పెట్రోల్ సుంకంతో భారీగా పెరిగిన కేంద్రం ఆదాయం 

పెట్రోల్ ఉత్పత్తుల ధరలు నిత్యం పెరుగుతూ వినియోగదారులు పెను భారం మోయవలసి వస్తుండగా, ఈ ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకం వసూళ్లు కేంద్ర ప్రభుత్వ ఖజనాకు భారీ ఆదాయాన్ని స‌మ‌కూరుస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఎక్సైజ్‌ సుంకం వసూళ్లు గణనీయంగా పెరిగాయి. 
 
గతేడాది మొదటి అర్ధ‌భాగంతో పోలిస్తే 33 శాతం, కరోనా ముందు నాటితో పోల్చితే 79 శాతం చొప్పున వృద్ధి న‌మోద‌యిన‌ట్టు అధికారిక గణాంకాలు స్పష్టం చేశాయి. ఆర్థికశాఖలోని కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌(సీజీఏ) గణాంకాల ప్రకారం.. ఏప్రిల్‌ – సెప్టెంబర్‌ 2021 మధ్యకాలంలో ఎక్సైజ్‌ సుంకం వసూళ్లు రూ.1.71 లక్షల కోట్లకు పెరిగాయి. 
గతేడాది ఇదే కాలంలో ఎక్సైజ్‌ డ్యూటీ సుంకం రూ.1.28 లక్షల కోట్లుగా మాత్రమే ఉన్నాయి. ఎక్సైజ్‌ సుంకం రేట్లను గణనీయంగా పెంచడం ఆదాయ వృద్ధికి దోహదపడింది. కాగా ఏప్రిల్‌ – సెప్టెంబర్‌ 2019లో ఎక్సైజ్‌ సుంకం ఆదాయం రూ.95,930 కోట్లతో 79 శాతం మేర పెరిగాయి. ఆర్థిక సంవత్సరం 2020-21లో ఎక్సైజ్‌ సుంకం ఆదాయం రూ.3.89 లక్షల కోట్లు, 2019-20లో రూ.2 .39 లక్షల కోట్లుగా ఉన్నాయని సీజీఏ డేటా పేర్కొంది.
2017లో జీఎస్టీని ప్రవేశపెట్టాక పెట్రోల్‌, డీజెల్‌, ఏటీఎ ఫ్‌, నేచురల్‌ గ్యాస్‌పై ఎక్సైజ్‌ సుంకమును విధించారు. ఈ ఉత్పత్తులు మినహా మిగతా ఉత్పత్తులన్నీ జీఎస్టీ పరిధిలోనే ఉన్నాయి. 2018-19లో ఎక్సైజ్‌ సుంకం ఆదాయం రూ.2.3 లక్షల కోట్లు కాగా అందులో రూ.35,874 కోట్లను రాష్ట్రాలకే బదిలీ చేసినట్టు సీజీఏ డేటా పేర్కొంది.
అంతక్రితం ఏడాది 2017-18లో రూ.2.58 లక్షల కోట్ల ఆదాయంలో రూ.71, 759 కోట్లను రాష్ట్రాలకు బదిలీ చేసినట్టు తెలిపింది. కాగా గతేడాది రిటైల్‌ ఇంధనంపై ఎక్సైటీ సుంకంను  కేంద్ర ప్రభుత్వం గణనీయంగా పెంచింది. పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకంను రూ.19.98 నుంచి రూ.32.9కి పెంచగా.. డీజెల్‌పై  రూ.31.80కి పెంచింది.
 కరోనా కారణంగా అంతర్జాతీ య మార్కెట్లో ముడి చమురు ధరలు పడిపోతున్న తరుణంలో ప్రయోజనం పొందేందుకు ఎక్సైజ్‌ సుంకం  రేట్లు పెంచింది. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముంది చమురు  ధర రికార్డ్‌ గరిష్ఠానికి పెరిగినా  ఎక్సైజ్‌  సుంకం రేట్లను ఏమాత్రం తగ్గించడం లేదు. దీంతో రిటైల్‌ ఇంధన ధరలు ఆకాశానికి చేరాయి.

భారీగా పెరిగిన జీఎస్‌టీ వసూళ్లు

 గత కొద్ది నెలలుగా జీఎస్‌టీ వసూళ్లు సహితం భారీగా పెరుగుతున్నాయి. గత నెల అక్టోబర్ జీఎస్‌టీ వసూళ్లు రూ.1,30,127 కోట్లుగా ఉంది. 2017 జులైలో జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇదే రెండవ అత్యధిక ఆదాయం కావడం విశేషం. ఈ ఏడాది అక్టోబర్ ఆదాయం గత ఏడాది అక్టోబర్ నెలతో పోలిస్తే 24 శాతం, అక్టోబర్ 2019-20తో పోలిస్తే 36 శాతం ఎక్కువ. 
 
ఈ ఏడాదిలో వరుసగా నాలుగో నెల జీఎస్‌టీ వసూళ్లు రూ.లక్ష కోట్లను అధిగమించాయి. ఈ జీఎస్‌టీ వసూళ్లలో కేంద్ర వాటా రూ.23,861 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.30,421 కోట్లు, సమ్మిళిత జీఎస్‌టీ వాటా రూ.67,361 కోట్లు(వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.32,998 కోట్లతో సహా), సెస్ రూపంలో వచ్చిన ఆదాయం రూ.8,484 కోట్లు (వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.699 కోట్లతో సహా). 
 
ఈ సమ్మిళిత జీఎస్‌టీ వాటా నుంచి సీజీఎస్ఆర్ కు రూ.27,310 కోట్లు, రాష్ట్రాలతో రూ.22,394 కోట్లు పంచుకొనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం వాటా పంచుకున్న తర్వాత కేంద్రం వాటా రూ.51,171 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.52,815 కోట్లుగా ఉంది. దిగుమతుల నుంచి వచ్చిన ఆదాయం గత ఏడాది కంటే 39 శాతం ఎక్కువగా ఉన్నాయి. చిప్ కొరత వల్ల కార్లు, ఇతర ఉత్పత్తుల అమ్మకాలు ప్రభావితం కాకపోతే ఇంకా ఆదాయం ఎక్కువగా వచ్చి ఉండేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.