పోప్ ఫ్రాన్సిస్‌ను భార‌త్‌కు ఆహ్వానించిన ప్ర‌ధాని మోదీ

పోప్ ఫ్రాన్సిస్‌ను ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ భార‌త్‌కు ఆహ్వానించారు. జీ-20 స‌ద‌స్సులో పాల్గొనేందుకు ఇట‌లీకి వెళ్లిన ప్ర‌ధాని మోదీ.. ఇవాళ వాటిక‌న్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్‌తో భేటీ అయ్యారు. దాదాపు 30 నిమిషాల‌పాటు పోప్ ఫ్రాన్సిస్‌, ప్ర‌ధాని మోదీ వివిధ విష‌యాల‌పై మాట్లాడుకున్నారు.

అనంత‌రం భార‌త్‌కు రావాల్సిందిగా పోప్‌కు ప్ర‌ధాని ఆహ్వానం తెలిపారు. త‌న‌కు పోప్ ఫ్రాన్సిస్‌తో ప‌లు అంశాల‌పై మాట్లాడే అవ‌కాశం ద‌క్కింద‌ని, ఆయ‌న‌ను తాను భార‌త్‌కు ఆహ్వానించాన‌ని భేటీ ముగిసిన అనంత‌రం ప్ర‌ధాని మోదీ ట్వీట్ చేశారు.

కాగా, పోప్ ఫ్రాన్సిస్‌కు భార‌త్‌లోని క్రైస్త‌వ సంఘాల నుంచి చాలా రోజులుగా ఆహ్వానం ఉన్న‌ది. దాంతో ఆయ‌న కూడా భార‌త్‌కు వెళ్లాల‌నుకుంటున్న‌ట్లు స‌మాచారం. అయితే భార‌త్‌లోని క్రైస్త‌వ సంఘాల నుంచి ఆహ్వానం ఉన్నా.. ప్ర‌భుత్వం నుంచి ఆహ్వానం లేదు. దాంతో ఆయ‌న భార‌త్‌లో ప‌ర్య‌టించ‌లేక‌పోయారు. 

ఇప్పుడు ప్ర‌భుత్వం నుంచి కూడా ఆహ్వానం అంద‌డంతో త్వ‌ర‌లోనే పోప్ ఫ్రాన్సిస్ భార‌త్‌కు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ది. కాగా, 1999లో చివ‌రిసారి పోప్ జాన్ పాల్ భార‌త్‌లో ప‌ర్య‌టించారు. ఆ త‌ర్వాత ఇప్పుడు పోప్ ఫ్రాన్సిస్‌కు భార‌త్‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

వాటికన్ వెళ్లి పొప్ ను కలసిన భారతీయ ప్రధానులలో మోదీ ఐదవవారు.  ఆయనకున్న ముందు జవహర్ లాల్ నెహ్రు, ఇందిరా గాంధీ, ఐ కె గుజ్రాల్, అటల్ బిహారి వాజపేయి కలిశారు. భారత దేశంలో క్రైస్తవులు మూడో అతిపెద్ద మతస్థులు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో హిందువులు 79.8 శాతం  ఉండగా, ముస్లింలు 14.2 శాతం, క్రైస్తవులు 2.3 శాతం ఉన్నారు.

వాటిక‌న్ సిటీకి వెళ్లిన ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీతోపాటు విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్,  జాతీయ భ‌ద్ర‌తాస‌ల‌హాదారు అజిత్ ధోవ‌ల్ కూడా ఉన్నారు. వాటిక‌న్ సిటీ నుంచి రోమ్‌కు వ‌చ్చిన త‌ర్వాత జీ-20 స‌ద‌స్సులో ప్ర‌ధాని పాల్గొన‌నున్నారు. అనంత‌రం రేపు స్కాట్లాండ్‌లోని గ్లాస్గో న‌గ‌రంలో ప్రారంభ‌మ‌య్యే కాప్‌-26 స‌ద‌స్సుకు హాజ‌రుకానున్నారు. కాప్-26 స‌ద‌స్సు వ‌చ్చే నెల 12 తారీఖున ముగియ‌నుంది.