150 దేశాల్లోని ఇస్కాన్ కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడికి వ్యతిరేకంగా ఢాకాలో  ‘ఇస్కాన్‌’ నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోదీతోపాటు ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని ఇస్కాన్‌ కోరింది. బంగ్లాదేశ్‌లో దాడులకు నిరసనగా దాదాపు 150 దేశాల్లోని ఇస్కాన్ కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, ప్రార్థన సమావేశాలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. కోల్‌కతాతో పాటు అనేక ఇతర ప్రదేశాల్లో నిరసనలు చేపట్టారు. కోల్‌కతాలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ కార్యాలయం వద్ద కూడా ఇస్కాన్ సభ్యులు నిరసన తెలిపారు. 

ఇటీవల బంగ్లాదేశ్‌లోని ఇస్కాన్ దేవాలయంపై జరిగిన దాడిలో ఒకరు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల పట్ల కోల్‌కతాలోని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) వైస్ ప్రెసిడెంట్ రాధారామన్ దాస్ విచారం వ్యక్తం చేశారు.

బంగ్లాదేశ్ నుంచి వస్తున్న సమాచారంతో ఎంతో బాధకు గురయ్యామని చెప్పారు. ఇస్కాన్‌ ఎల్లప్పుడూ నోఖాలి (బంగ్లాదేశ్‌లో ఓ వర్గం) ప్రజలకు అనుకూలంగానే ఉన్నదని తెలిపారు. న్యూయార్క్, మాస్కో, రష్యా, ఆస్ట్రేలియా, కెనడాలోని పలు ప్రాంతాల్లో నిరసనలు చెపట్టినట్లు తెలిపారు.

ఈ నెల 13 నుంచి నాలుగు రోజుల పాటు కొనసాగిన దాడుల్లో దుర్గా మంటపాలు ధ్వంసమవగా, హిందువులకు చెందిన దాదాపు 66 ఇండ్లపై దాడులు జరిపినట్లు సమాచారం. ఇలాఉండగా, బంగ్లాదేశ్‌లో హింస మొదలవడానికి ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఇక్బాల్ హుస్సేన్‌ను కాక్స్ బజార్‌లో గురువారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొమిల్లాలోని దుర్గాపూజ పండల్‌లో ఖురాన్ కాపీ ఉంచినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

కీలక నిందితుని అరెస్ట్ 
 ఇలా ఉండగా, దుర్గా పూజల సమయంలో హిందువులపై జరిగిన హింసాకాండలో రెండో కీలక నిందితుడు సైకత్ మండల్‌ను అరెస్టు చేసినట్లు బంగ్లాదేశ్ పోలీసులు శనివారం తెలిపారు. అక్టోబరు 17న రంగ్‌పూర్ జిల్లాలోని, పీర్‌గంజ్ సబ్ డిస్ట్రిక్ట్‌లో జరిగిన దాడుల సూత్రధారుల్లో సైకత్ ఒకడని, అతనితోపాటు అతని సహచరుడిని కూడా ఢాకా శివారులోని గాజీపూర్‌లో అరెస్టు చేశామని చెప్పారు.

బంగ్లాదేశ్‌లో నేర నిరోధక విభాగమైన ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ (ఆర్ఏబీ) అధికారులు శనివారం తెలిపిన వివరాల ప్రకారం, పీర్‌గంజ్‌లో అక్టోబరు 17న జరిగిన హింసాకాండ సూత్రధారుల్లో ఒకడైన సైకత్ మండల్‌ను, అతని సహచరుడిని శనివారం ఉదయం గాజీపూర్‌లో అరెస్టు చేశారు. సైకత్ ఫేస్‌బుక్ పోస్ట్ కారణంగా  ప్రజలు హింసాకాండకు పాల్పడ్డారు. హిందువులకు చెందిన దాదాపు 70 ఇళ్ళు, దుకాణాలను తగులబెట్టారు. 

కుమిల్లాలోని దుర్గా పూజ మండపంలో ఖురాన్‌ను పెట్టిన ఇక్బాల్ హుస్సేన్‌ను శుక్రవారం బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ హింసాకాండలో కీలక నిందితుడు ఇతనే. ఇతనిని కాక్స్ బజార్ ప్రాంతంలో అరెస్టు చేశారు. ఇతనిని ఏడు రోజుల పోలీసు రిమాండ్‌కు తరలించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో దుర్గా పూజల సమయంలో హిందువులపై హింసాకాండకు పాల్పడినవారిలో దాదాపు 600 మందిని పోలీసులు అరెస్టు చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా రెచ్చగొట్టిన మహమ్మద్ ఫయాజ్‌ను శుక్రవారం జైలుకు తరలించారు. 

ఇదిలావుండగా బంగ్లాదేశ్ హిందూ, బుద్ధిస్ట్, క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ ఢాకాలోని షాబాగ్ ప్రాంతంలోనూ, దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ సామూహిక నిరాహార దీక్షలు, ధర్నాలు నిర్వహిస్తోంది.  హిందువులపై దాడులను ఐక్యరాజ్య సమితి ఖండించింది.