సెంటు, సెంటున్నర స్థలాల్లో ఇళ్ళు కడతారా? హైకోర్టు ప్రశ్న 

వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాకరంగా చేపట్టిన ‘పేదలందరికీ ఇళ్ల పథకం’ అమలుకు రాష్ట్ర హైకోర్టు బ్రేక్ వేసింది. సెంటు, సెంటున్నర స్థలాల్లో గృహ సముదాయాలు ఏర్పాటు చేస్తామనడంలో హేతుబద్ధతనూ ప్రశ్నించింది. దీనిపై  లోతైన అధ్యయనం అవసరమని తెలిపింది. అప్పటిదాకా ఈ పథకాన్ని అమలు చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణ మూర్తి శుక్రవారం ఈ కీలక తీర్పు వెలువరించారు. ‘నవ రత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సర్కారు నిర్ణయించుకుంది. దీనిపై  2019 డిసెంబరు 2న జారీ చేసిన 367, 488 మార్గదర్శకాల జీవోలను సవాల్‌ చేస్తూ తెనాలికి చెందిన పొదిలి శివమురళి, మరో 128 మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

పట్టాలను కేవలం మహిళా లబ్ధిదారులకే కేటాయించడంపై కూడా  అభ్యంతరం తెలిపారు. పారదర్శకంగా ఇళ్ల  స్థలాలు కేటాయించేలా అధికారులను ఆదేశించాలని కోరారు. వాదోపవాదాలు విన్న అనంతరం జస్టిస్‌ సత్యనారాయణ మూర్తి సుదీర్ఘ తీర్పు వెలువరించారు.

‘‘పట్టణ ప్రాంతాల్లో ఒక సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్ల స్థలంలో ఇంటిని కట్టుకోవాలంటున్నారు. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా లేదు. గృహ సముదాయాలు నిర్మించేటప్పుడు… ఆ ప్రాంతంలోని జనసాంద్రతకు అనుగుణంగా మౌలికవసతులు కల్పించకపోతే భవిష్యత్తులో అవి ‘మురికివాడలు’గా మారతాయి’’ అని హైకోర్టు పేర్కొంది.

స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టుకొమ్మని చెప్పే ముందు ప్రభుత్వం పర్యావరణ ప్రభావం, అనారోగ్య సమస్యలు, అగ్ని ప్రమాదాల నివారణ, మంచినీటి లభ్యత, మురుగు రవాణాకు తగిన సౌకర్యాలు ఉన్నాయా? లేదా? అనేది పరిశీలించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. ప్రభుత్వం ఆ పని చేయలేదని తెలిపింది.

‘రైట్‌ టు షెల్టర్‌’ పొందేందుకు చట్టాలు ఉన్నాయని… కానీ, ఎంత విస్తీర్ణంలో ఇళ్లు ఉండాలనే చట్టాలు లేవని చెబుతూనే  ‘‘మానవహక్కులు, అంతర్జాతీయ ఒప్పందాలలో భారతదేశం భాగస్వామిగా ఉన్నందున తగినంత నివాస స్థలం కలిగి ఉండడం మానవ హక్కుల్లో భాగమే అని స్పష్టం చేసింది. అలా లేకపోతే జరిగే అనర్థాలపై నిపుణుల కమిటీతో అధ్యయనం చేయాలని సూచించింది.

ఇళ్ల నిర్మాణం విషయంలో పర్యావరణ ప్రభావం, ఆరోగ్య సమస్యల పై  అధ్యయనం చేసేందుకు కేంద్ర  కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర గృహ పట్టణాభివృద్ధి మంత్రిత్వ వ్యవహారాల శాఖ, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖలతో కూడిన ముగ్గురు నిపుణులతో నెల రోజుల్లో కమిటీ వేయాలి. ఆ కమిటీ ఏర్పాటైన నెలలో తన నివేదిక అందించాలి.

కమిటీ నివేదికను రెండు స్థానిక పత్రికల్లో ప్రచురించి, ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలి. ఆ తర్వాతే ‘పేదలందరికీ ఇళ్లు’ పథకాన్ని ఖరారు చేయాలి. ప్రత్యేక కమిటీ నివేదిక ఆధారంగా అవసరమైతే అదనంగా భూమి కొనుగోలు చేసి, ఇంటి స్థలం విస్తీర్ణం పెంచి లబ్ధిదారులకు కేటాయించిన లేఅవుట్‌లను సవరించాలి. ఈ ప్రక్రియ ముగిసేంత వరకు ‘నవరత్నాలు -పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద లబ్ధిదారులకు కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టవద్దని ఆదేశించింది. 

‘‘మహిళలకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు కోర్టు వ్యతిరేకం కాదు. కానీ, మహిళలకు మాత్రమే ఇస్తామనడం వివక్ష చూపడమే. అర్హులైన పురుషులు, ట్రాన్స్‌జెండర్లకు కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలి’’ అని హైకోర్టు తెలిపింది.  మహిళల పేరుతో మాత్రమే ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్న ప్రభుత్వం నిర్ణయం అధికరణ 14,15(1) 39కి విరుద్ధమని తేల్చి చెప్పింది. మానవహక్కుల యూనివర్సల్‌ డిక్లరేషన్‌కు వ్యతిరేకమని పేర్కొంది.

కేటాయించిన ఇంటి స్థలాన్ని ఐదు సంవత్సరాల తర్వాత విక్రయించుకొనే వెసులుబాటు కల్పించడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. అలా విక్రయించుకుంటే లబ్ధిదారులు మళ్లీ నిరాశ్రయులు అవుతారని పేర్కొంది. ఏపీ అసైన్డ్‌ భూముల బదిలీ నిషేధం చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా డీ-ఫామ్‌ పట్టాలు మాత్రమే ఇవ్వాలని తెలిపింది. కన్వేయన్స్‌ డీడ్‌లు చెల్లవని,  వాటిని రద్దు చేయాలని తెలిపింది.