ఆఫ్ఘన్, పాక్, ఇరాన్ సరుకులకు ఆదానీ పోర్ట్ లు బంద్ 

దేశవ్యాప్తంగా అనేక రేవుపట్టణాలు నిర్వహిస్తున్న అదానీ పోర్ట్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్, అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్ వంటి దేశాలకు తమ టెర్మినళ్ల నుంచి సరకుల రవాణా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ దేశాల నుండి మాదకద్రవ్యాలు మన దేశంలోకి ప్రవేశిస్తున్నట్లు స్పష్టం కావడంతోనే ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. 

ఈ నిర్ణయం నవంబర్ 15 నుంచి అమలులోకి రానున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. థ‌ర్డ్ పార్టీ టెర్మిన‌ల్స్ స‌హా అదానీ పోర్ట్స్ నిర్వ‌హించే అన్ని టెర్మిన‌ల్స్‌కూ ఇది వ‌ర్తిస్తుంద‌ని అదానీ గ్రూప్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

గ‌త నెల 13న గుజ‌రాత్‌లోని అదానీ గ్రూప్ న‌డిపే ముంద్రా పోర్ట్‌లో 3 వేల కిలోల హెరాయిన్ సీజ్ ప‌ట్టుబ‌డిన విష‌యం తెలిసిందే. దీని విలువ సుమారు రూ.20 వేల కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా. ఈ భారీ డ్ర‌గ్ స్కామ్‌తో షాక్ తిన్న అదానీ  గ్రూప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సెప్టెంబర్ నెలలో అఫ్ఘానిస్థాన్ నుంచి ఇరాన్ బందర్ అబ్బాస్ పోర్టు మీదుగా గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు చేరకున్న 3000 కిలోల హెరాయిన్‌ను డిఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో అదానీ గ్రూప్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి.  ఆ కేసును కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఐఏకు అప్పగించింది.

గ‌త నెల‌లో దొరికిన డ్ర‌గ్స్ కన్‌సైన్‌మెంట్ ఆఫ్ఘ‌నిస్థాన్ నుంచి వ‌చ్చింది. ప్ర‌పంచంలో అతిపెద్ద అక్ర‌మ ఒపియం ర‌వాణాదారుల్లో ఒక‌టి ఆఫ్ఘ‌నిస్థాన్‌కు పేరుంది. ప్రాసెస్ చేయ‌ని టాల్క‌మ్ పౌడ‌ర్ అంటూ పెద్ద పెద్ద బ్యాగుల‌లో ఈ హెరాయిన్‌ను త‌ర‌లించారు. పైన టాల్క‌మ్ పౌడ‌ర్ రాళ్ల‌ను పెట్టి, కింది భాగంలో డ్ర‌గ్స్ ఉంచారు. ఈ భారీ అక్ర‌మ ర‌వాణా వెలుగు చూసిన త‌ర్వాత దేశ‌వ్యాప్తంగా సోదాలు జ‌రిగాయి. ఆఫ్ఘ‌న్‌, ఉజ్బెకిస్తాన్‌ల‌కు చెందిన 8 మందిని అరెస్ట్ చేశారు.