర్ పెట్రోల్ పై రూ.5 తగ్గించగా, లీటర్ డీజిల్ పై రూ 10 తగ్గిస్తున్నట్లు తెలిపింది. తగ్గిన ఎక్సైజ్ సుంకం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. కొంత కాలంగా భారీగా పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలతో తీవ్రంగా ఇబ్బంది పడిన వాహనదారులు  తాజాగా కేంద్రం తగ్గించిన ధరలతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్‌ ధర రూ.100 మార్కును ఎప్పుడో దాటేసింది. మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లో అయితే లీటర్‌ పెట్రోల్‌ రేటు రూ.120కి చేరింది.

ఈ తగ్గింపు వినియోగాన్ని పెంచుతుందని, ద్రవ్యోల్బణం తగ్గించేందుకు దోహదపడుతుందని,  తద్వారా పేద, మధ్యతరగతి వర్గాలకు సహాయపడుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగదారులకు మరింత ఉపశమనం కలిగించేందుకు పెట్రోల్, డీజిల్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్) తగ్గించాలని ప్రభుత్వం రాష్ట్రాలను కేంద్రం కోరింది. పెట్రో ఉత్పత్తులపై వ్యాట్‌ను తగు విధంగా తగ్గించడం ద్వారా ఈ ధరలకు కళ్లెం వేయవచ్చునని వివరించింది.

“డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు పెట్రోల్ కంటే రెట్టింపు అవుతుంది. భారతీయ రైతులు తమ కృషి ద్వారా, లాక్‌డౌన్ దశలో కూడా ఆర్థిక వృద్ధి వేగాన్ని కొనసాగించారు. రాబోయే రబీ సీజన్‌లో డీజిల్‌పై ఎక్సైజ్‌ను భారీగా తగ్గించడం రైతులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది” అని ఆ ప్రకటన పేర్కొంది.  వారు ట్రాక్టర్లు, మోటార్ల వినియోగానికి వాడే డీజిల్ తక్కువ ధరకు దక్కుతుందని తెలిపారు

ఇటీవలి నెలల్లో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో పెట్రోలు, డీజిల్ దేశీయ ధరలు ఇటీవలి వారాల్లో ద్రవ్యోల్బణ ఒత్తిడిని పెంచుతున్నాయి. దానితో ప్రజలకు ఉపశమనం కలిగించడం కోసం కేంద్రం ఈ నిర్ణయం తీసుకొంది. చాలా రోజులుగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్ ఉత్పత్తుల ధరలను మొదటి సారిగా కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గించడంతో ప్రజలకు కొంతమేరకు ఉపశమనం కలిగే అవకాశం ఏర్పడింది.

 అయితే, అదే సమయంలో దేశంలో ఇంధన కొరత లేకుండా చూసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేసిందని, పెట్రోల్, డీజిల్ వంటి వస్తువులు మన అవసరాలకు సరిపడా అందుబాటులో ఉన్నాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. “భారతదేశం ఆకాంక్షాత్మక జనాభా ఔత్సాహిక సామర్థ్యంతో నడిచే, కరోనా ప్రేరేపిత మందగమనం తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ గొప్ప మలుపు తిరిగింది. ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలు – అది తయారీ, సేవలు లేదా వ్యవసాయం – గణనీయమైన ఆర్థిక వృద్ధి కార్యకలాపాలను ప్రదర్శిస్తున్నాయి” అని పేర్కొంది. 

దేశంలో బుధవారం పలు పన్నులు సుంకాల భారంతో పెట్రో ఉత్పత్తుల ధరలు మరింత పెరిగాయి. ఢిల్లీలో లీటరు పెట్రోలు రూ 110 కి చేరింది. ఇక డీజిల్ ధర రూ 98.42 పైసలు దాటింది. ఇతర నగరాలలో కూడా ఇదే విధమైన ధరలుఉన్నాయి. గత ఏడాది పెట్రోలుపై ఎక్సైజ్ డ్యూటీని లీటరుకు భారీగా పెంచారు. అంతకు ముందు రూ 19.98 ఉండగా ఇది ఏకంగా రూ 32.9 పైసలుకు చేరింది.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం లీటర్‌ పెట్రోల్‌పై రూ.32.90, లీటర్‌ డీజిల్‌పై రూ. 31.80 చొప్పున ఎక్సైజ్‌ డ్యూటీ (సెస్‌లతో కలిపి) విధిస్తోంది. ఇందులో నుంచి పెట్రోల్‌పై ఐదు రూపాయలు, డీజిల్‌పై 10 రూపాయలు తగ్గించనుంది. దీని ప్రభావం మన రాష్ట్ర పన్నులపై కూడా పడనుంది. దీంతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌పై సుమారు రూ.6.81, డీజిల్‌పై రూ.12.73 తగ్గనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.114.47, డీజిల్‌ రూ.107.37 ధరలు ఉండగా, తగ్గిన సుంకంతో పెట్రోల్‌ రూ.107.66కు, డీజిల్‌ రూ.94.64కు తగ్గే అవకాశం ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రేటు రూ.110.04 నుంచి రూ.105.04కు, డీజిల్‌ రేటు రూ.98.42 నుంచి రూ.88.42కు తగ్గిపోనుంది.

ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకు జరిగిన పెట్రోల్, డీజిల్‌ వినియోగాన్ని పరిశీలిస్తే ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు వల్ల ప్రభుత్వ ఖజానాకు నెలకు రూ.8,700 కోట్ల మేర నష్టం వాటిల్లనుంది. అంటే సంవత్సరానికి రూ.లక్ష కోట్ల పైమాటేనని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఉన్న కాలానికి రూ.43,500 కోట్ల నష్టం వాటిల్లనుంది.