మత మార్పిడిలకు అడ్డుకట్ట … మతం మారితే బహిర్గత  పరచాలి 

మతమార్పిడులకు అడ్డుకట్ట పడాల్సిన అవసరం ఉందని, ఎవరైతే తమ విశ్వాసాలను మార్చుకున్నారో వారు దాన్ని బహిర్గతపర్చాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) స్పష్టం చేసింది. కర్ణాటకలోని ధార్వాడ్ లో ముగిసిన మూడు రోజుల అఖిల భారత కార్యకారీ మండల్‌ (ఏబీకేఎం) సమావేశాల సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే మీడియా సమావేశంలో ప్రసంగిస్తూ ప్రభుత్వం మతమార్పిడులకు వ్యతిరేకంగా బిల్లును తెస్తే తాము మద్దతిస్తామని ప్రకటించారు.

మతమార్పిడులకు వ్యతిరేకంగా చట్టం రావాలని సంఘ్‌ డిమాండ్‌ చేస్తుందని చెబుతూ ఎందుకు దీన్ని మైనారిటీలు వ్యతిరేకిస్తున్నారనేది బహిరంగ రహస్యమేనని తెలిపారు.  మతమార్పిడులు తాను మాత్రమే కాదని, మహాత్మా గాంధీ కూడా వ్యతిరేకించారని ఆయన చెప్పారు.

కర్నాటకలో మతమార్పిడి నిరోధక బిల్లు కోసం బిజెపి ముందుకు రావడంపై అడిగిన ప్రశ్నకు హోసబాలే మాట్లాడుతూ, “ఏ పద్ధతిలోనైనా సంఖ్యను పెంచడాన్ని అంగీకరించలేము. దేశంలో అనేక తీర్మానాలు ఆమోదించారు. మరి అనేక రాష్ట్రాలు మత మార్పిడి నిరోధక బిల్లును ఆమోదించాయి” అని వివరించారు.  ఇదివరలో అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం తమ అనుభవాల మేరకు అవసరమని భవించి మతమార్పిడి నిరోధక బిల్లును ఆమోదించినదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

“వ్యక్తిగత ఇష్టానుసారం మతాన్ని మార్చుకునే స్వేచ్ఛ ఉంది. కానీ నేడు జరుగుతున్నది అది కాదు… మతం మారిన వ్యక్తులు ఉన్నారు. దానిని బహిర్గతం చేయకుండా, రెట్టింపు ప్రయోజనాలను తీసుకుంటున్నారు. ప్రలోభాలు, వత్తిడులు, మోసంతో మతమార్పిడులు జరగరాదని మాత్రమే కోరుతున్నాము.  మత మార్పిడిని ఆపాలని ఆర్‌ఎస్‌ఎస్ ఎప్పటినుంచో చెబుతోందని, దానికి వ్యతిరేకంగా బిల్లు ఆమోదం పొందితే మేము దానిని స్వాగతిస్తాం” అని ఆయన తెలిపారు. 

పొప్ తో మోదీ భేటీ భారత్ ప్రతిష్టను పెంచింది 

వాటికన్‌లో క్యాథలిక్ చర్చి అధినేత పోప్ ఫ్రాన్సిస్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ దేశ ప్రతిష్టను మాత్రమే పెంచిందని ఆయన త్లెఇపారు. “ప్రభుత్వ అధినేత ప్రపంచంలోని పౌర వ్యవస్థలో ఎవరినైనా కలిస్తే తప్పేంటి? మేము దానిని స్వాగతిస్తున్నాము ఎందుకంటే మేము వసుధైవ కుటుంబాన్ని (ప్రపంచం ఒకే కుటుంబం) నమ్ముతాము. మేము అన్ని మతాలను గౌరవిస్తాం” హోసబాలే తెలిపారు.

తాము వివిధ మతాల నాయకులను కూడా కలుస్తామని చెబుతూ  మన దేశ ప్రధాని ప్రపంచంలోని ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుని, దేశ స్థాయిని పెంచినప్పుడు, అది సంతోషించాల్సిన విషయమని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం సరైన సమయంలో యూనిఫాం సివిల్ కోడ్‌ను ప్రవేశపెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  “ఇది ఎప్పుడు అమలు చేయాలనే దానిపై రాజకీయ నిర్ణయం వారు (ప్రభుత్వం) తీసుకోవాలి” అని ఆయన చెప్పారు.

జాతీయ జనాభా విధానాన్ని సంఘ్ కొంతకాలంగా కోరుకుంటోందని, ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ ఇటీవలే పునరుద్ఘాటించారని ఆయన పేర్కొన్నారు. “జనాభా విధానం ఉండాలి…అందుబాటులో ఉన్న సహజ వనరుల ఆధారంగా ఈ దేశంలో ఎంత మందిని నిర్వహించగలరో శాస్త్రీయంగా అంచనా వేయాలి” అని ఆయన సూచించారు. 

స్వాతంత్య్ర అమృతోత్సవాలు 

భారతదేశం స్వాతంత్య్రం పొందిన 75వ సంవత్సరం అమృత్ మహోస్తావ్‌ను దేశం జరుపుకుంటుంది. ఈ సందర్భంగా సంఘ్ స్వయంసేవకులు వివిధ సంస్థలు, సమాజ సహకారంతో స్వతంత్రంగా రాణి అబ్బక్క, వేలు నాచ్చియార్, రాణి గైడిన్లియు వంటి అజ్ఞాత స్వాతంత్య్ర సమరయోధులను సంబరాలు జరిపి, వారి కృషిని తెలియచెప్పే కార్యక్రమాలు నిర్వహిస్తారని  హోసబాలే తెలిపారు.

భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమం సుదీర్ఘకాలం కొనసాగిందని, ప్రపంచంలోనే ప్రత్యేకత ఉందని ఆయన చెప్పారు. ఉద్యమంలో దేశ సమైక్యత వెల్లివిరిసింది. ఈ ఉద్యమం బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా మాత్రమే కాదు, భారతదేశ స్వయం సమృద్ధి  కోసం జరిగిన ఉద్యమం. అందుకే స్వదేశీ ఉద్యమం స్వాతంత్య్ర ఉద్యమంతో పాటు స్వభాష, స్వ-సంస్కృతి మొదలైన వాటితో ముడిపడి ఉందని ఆయన గుర్తు చేశారు. 

స్వామి వివేకానందతో సహా అనేక మంది వ్యక్తులు భారతదేశ ఆత్మను మేల్కొల్పడానికి కృషి చేశారని చెబుతూ కాబట్టి 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ప్రపంచంలోని ప్రతి రంగంలో భారత్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుతామని నేటి తరం  ప్రతిజ్ఞ తీసుకోవాలని ఆయన పిలుపిచ్చారు. 

జనాభా విధానంపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా, ప్రతి దేశానికి జనాభా విధానం ఉండాలని, అది సమాజంలోని అన్ని వర్గాలకు సమానంగా వర్తింపజేయాలని అన్నారు. సహజ వనరుల లభ్యతను దృష్టిలో ఉంచుకుని జనాభా విధానాన్ని రూపొందించాలి. ఈ విషయంపై సంఘ్ గతంలో చేసిన తీర్మానం ఆధారంగా సర్సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ జీ ఇప్పుడే మళ్లీ గుర్తు చేశారు.