వెంకయ్య పర్యటనపై చైనా అభ్యంతరం…మండిపడిన భారత్ 

భార‌త ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ప‌ర్య‌ట‌న‌పై బుధ‌వారం చైనా అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. తాము భార‌త్‌లో అంత‌ర్భాగంగా భావించ‌ని అరుణాచ‌ల్‌లో ఉప రాష్ట్ర‌ప‌తిని తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న‌ట్లు తెలిపింది. చైనా చర్యపై భారత్ మండిపడింది. 

ఈ నెల 9న వెంక‌య్య‌నాయుడు ఆ రాష్ట్రంలో ప‌ర్య‌టించి, అసెంబ్లీ ప్ర‌త్యేక స‌మావేశంలో ప్ర‌సంగించారు. కొన్ని ద‌శాబ్దాలుగా నిర్ల‌క్ష్యం చేసిన ఈశాన్య భార‌తంలో ఇప్పుడు అభివృద్ధి ప‌రుగులు పెడుతోంద‌ని ఈ సంద‌ర్భంగా వెంక‌య్య కొనియాడారు. అయితే అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో భార‌త నేత‌ల ప‌ర్య‌ట‌న‌ల‌ను వ్య‌తిరేకించ‌డం చైనాకు అల‌వాటుగా మారింది. భారత్ మాత్రం అరుణాచ‌ల్ త‌మ దేశంలో అంత‌ర్భాగ‌మ‌ని, మిగ‌తా ప్రాంతాల్లో ప‌ర్య‌టించిన‌ట్లే ఆ రాష్ట్రంలోనే నేత‌లు ప‌ర్య‌టిస్తార‌ని స్ప‌ష్టం చేసింది.

తాజాగా వెంక‌య్య నాయుడు ప‌ర్య‌ట‌న‌పై స్పందించాల్సిందిగా విదేశాంగ శాఖ అధికార ప్ర‌తినిధి ఝావో లిజియాన్‌ను అక్క‌డి అధికార మీడియా ప్ర‌శ్నించింది. దీనికి ఆయ‌న స్పందిస్తూ.. స‌రిహ‌ద్దు అంశంలో చైనా స్థిర‌మైన‌, స్ప‌ష్ట‌మైన అభిప్రాయంతో ఉంది. 

చైనా ప్ర‌భుత్వం ఎప్పుడూ అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌ను భార‌త్‌లో రాష్ట్రంగా గుర్తించ‌లేదని పేర్కొన్నారు. భారత్ నే అక్ర‌మంగా, ఏక‌ప‌క్షంగా అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌ను రాష్ట్రంగా గుర్తించిందని పేర్కొంటూ ఆ ప్రాంతంలో భార‌త నేత ప‌ర్య‌ట‌న‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నామని తెలిపారు. 

భార‌తీయ నేత‌లు ఈ భూభాగంలో ప‌ర్య‌టించ‌డం ద్వైపాక్షిక ఒప్పందాల ఉల్లంఘ‌ణ కింద‌కు వ‌స్తుంద‌ని పేర్కొంటూ భార‌త విదేశాంగ మంత్రిత్వ శాఖ‌కు స‌మాచారాన్ని పంపించింది. ఇలాంటి ప‌ర్య‌ట‌న‌లు భ‌విష్య‌త్‌లో చేస్తే ఊరుకోబోమ‌ని హెచ్చ‌రించిన‌ట్లు స‌మాచారం.

చైనా తీరుపై భార‌త ప్ర‌భుత్వం మండిప‌డింది. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ముమ్మాటికీ భార‌త్‌లో అంత‌ర్భాగ‌మేన‌ని స్ప‌ష్టం చేసింది. భార‌త్‌కు చెందిన ప్ర‌ముఖులు ఎప్పుడైనా స‌రే అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో ప‌ర్య‌టిస్తార‌ని తేల్చి చెప్పింది. ఈ మేర‌కు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్ర‌తినిధి అరింద‌మ్ బాగ్చీ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 

భారత్‌లోని ఇతర రాష్ట్రాల్లో ప‌ర్య‌టించిన‌ట్టుగానే.. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో కూడా భార‌తీయ నేత‌లు ప‌ర్య‌టిస్తుంటారు. దీనిపై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తే ఊరుకోబోమ‌ని ఆయ‌న హెచ్చరించారు.

ఈశాన్య రాష్ట్రం అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌పై చైనా ఎప్ప‌టినుంచో క‌న్నేసింది. ఈ క్ర‌మంలోనే అక్క‌డి స‌రిహ‌ద్దుల్లో గ్రామాలను నిర్మిస్తుంది. అంత‌టితో ఆగ‌కుండా అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌ను త‌మ భూభాగంలో చూపిస్తూ అప్ప‌ట్లో చైనా మ్యాపుల‌ను ముద్రించింది. డ్రాగ‌న్ దేశం చ‌ర్య‌ల‌ను భార‌త్ మొద‌ట్నుంచి త‌ప్పుప‌డుతూనే ఉంది. 

అయిన‌ప్ప‌టికీ చైనా వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. త‌న దుందుడ‌కు చ‌ర్య‌ల‌ను కొన‌సాగిస్తూనే ఉంది. ఈ క్ర‌మంలో స‌రిహ‌ద్దుల్లో శాంతి చ‌ర్య‌లు అంటూనే చైనా క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుంది. తాజాగా 13వ కోర్ క‌మాండ‌ర్ చ‌ర్చ‌ల‌కు ముందు కూడా చైనా క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డింది. 

అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోని త‌వాంగ్ స‌మీపంలో డ్రాగ‌న్ సైనికులు భార‌త భూభాగంలోకి చొచ్చుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించారు. దాదాపు 100 మంది సైనికులు భార‌త్‌లోకి ప్ర‌వేశించ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా.. వారిని భార‌త ఆర్మీ నిలువ‌రించింది. దీంతో కొద్ది గంట‌ల సేపు యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొంది.