రాజకీయ దృష్టితో మానవ హక్కులు చూడటం ప్రమాదకరం

రాజకీయ కోణం నుండి మానవ హక్కులను చూడడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. మానవ హక్కులపై పలువురు “ఎంపిక ధోరణి” అవలంభిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 
జాతీయ మాన‌వ హ‌క్కుల సంఘం (ఎన్‌హెచ్ఆర్‌సీ) 28వ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని మోదీ  వీడియోకాన్ఫ‌రెన్స్ ద్వారా పాల్గొంటూ “ఈ రోజుల్లో కొందరు వ్యక్తులు మానవ హక్కులను తమ స్వంత కోణం నుండి వర్గీకరిస్తున్నారు. వారు కొన్ని సందర్భాల్లో మానవ హక్కుల ఉల్లంఘనలను చూస్తారు కానీ ఇతర సారూప్య కేసులలో కాదు. అలాంటి వ్యక్తుల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి” అని హితవు చెప్పారు.
రాజకీయ లాభాలు, నష్టాలను దృష్టిలో ఉంచుకుని మానవ హక్కులను చూడటం వలన ఈ హక్కులు అలాగే ప్రజాస్వామ్యం దెబ్బతింటుందని ప్రధాని స్పష్టం చేశారు. ఎంచుకున్న ప్రవర్తన ప్రజాస్వామ్యానికి హానికరం కావడమే కాకుండా దేశ ప్రతిష్టను దెబ్బతీస్తుందని చెప్పారు. అటువంటి రాజకీయాల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.

గత దశాబ్దాలలో, ప్రపంచం తప్పుదోవ పట్టి, దారి తప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని, అయితే భారతదేశం ఎల్లప్పుడూ మానవ హక్కులకు కట్టుబడి ఉందని ప్రధాని స్పష్టం చేశారు. భారత స్వాతంత్ర్య పోరాటం గురించి మాట్లాడుతూ, “మనం శతాబ్దాలుగా మన హక్కుల కోసం పోరాడాము. ఒక దేశం, సమాజంగా, అన్యాయం, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా నిరంతరం నిరసన తెలుపుతాము” అని ప్రధాని మోదీ తెలిపారు. 

 
స‌మాన‌త్వ అంశంపై ప్ర‌పంచానికి మ‌న రాజ్యాంగం కొత్త దృక్ప‌థాన్ని క‌ల్పించింద‌ని చెబుతూ గ‌త కొన్ని ద‌శాబ్ధాలుగా కొన్ని దేశాలు త‌మ ల‌క్ష్యాల నుంచి దారిమ‌ళ్లాయ‌ని, కానీ భారత్ మాత్రం త‌న సూత్రాల‌కు క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు ప్ర‌ధాని గుర్తు చేశారు. 
ట్రిపుల్ త‌లాక్‌కు వ్య‌తిరేకంగా ముస్లిం మ‌హిళ‌లు కొన్ని ద‌శాబ్ధాలుగా చ‌ట్టాన్ని డిమాండ్ చేస్తున్నార‌ని, ట్రిపుల్ త‌లాక్ చ‌ట్టాన్ని తెచ్చి వారికి కొత్త హ‌క్కుల్ని క‌ల్పించామ‌ని, హ‌జ్ స‌మ‌యంలో మ‌హ‌ర‌మ్ (మ‌గ తోడు) నిబంధ‌న నుంచి విముక్తి క‌ల్పించామని ప్ర‌ధాని మోదీ తెలిపారు. గ‌త ఏడేళ్ల‌లో 60 కోట్ల జ‌నాభా క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని చేపట్టిన అనేక కార్యక్రమాలు వారిలో హక్కుల పట్ల అవగాహనా కలిగిస్తున్నట్లు ప్రధాని చెప్పారు. తమకు మరొకరు ఉన్నార‌న్న భ‌రోసా ఇచ్చిన‌ట్లు తెలిపారు. 
 
ప‌ది కోట్ల మంది మ‌హిళ‌ల‌కు మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం,  4 కోట్ల ఇండ్ల‌కు విద్యుత్తు స‌ర‌ఫ‌రా క‌ల్పించడంలను ఉదహరించారు. స‌బ్‌కా సాత్‌, స‌బ్‌కా వికాస్‌, స‌బ్‌కా ప్ర‌యాస్ ల‌క్ష్యంతో దేశం ముందుకు వెళ్తోంద‌ని పెక్రోన్నారు. ప్ర‌తి ఒక్క‌రి మాన‌వ హ‌క్కుల్ని ర‌క్షించే మౌళిక సూత్రాల ఆధారంగా ప‌నిచేస్తున్నామ‌ని చెప్పారు. 
 
ప్ర‌భుత్వం ఏదైనా  పధకం  రూపొందిస్తే, దాంతో కొంద‌రికి మాత్ర‌మే ల‌బ్ధి చేకూరుతుంద‌ని, దాని వ‌ల్ల హ‌క్కుల అంశం బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని మోదీ తెలిపారు. అందుకే అంద‌రికీ ప‌థ‌కాలు అందే ల‌క్ష్యంతో ముందుకు వెళ్తున్న‌ట్లు ప్ర‌ధాని చెప్పారు.
 
ఉద్యోగం చేస్తున్న గ‌ర్భిణి మ‌హిళ‌ల‌కు 26 వారాల ప్రసూతి సెలవు క‌ల్పిస్తున్న‌ట్లు ప్ర‌ధాని చెప్పారు. శిశువు హ‌క్కుల ర‌క్ష‌ణ‌లో ఇది కీల‌కం అని తెలిపారు. మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం 700 జిల్లాల్లో వ‌న్‌స్టాప్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేశామ‌ని, వాటిల్లో మెడిక‌ల్‌, పోలీస్‌, మెంట‌ల్ కౌన్సిలింగ్ ఉంటుంద‌ని పేర్కొన్నారు. 650 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశామ‌ని, అత్యాచారం లాంటి హేయ‌మైన నేరాల‌కు మ‌ర‌ణ‌శిక్ష‌ల‌ను విధిస్తున్నామని ప్ర‌ధాని వివరించారు. 
 
2014 లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి మానవ హక్కులను పరిష్కరించడానికి ప్రభుత్వం పేదరికాన్ని తొలగించేందుకు ప్రాధాన్యత ఇస్తునదని  ఎదుర్కొందని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. “రాజ్యాంగం ప్రకారం ట్రాన్స్‌జెండర్స్ హక్కులు పొందడం ఇదే మొదటిసారి” అని ఆయన గుర్తు చేశారు.

జూన్‌లో మానవ హక్కుల సంస్థ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ అరుణ్ మిశ్రా మాట్లాడుతూ కమీషన్  స్థాపించబడినప్పటి నుండి, 20 లక్షలకు పైగా కేసులను పరిష్కరించి, బాధితులకు రూ. 205 కోట్ల పరిహారాన్ని అందజేసినట్లు చెప్పారు.