న‌ష్టాలు రాని ప‌రిశ్ర‌మ వైసీపీ రాజ‌కీయ ప‌రిశ్ర‌మే

న‌ష్టాలు రాని ప‌రిశ్ర‌మ ఏదైనా ఉందంటే అది వైఎస్సార్సీపీ రాజ‌కీయ ప‌రిశ్ర‌మ మాత్రమే అంటూ జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ ఎద్దేవా చేశారు. విశాఖ స్టీల్ ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా విశాఖ‌లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న మాట్లాడ‌తూ అన్ని ప‌రిశ్ర‌మ‌ల‌కు ఉన్న‌ట్లే విశాఖ స్టీల్‌కు కూడా న‌ష్టాలు ఉన్నాయ‌ని, వ‌స్తాయ‌ని చెప్పారు. సొంత గ‌నులు కేటాయిస్తే విశాఖ స్టీల్‌కు న‌ష్టాలు త‌గ్గుతాయ‌ని తెలిపారు.

ఉక్కు ఫ్యాక్టరీని ప్రభుత్వరంగంలోనే కొనసాగించేలా రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. అన్ని పార్టీలను కలుపుకొని వెళ్లేలా వారం రోజుల్లో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. 

వైసీపీ స్పందించని పక్షంలో జనసేన ఆధ్వర్యంలోనే ఉద్యమాన్ని నడిపిస్తామని, అన్ని జిల్లాలకు విస్తరిస్తామని వెల్లడించారు. ఎన్నికలు వచ్చే వరకు వైసీపీకి గడ్డుకాలం తప్పదని హెచ్చరించారు. విశాఖ ఉక్కుకు సొంత గ‌నులు కేటాయించాల‌ని ఎంపీలు కేంద్రాన్ని ఎందుకు అడ‌గ‌ర‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ నిల‌దీశారు.  

విశాఖ ఉక్కుకు సొంత గనులు లేవని రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్ల‌మెంట్‌కు వెళ్లేది క‌బుర్లు చెప్పుకోవ‌డానికా, కాఫీలు తాగ‌డానికా అని ధ్వజమెత్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు క్యాప్టివ్ మైన్స్ కావాల‌ని 25 మంది ఎంపీలు ఎందుకు కేంద్రాన్ని అడ‌గ‌లేక‌పోయార‌ని అడిగారు. త‌న‌కు ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే బ‌లం కూడా లేదు, గెలిచిన ఒక్క ఎమ్మెల్యేనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ప‌ట్టుకుపోయారని మండిపడ్డారు.

‘‘చట్టసభల్లో మాట్లాడాల్సిన నేతలు మౌనంగా ఉంటే ఏం లాభం. వైసీపీ మాటలకు అర్థాలు వేరులే. చెప్పిన మాటకు తూట్లు పొడవటమే వైసీపీ అధినేత సంకల్పం. వైసీపీ మాటలన్నీ ఆచరణలోకి రాని మాటలు. జై తెలంగాణ అంటేనే తెలంగాణ వచ్చింది. ఆంధ్రా వాళ్లకి ఏదీ మనది అనిపించదా?. స్టీల్‌ ప్లాంట్‌ కోసం పోరాడుతామని వైసీపీ ప్రభుత్వం ప్రకటించాలి.’’ అని పవన్‌కల్యాణ్‌ డిమాండ్ చేశారు.

వైసీపీ వాళ్ల మాటలకు అర్థాలు వేరని చెబుతూ  సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి అందరికీ అందుబాటులో మద్యం దుకాణాలు పెట్టారని, రైతుభరోసా కింద ఏటా రూ.12,500 ఇస్తామని చెప్పి, కేంద్రం ఇచ్చిన రూ.6 వేలు కూడా అందులో కలిపేశారని, విద్యార్థులకు ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పి, తీరా అడిగితే కొడతామంటున్నారని పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. 

ఆరోగ్యశ్రీలో అన్నింటికి చికిత్స చేస్తామని చెప్పి.. కరోనా వచ్చిందంటే… బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లుకోమంటున్నారని… ఇలా వారి మాటలకు వేర్వేరు అర్థాలు ఉండడం వల్ల స్టీల్‌ప్లాంటు విషయంలో వైసీపీ చెప్పిన మాటలను జనసేన సహా ప్రజలు కూడా నమ్మడం లేదని స్పష్టం చేశారు. 

 విశాఖ స్టీల్ ప్రైవేటీక‌రించొద్ద‌ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను క‌లిసి తాను విజ్ఞ‌ప్తి చేశామ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ గుర్తు చేశారు. త‌న‌కు ఎమ్మెల్యేలు, ఎంపీల బ‌లం ఉంద‌ని అమిత్‌షా అపాయింట్‌మెంట్ ఇవ్వ‌లేద‌ని, ప్ర‌జా బ‌లం ఉన్నందునే అపాయింట్‌మెంట్ ల‌భించింద‌ని చెప్పారు.

ఉక్కు సంక‌ల్పంతో విశాఖ స్టీల్‌ను కాపాడుకోవాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ పిలుపునిచ్చారు. అందుకోసం అన్ని రాజ‌కీయ పార్టీలు క‌లిసి రావాల‌ని కోరారు. కేంద్రానికి మ‌న క‌ష్టాలు ఎవ‌రు చెబుతారు.. మ‌న నాయ‌కులే కేంద్రానికి మ‌న క‌ష్టాలు చెప్పుకోవాల‌ని పేర్కొన్నారు.  దేశ ప్రగతికి ఉక్కు కర్మాగారాలు చాలా ముఖ్యమని. ఉక్కు కర్మాగారాలు లేకపోతే ఆ దేశం ముందుకు వెళ్లదని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు కార్మికుల ప‌క్షాన తాను పోరాటం చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు.