కార్వీ స్టాక్ బ్రోకింగ్ ఉపాధ్య‌క్షుడి అరెస్ట్‌!

కార్వీ రుణాల కుంభ‌కోణం కేసులో కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ ఉపాధ్య‌క్షుడు శ్రీకృష్ణ‌ను హైద‌రాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్వెస్ట‌ర్లు కొనుగోలు చేసిన షేర్ల‌ను నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా.. స్టాక్ మార్కెట్ల నియంత్ర‌ణ సంస్థ‌ సెబీకి తెలియ‌కుండా తొమ్మిది డొల్ల కంపెనీల్లోకి మ‌ళ్లించ‌డంలో శ్రీ‌కృష్ణ పాత్ర ఉన్న‌ట్లు పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది.

సెబీకి చెప్ప‌కుండా స‌ద‌రు షేర్ల‌ను బ్యాంకుల్లో తాక‌ట్టుపెట్టి కార్వీ స్టాక్ బ్రోకింగ్ రూ.1500 కోట్ల రుణాలు తీసుకున్న‌ది. ఈ రుణాల‌ను కూడా శ్రీ‌కృష్ణ స‌ద‌రు తొమ్మిది డొల్ల కంపెనీల‌కు మ‌ళ్లించారు. ఆయ‌న మ‌దుప‌ర్ల‌కు న‌ష్టం క‌లిగించ‌డంతోపాటు రుణాల‌ను రూల్స్‌కు భిన్నంగా దారి మ‌ళ్లించార‌ని పోలీసులు గుర్తించారు.

ఇప్ప‌టికే ఈ కేసులో కార్వీ చైర్మ‌న్ పార్ధ‌సార‌ధి, సీఈవో కృష్ణ హ‌రి, సీవోవో రాజీవ్ సింగ్‌, కంపెనీ కార్య‌ద‌ర్శి శైల‌జ‌ల‌ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. కార్వీ సంస్థ హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న‌ట్లు ఆయా బ్యాంకులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశాయి.