అభివృద్ధికి నూతన నమూనా గోవా

అభివృద్ధికి నూతన నమూనా గోవా అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ నేతృత్వంలో రాష్ట్రం చాలా చురుగ్గా కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేస్తోందని ప్రశంశించారు. స్వయం సమృద్ధ భారత్‌కు అవసరమైనవన్నీ గోవాకు ఉన్నాయని పేర్కొన్నారు. 

ఆత్మనిర్భర్ భారత్ స్వయంపూర్ణ గోవా లబ్ధిదారులతో వర్చువల్ సమావేశంలో శనివారం మోదీ మాట్లాడుతూ ఆత్మనిర్భర్ భారత్ స్వయంపూర్ణ గోవా పథకం గురించి వివరించారు. స్వయం సమృద్ధ భారత్‌కు అవసరమైనవన్నీ గోవాకు ఉన్నాయని చెబుతూ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉండటం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు.

కేంద్రంలోనూ, గోవాలోనూ బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలు ఉన్న విషయాన్ని పరోక్షంగా గుర్తు చేశారు. స్వయంపూర్ణ పథకానికి ఉండే అతి పెద్ద బలాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఒకటని చెప్పారు. ముఖ్యంగా చేపల ప్రాసెసింగ్ రంగంలో గోవా దేశానికి ప్రధాన కేంద్రంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు.

భారత దేశ చేపలను తూర్పు ఆసియా దేశాల్లో ప్రాసెస్ చేసిన తర్వాత అంతర్జాతీయ మార్కెట్లకు పంపుతారన్నారు. దీనిని మార్చడం కోసం తొలిసారి మత్స్య పరిశ్రమ రంగానికి భారీ స్థాయిలో సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని, దీనివల్ల రైతులు, పాడి రైతులు, మత్స్యకారులు అధిక ఆదాయాన్ని పొందవచ్చునని తెలిపారు.

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి గత ప్రభుత్వాలు చేసిన ఖర్చుతో పోల్చుకుంటే ఐదు రెట్లు పెంచినట్లు చెప్పారు. స్వయంపూర్ణ పథకం 2020 అక్టోబరు 1న ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారి స్వయంపూర్ణ మిత్రగా వ్యవహరిస్తూ పంచాయతీలు, మునిసిపాలిటీల్లో పర్యటిస్తారు. వివిధ ప్రభుత్వ పథకాల గురించి అర్హులకు తెలియజేసి, తద్వారా వారు ప్రయోజనం పొందే విధంగా ప్రోత్సహిస్తారు.