పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్ లో మరో భారీ కుంభకోణం

అల్లుడు నీరవ్‌ మోదీ, మేనమామ మోహుల్‌ చోక్సీలు పాల్పడిన రూ 14,000 కుటంబకోణం ఇంకా ఒక కొలిక్కి రాకముందే  పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్ లో దానిని తలదన్నే మరో భారీ కుంభకోణంను సిబిఐ వెలుగులోకి తెచ్చింది. బైక్‌ బాట్‌ పేరుతో రూ.15 వేల కోట్లు కుంభకోణం జరిగినట్లు వెల్లడైనది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బైక్ బాట్ సంస్థ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ భాటి, మరో 14 మందితో కలిసి దేశవ్యాప్తంగా రూ.15,000 కోట్ల మేర పెట్టుబడిదారులను మోసం చేశారని సిబిఐ తన ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ పేర్కొన్నది.

ప్రధాన నిందితుడైన సంజయ్‌ భాటి.. బైక్ బాట్ పేరుతో బైక్ టాక్సీ సర్వీసులను ప్రారంభించాడు. దీని ముసుగులో లాభదాయకమైన ఆర్థిక పథకాలను రూపొందించాడు. తమ బైక్‌ టాక్సీ సర్వీసుల్లో బైక్‌ బాట్‌ వాహనాన్ని ఎవరైనా కొనుగోలుదారుడు తమ వద్ద ఉన్న డబ్బుతో ఒకటి, మూడు, ఐదు లేదా ఏడు బైక్‌లలో నిధులు పెట్టవచ్చు. ఈ బైక్‌లను తమ కార్పొరేట్‌ కార్యాలయమే నడుపుతుందని నమ్మించారు.

ఆ విధంగా బైక్‌ బాట్‌లపై పెట్టుబడులు పెట్టేలా పెట్టుబడిదారులను తమవైపునకు తిప్పుకున్నారు. ఇలా పెట్టుబడి పెట్టినవారికి నెలవారీ అద్దె, ఈఎంఐతో పాటు ఎక్కువ బైక్‌లపై పెట్టుబడి పెడితే బోనస్‌ కూడా ఇస్తామంటూ ఆకస్తికరమైన ప్రోత్సాహకాలతో ఆకట్టుకున్నారు. వివిధ నగరాల్లో కంపెనీ ఫ్రాంచైజీలను కేటాయించింది. ఈ ఫ్రాంచైజీల సాయంతో దేశం మొత్తం మీద పెద్ద సంఖ్యలో పెట్టుబడిదారులను ఆకర్శించింది.

కేవలం రూ.62,200 పెట్టుబడి పెట్టి అద్దె పొందవచ్చునని, ఏడాదిలోగా బైక్‌ ఓనర్‌గా మారొచ్చునని నమ్మించింది. ఇలా రూ.62,200 పెట్టుబడి పెట్టిన వారికి 12 నెలలపాటు నెలకు రూ.9,765 చొప్పున అందిస్తామని ఊరించింది. తక్కువ టైంలో దాదాపు రెట్టింపు నగదు వస్తుందన్న ఆశతో దాదాపు 2 లక్షల మందికి పైగా వీరి వద్ద పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చారు.

2017 లో ఈ పథకాలను ప్రారంభించిన ఈ సంస్థ.. 2019 జనవరి వరకు పెట్టుబడిదారుల నుంచి డబ్బు వసూలు చేయడం, తిరిగి చెల్లించడం వంటి ఠంచన్‌గా కొనసాగించింది. అయితే, కొన్నాళ్ల తర్వాత నెలలు గడుస్తున్నా అద్దెతో పాటు ఈఎంఐ చెల్లింపులు, బోనస్‌లు రాకపోవడంతో పెట్టుబడిదారుల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఇలా పెద్ద సంఖ్యలో డబ్బు తమ ఖాతాల్లో జమ అయిన తర్వాత, బైక్‌ బాట్‌ సర్వీసులు నడవడం లేదంటూ సంస్థ చేతులెత్తేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఈ సంస్థలో పెట్టుబడి పెట్టిన వారు మోసపోయినట్లు సీబీఐ గుర్తించింది.

ప్రౌడ్‌ ప్రోగ్రెసివ్ ప్రమోటర్స్‌ రిస్ట్రిక్టెడ్‌ సంస్థతోపాటు దాని యజమాని సంజయ్‌ భాటి, ప్రమోటర్లపై ఇప్పటికే గౌతమ్‌ బుద్ధ నగర్‌లోని దాద్రీ పోలీస్‌ స్టేషన్‌లో పలు కేసులు నమోదయ్యాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కూడా మనీలాండరింగ్‌పై తమ విచారణను ప్రారంభించింది. ఈ కేసులో ఉన్న సంస్థ పేరుతో రూ.216 కోట్ల ఆస్తులు ఉన్నట్లు విచారణ సంస్థలు లెక్కగట్టాయి.