కేరళలో భారీ వర్షాలు, 7 జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌

భారీ వర్షాలతో కేరళ అతలాకుతలం అవుతోంది. వరదలు బీభత్సం సృష్టిస్తుండడంతో భారత వాతావరణ శాఖ నేడు (మంగళవారం) ఏడు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది.  ఇందులో తిరువనంతపురం, కొల్లాం, పతనంథిట్ట, అళప్పుజ, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి జిల్లాలు ఉన్నాయి. 

మంగళవారం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు. తూర్పుమధ్య అరేబియా సముద్రంలో తుపాను కారణంగా కేరళలో అనేక జిల్లాలు భారీ వర్షాలు, వరదలతో జలమయమయ్యాయి. మొత్తం 14 జిల్లాల్లోని 9 జిల్లాల్లో వాతావరణ శాఖ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. 

ఎర్నాకులం, ఇడుక్కి, త్రిసూర్, పలక్కాడ్, మలప్పురం, కొజికోడ్, వాయనాడ్, కన్నూర్, కాసరగొడె జిల్లాలో ఆరంజ్ కోడ్ ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా తిరువనంతపురం జిల్లాలోని అరువిక్కర, నెయ్యర్, పెప్పర రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేశారు. 

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని ప్రభుత్వం ప్రజలకు సూచించింది. మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నాలుగు ఎన్డీఆర్‌ఎఫ్‌ అదనపు బృందాలు కేరళలో మోహరించాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో రెండు బృందాలు ఉండగా, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అభ్యర్థన మేరకు తమిళనాడు అరక్కోణం నుంచి మరో నాలుగు బృందాలు ఇక్కడికి వస్తున్నాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు అలప్పుజ, ఎర్నాకుళం, కొల్లం, కొట్టాయం జిల్లాల్లో, మరొక బృందం పతనంతిట్ట, ఇడుక్కి జిల్లాల్లో మోహరించారు. 

మలప్పురంలో భారీ వర్షం కారణంగా కుప్పకూలిన ఇంట్లో ఇద్దరు పిల్లలు మరణించారు. మంగళవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడడంతో భవనం కూలిపోయింది. తీవ్రంగా గాయపడిన చిన్నారులను స్థానికులు కోజికోడ్ వైద్య కళాశాల దవాఖానకు తరలించినప్పటికీ.. వారు మార్గమధ్యంలో చనిపోయారు.

కొల్లాంలో 65 ఏళ్ల వృద్ధుడు గోవిందరాజ్ లోయలాంటి ప్రదేశంలో పడి ప్రాణాలు కోల్పోయాడు. వర్షాల కారణంగా ఆ ప్రదేశం పూర్తిగా నీటితో నిండి ఉండడంతో రోడ్డును గుర్తించలేక అందులో పడి మరణించాడు. భారీ వర్షాలతోపాటు కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో ఇడుక్కి జిల్లా కలెక్టర్ రాత్రి ప్రయాణాలను రద్దు చేశారు.