మిగులు విద్యుత్ ఉత్పత్తి అమ్మితే రాష్ట్రాలపై చర్యలు 

మిగులు విద్యుత్‌ను పవర్‌ ఎక్చేంజిలలో అమ్మితే ఆ రాష్ట్రాల కేటాయింపులు తగ్గించేస్తామని కేంద్రం హెచ్చరించింది. కొన్ని రాష్ట్రాలు ప్రజలకు విద్యుత్‌ కోతలు పెడుతూ బయట రాష్ట్రాలకు విద్యుత్‌ను అమ్ముతున్న క్రమంలో రాష్ట్రాలకు కేంద్రం ఈ హెచ్చరిక చేసింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్‌ శాఖ మంగళవారం రాష్ట్రాలకు లేఖ రాసింది.

ఇక 10 శాతం విదేశీ బొగ్గుతోపాటు దేశీయ బొగ్గును క‌లిపి విద్యుత్ ఉత్ప‌త్తిని పెంచ‌డానికి ప‌వ‌ర్ ప్లాంట్ల‌కు కేంద్రం అనుమ‌తినిచ్చింది. మిగులు విద్యుత్‌ ఉత్పత్తి ఉన్న రాష్ట్రాలు, కొరత ఉన్న రాష్ట్రాలకు విద్యుత్‌ సరఫరా చేయాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ స్టేషన్ల వద్ద ఉన్న 15 శాతం అన్‌ అలకేటెడ్‌ కోటా నుంచి విద్యుత్‌ వాడుకోవాలని విన్నవించింది. కేంద్రం వద్ద ఉన్న కేటాయించని విద్యుత్ను ప్రజల అవసరాల కోసం రాష్ట్రాలు వాడుకోవాలని సూచించింది.

దేశంలో బొగ్గు కొరత, విద్యుద్ సమస్యలపై మంగళవారం ప్రధానమంత్రి కార్యాలయం( పిఎంఓ) సమీక్ష నిర్వహించింది. బొగ్గు రవాణా పెంచడానికి మార్గాలను కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాలు, అంతర్జాతీయ ధరల కారణంగానే బొగ్గు కొరత ఏర్పడిందని అధికారులు వివరణ ఇచ్చారు. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టినందున బొగ్గు ఉత్పత్తిని పెంచామని అధికారులు వివరించారు.

 కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్‌) రికార్డు స్ధాయిలో ఉత్ప‌త్తి చేప‌ట్టినా బొగ్గు కొర‌త‌తో భార‌త్ ఇంధ‌న సంక్షోభ పరిస్థితులు ఏర్పడడానికి పెరిగిన డిమాండ్ కారణంగా తెలుస్తున్నది.  దేశంలోనే అతిపెద్ద బొగ్గు స‌ర‌ఫ‌రాదారు సీఐఎల్ ఈ ఏడాది ప్రధ‌మార్ధంలో రికార్డుస్ధాయిలో బొగ్గును ఉత్ప‌త్తి చేసింది.

ఏప్రిల్‌-సెప్టెంబ‌ర్‌లో సీఐఎల్ దాదాపు 250 మిలియ‌న్ ట‌న్నుల బొగ్గును ఉత్ప‌త్తి చేసింది. ఇది అంత‌కుముందు ఏడాది ఇదే స‌మ‌యంలో ఉత్ప‌త్తి కంటే 13.8 మిలియ‌న్ ట‌న్నులు అధికం కావ‌డం గ‌మ‌నార్హం. ప‌రిశ్ర‌మ నిపుణులు ఊహించిన దానికంటే అధికంగా ఆర్ధిక కార్య‌క‌లాపాల పునరుద్ధ‌ర‌ణ ముమ్మ‌రంగా ఉండ‌టం కూడా ప్ర‌స్తుత ప‌రిస్ధితికి కార‌ణ‌మ‌ని ఇది ఓ ర‌కంగా సానుకూలాంశ‌మేన‌ని చెబుతున్నారు. ఇక రుతుప‌వ‌నాల సీజ‌న్‌లో భార‌త్‌కు దిగుమ‌తులు జాప్యం కావ‌డం వంటి కార‌ణాలూ ఉన్నాయ‌ని అధికారులు పేర్కొన్నారు.

మ‌రోవైపు దిగుమ‌తి చేసుకునే బొగ్గుపై ఆధార‌ప‌డే విద్యుత్ ప్లాంట్లు అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ధ‌ర‌ల పెరుగుద‌ల‌తో త‌మ బొగ్గు స‌ర‌ఫ‌రాల కోసం సీఐఎల్‌ను ఆశ్ర‌యించ‌డంతో కూడా బొగ్గుకు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. 

విద్యుత్ డిమాండ్ ఊపందుకోవ‌డం కూడా ప్ర‌స్తుత దుస్ధితికి కార‌ణ‌మ‌ని, అయితే ప‌రిశ్ర‌మ వేగంగా కోలుకోవ‌డం సానుకూల ప‌రిణామ‌మేన‌ని అధికారులు చెబుతున్నారు. ఇక బొగ్గు కొర‌త‌తో ఇంధ‌న సంక్షోభం త‌లెత్త‌కుండా ఉండేందుకు సంబంధిత మంత్రిత్వ శాఖ‌లు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేస్తున్నాయ‌ని వెల్ల‌డించారు.