సీఎస్ ఉత్తర్వులు సమాచార హక్కు చట్టానికి వ్యతిరేకం

సమాచార అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టు స్టే విదించింది. ఆర్టీఐ కింద సమాచారం ఇచ్చేముందు శాఖాధిపతుల అనుమతి తీసుకోవాలని సీఎస్ సోమేశ్ కుమార్ గత నెలలో జీవో ఇచ్చారు. అయితే ఈ ఉత్తర్వులు సమాచార హక్కు చట్టానికి విరుద్దంగా ఉన్నాయంటూ ఎల్ఎల్‌బీ ఫైనలియర్ విద్యార్థిని దృతి చిత్రపు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

దీనిపై హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. అక్టోబర్ 13న సీఎస్ ఇచ్చిన ఉత్తర్వులు సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించేలా ఉన్నాయని, ఈ ఉత్తర్వుల కారణంగా దరఖాస్తుదారుడికి సమాచారం అందడంలో చాలా ఆలస్యం అవుతుందని పిటిషనర్ పేర్కొన్నారు. 

ఈ సందర్బంగా ప్రభుత్వం తరఫున అటార్నీ జనలర్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ ఆర్టీఐ చట్టంలోనే ఏ అధికారి సహాయం అయినా తీసుకునేలా నిబంధన ఉన్నదని తెలిపారు.  అయితే ఆయన వాదనను కోర్టు తోసిపుచ్చింది. చట్టంలో ఉన్నది దరఖాస్తుదారుడికి సరైన సమాచారం అందిచడంలో సాయం తీసకునే వీలు మాత్రమే అని గుర్తు చేసింది. 

కానీ, ఇక్కడ సీఎస్ ఇచ్చిన ఉత్తర్వుల్లో కింది స్థాయి అధికారులు సమాచారం ఇచ్చే ముందు శాఖాధిపతుల నుంచి అనుమతి తీసుకోవాలన్న నిబంధన విధించారని న్యాయస్థానం తెలిపింది. ఇది ఆర్టీఐ చట్టానికి వ్యతిరేకమన్న పిటిషనర్ వాదనతో ఏకీభవిస్తూ  సీఎస్ ఇచ్చిన ఉత్తర్వుల అమలుపై మధ్యంతర స్టే ఇచ్చింది. పూర్తి వివరాలతో రెండు వారాల్లో కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది.