ఎగుమతులతో 42.33 శాతం వృద్ధి

గత కొన్ని నెలలుగా నిరాశాజనక పనితీరు కనబరిచిన ఎగుమతులు మళ్లీ ట్రాక్‌లో పడ్డాయి. ఇంజినీరింగ్‌, పెట్రోలియం రంగాలు అంచనాలకుమించి రాణించడంతో అక్టోబర్‌ నెలలో 42.33 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. దీంతో 35.47 బిలియన్‌ డాలర్ల విలువైన ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి అయ్యాయి. 

ఏడాది క్రితం ఇదే నెలలో 24.92 బిలియన్‌ డాలర్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి అవగా, 2019 అక్టోబర్‌లో 26.32 బిలియన్‌ డాలర్లుగా ఉన్నది. ఇదే నెలలో దిగుమతులు 62.49 శాతం ఎగబాకి 55.37 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. ఏడాది క్రితం ఇదే నెలలో 34.07 బిలియన్‌ డాలర్లుగా ఉన్నది. 

కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం వాణిజ్యలోటు(ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం) 19.9 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. 2020 అక్టోబర్‌లో నమోదైన 5.1 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే ఇంచుమించు మూడు రెట్లు పెరిగింది. మరోవైపు ఏప్రిల్‌-అక్టోబర్‌ మధ్యకాలంలో వాణిజ్యలోటు 98.71 బిలియన్‌ డాలర్లుగా ఉన్నది. 

మొత్తం ఎగుమతుల్లో టెక్స్‌టైల్‌ రంగం వాటా 3.5 శాతంగా ఉన్నది. 1.34 బిలియన్‌ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఎగుమతి అయ్యాయి. పెట్రోలియం, క్రూడాయిల్‌ ఉత్పత్తుల దిగుమతి 140 శాతం ఎగబాకి 14.43 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నది. 5.1 బిలియన్‌ డాలర్ల విలువైన పసిడి దిగుమతి అయింది. 1.62 బిలియన్‌ డాలర్ల వంటనూనె దిగుమతి కాగా, గతేడాదితో పోలిస్తే ఇది 60 శాతం అధికం.